కాన్ఫిడెన్షియల్ ఇన్ ఫర్మేషన్ లీక్ చేస్తున్నారు: ఎన్నికల కమిషనర్
రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం ఎన్నికల కమిషన్ కు రాకముందే టివిలకు వెళ్లుతూ ఉండటం పట్ల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విస్మయం వ్యక్తం చేశారు.
ఈ రోజు ఆయన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తూ ప్రభుత్వం నుంచి ఇన్ ఫర్మేషన్ లీక్ అవుతున్న విషయం వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు మధ్య నడిచే ఉత్తర ప్రత్యుత్తరాలు గోప్యం ఉండాలి. కాని, నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిథ్యనాథ్ దాస్ రాసిన లేఖ నాకు రాకvముందే టివిలలో కనిపించింది,’ అని ఆయన చెప్పారు. ప్రభుత్వం కొన్ని విషయాలను కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలని సూచించారు.
ఆర్టీఐ చట్టం ఉన్నా, కొన్ని విషయాలలో సమాచారం బయటకు ఇవ్వడానికి వీల్లేదని, అయినా చీఫ్ సెక్రెటరీ రాసిన లేఖలు బయటకు వెళ్లాయని ఆయన అన్నారు.
కమిషన్ లో చాలా అధికారులు పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. సెక్రెటరీ పోస్టు ఖాళీ, జాయింట్ సెక్రెటరీ పోస్టు ఖాళీ, న్యాయ సలహాదారు ఎవరూ లేరు. ఇపుడున్న వైషమ్య వాతావరణంలో ఆయన అడిగినా వీటిని నింపే పరిస్థితి లేదు. అయినా ఉన్న సిబ్బందితోనే రమేష్ కుమార్ ఎన్నికలను నిర్వహించాలనుకుంటున్నారు. చుట్టూర వ్యతిరేకత, అధికారుల సహాయ నిరాకరణ, రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ, సిబ్బంది సహాయ నిరాకరణ మధ్య పనిచేస్తున్నారు. అంతేకాదు, చాలా పవర్ ఫుల్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారు. దానికి తోడు కమిషనర్ పదవి నుంచి ఆయన ఏప్రిల్ లో రిటైర్ అవుతారు.
అయినా సరే పర్యవసానాలను ఖాతరు చేయకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను నిర్వహించేందుకే సిద్ధమయ్యారు. ప్రభుత్వం సహకరిస్తుందని ఆశిస్తున్నారు. సహకరించకపోతే, ఆ విషయాన్ని సుప్రీంకోర్టు కు నివేదిస్తామని చెబుతున్నారు. రాజ్యంగం ప్రకారం నిర్వహిస్తున్న ఎన్నికలను ఉద్యోగులు వ్యతిరేకిస్తే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని ఆయన హెచ్చరిక చేశారు.
ఇలాంటి భయం గొలిపే ప్రభుత్వ వ్యతిరేత మధ్య మరొక ఆఫీసర్ అయితే, పారిపోయే వారేమో!
ఎందుకీ ఎన్నికల గొడవ? ప్రభుత్వంతో వివాదం ఏందుకు? రిటైరై ప్రశాంతంగా జీవితం గడపకుండా ఈ రాద్ధాంతమంతా ఎందుకు? అని నోటిఫికేషన్ జోలికి వెళ్లకుండా, కరోనా వ్యాక్సినేషన్ సాకు చెపి గుడ్ బై కొట్టి వెళ్లిపోయేవారు.
కాని రమేష్ కుమార్ ధైర్యంగా నిలబడ్డారు. నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికలు జరిపించి తీరాలంటున్నారు.అది కమిషన్ కు రాజ్యాంగం అప్పగించిన విధి. ఒక వేళ కోర్టు తీర్పు మరోలా వస్తే గౌరవిస్తానంటున్నారు.
“ ఎన్నికల సంఘం అనేది రాజ్యంగం రచించిన డాక్టర్ అంబేడ్కర్ మానస పుత్రిక. ఎన్నికలను సకాలంలో నిర్వహించడం కమిషన్ విధి. ఎన్నికల వల్ల స్థానిక నాయకత్వం బలపడుతుంది. ఎన్నికల్లో పాల్గొనాలని ప్రజలు అసక్తి తో ఉన్నారు. వారి అభిప్రాయం గౌరవించాలి. ఎన్ని సవాళ్లయిన అధిగమించి ముందుకు వెళ్లాను,’ అని ఆయన ప్రకటించారు.