ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద విరుచుకు పడ్డారు.
రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీ ఉందని, ఎన్నికలు ఎలాజరుపుతారని ప్రశ్నించారు. రేపు ఎన్నికల పోలింగ్ వల్ల కరోనా సోకి ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డకు రైట్ టూ లివ్ ఆర్టికల్ తెలియదా అని అన్నారు. 2018లో జరగాల్సిన ఎన్నికలు 2021లో ఎందుకు జరుపుతున్నారో నిమ్మగడ్డ చెప్పాలి. కమిషనర్ ది ఫాల్స్ ప్రెస్టేజి. ఎవరి ప్రాపకం కోసం కోవిడ్ లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు? ఇది నియంతృత్వ పోకడ. రాజ్యాంగ వ్యవస్థ అధిపతిగా ఉండి నిబంధనలను అతిక్రమిస్తున్నారు,’ అన్నారు. వివరాలు:
1. ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ పూర్తిగా పొలిటికల్ ప్రెస్ మీట్ తరహాలో ఉంది. రాజ్యాంగబద్ధమైన స్థానానికి బాధ్యత వహించిన వ్యక్తి ప్రెస్ మీట్ లా అనిపించలేదు. ఆయన ఎందుకు ప్రెస్ ను ఎదుర్కోలేకపోయారు, మీడియా ప్రశ్నలు అడుగుతుంటే ఏదో తప్పు చేసిన వారిలా ఎందుకు పారిపోయారు. ఏదో రాసుకోని వచ్చి చదివేసి వెళ్ళిపోయారు.
2. రాజ్యాంగం ప్రకారం 2018లో ఎన్నికలు జరగాల్సి ఉంటే.. 2021లో జరగటానికి ప్రధానమైన కారకులు ఎవరు..!? అని సూటిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ప్రశ్నిస్తున్నా. సమాధానం చెప్పకుండా తప్పించుకోవటానికి ప్రయత్నం చేయవద్దు.
3. రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న తరుణంలో ఎవరి ప్రాపకం, రాజకీయ లబ్ధి కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మీరు చుట్టూ అద్దాలు బిగించుకుని ప్రెస్ మీట్ పెట్టారు. రేపు ఎన్నికల పోలింగ్ కోసం ఇతర ప్రాంతాల నుండి వలస కార్మికులు వస్తారు. గతంలో వలస కార్మికుల ద్వారా కరోనా వ్యాపించిన సందర్భం ఉంది. కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. కరోనాతో ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారు ?
4. ఎన్నికల కమిషనర్ ఫాల్స్ ప్రెస్టేజ్కు పోతున్నారు. మీరు కుర్చీలో ఉండగా ఎన్నికలు జరపాలా.. మరొకరు జరపకూడదా..? ఎందుకంత నియంతృత్వ పోకడ..? ప్రంట్ లైన్ వారియర్స్ కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీపై లేదా.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి బెదిరింపు ధోరణిలో వెళ్లడం సబబేనా..? ఒక రాజ్యాంగ వ్యవస్థ అధిపతిగా ఉండి నిబంధనలను అతిక్రమిస్తున్నారు. సీఎస్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా న్యాయస్థానం తీర్పును మీరు ఉల్లంఘించలేదా..?
5. రాజ్యాంగంలో సైతం ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించమని ఎక్కడా చెప్పలేదు. ఇప్పటికే ఎన్జీవోలు ఎన్నికల విధులు బహిష్కరించారు. రేపో మాపో పోలీసులు కూడా ఎన్నికలను బహిష్కరిస్తారు. అప్పుడు ఎవరు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికలు వద్దని ఉద్యోగులు, ప్రజలు తిరగబడితే మీ పరిస్థితి ఏంటి..?
6. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉంది. దాన్ని మీరు కాలరాస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న మీకు రైట్ టూ లివ్ ఆర్టికల్ తెలియదా..?. కొద్ది మంది వ్యక్తుల ప్రయోజనాల కోసం మీరు తీసుకున్న నిర్ణయం ప్రజల ధన, మాన, ప్రాణాలకు భంగం వాటిల్లుతుంది. దీనిపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానం ఏం చెబుతుందో వేచి చూడాలి. దీనిపై ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవసరం అయితే దీనిపై ప్రజల్లోకి రెఫరెండం(ఎన్నికల నిర్వహణ పై ప్రజాభిప్రాయ సేకరణ )కు వెళ్లాలి.