ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల బహిష్కరణకు పూనుకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎన్నికల నిర్వహణకు పూనుకున్నారు. ఆయన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు.
నిజానికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక, అధికార యంత్రాంగాన్నిరాష్ట్ర ప్రభుత్వం కమిషన్ అదుపులోకి తీసుకురావాలి. ఇది రాజ్యాంగ నియమం.
కమిషన్ తో విబేధాలున్నా సరే, ఇది తప్పదు. అయితే రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్య నాథ్ దాస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదని ప్రకటించారు. కమిషన్ ఈ మేరకు లేఖ రాశారు.
ఇది కూడా చెల్లదు. ఈ లేఖని ఖాతరు చేయకుండా కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
కమిషన్ కు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, సుప్రీం కోర్టు తీర్పు వస్తే గౌరవిస్తామని ఈ సందర్భంగా మాట్లాడుతూ కమిషనర్ అన్నారు.
ప్రకాశం, విజయనగరం మినహా మిగతా జిల్లాల్లో ఎన్నికలు జరుగుతాయని చెబుతూ నాలుగు దశల్లో పంచాయతీలకు నిర్వహిసామని ఆయన తెలిపారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించడం కమిషన్ విధి అని కూడా ఆయన చెప్పారు.
మరిపుడేం జరుగుతుంది. నామినేషన్లు వేసేందుకు జనం ముందుకు వస్తారు. నామినేషన్ల స్వీకరించేందుకు అధికారులు ముందుకు వస్తారా?
వాళ్లు రాకపోతే, నామినేషన్ల పరిస్థితి ఏమిటి? పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించడమనేది రాజ్యంగ నియమం. పంచాయతీ ఎన్నికల నామినేషన్లను అధికారులు స్వీకరించకపోతే, అభ్యర్థులు కోర్టును ఆశ్రయించవచ్చు. ఒక్క వైసిపి తప్ప అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి.వాళ్లంతా నామినేషన్లు వేసేందుకు వస్తారు. వాళ్లని అడ్డుకునే ప్రయత్నం జరగుతుంది. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్త వచ్చు.మరి పోలీసుల పాత్ర ఏమిటి? నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థులకు రక్షణ కల్పిస్తారా?
కొసమెరుపు: ఇపుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుమీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీమ్ కోర్టును ఆశ్రయించి, ఎన్నికల వాయిదా కోరుతూ ఉంది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. సాధారణంగా ఎన్నికల ప్రాసెస్ మొదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోవు. మరలాంటపుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంచేస్తుంది?
ఒక వేళ సుప్రీంకోర్టు ఎన్నికలను రద్దు చేస్తే, సమస్యశాంతియుతంగా పరిష్కారమవుతుంది. లేదంటే, రాజ్యాంగ సంక్షోభమే. ఇది కొత్త రకం సంక్షోభం. ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఎపుడూ ఎదురుకాని సంక్షోభం. ఇాదెలా సమసిపోతుంది?
సుప్రీంకోర్టు ఎన్నికల ప్రాసెస్ ను అపలేం అని చెబితే, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందా? పోలీసులు సహకరిస్తారా? ఇప్పటికే ఎన్నికల బహిష్కరించామని ప్రకటించిన ఎపి ఉద్యోగులేం చేస్తారు? వాళ్లు విధులకు వస్తారా? ఇలాంటపుడు కమిషనర్ రమేష్ కుమార్ ఏంచేస్తారు? కోర్టులుజోక్యం చేసుకుంటాయా? రాజ్యాంగ సంక్షోభం అని కోర్టుల వ్యాఖ్యానిస్తాయా? ఇలాంటి సంక్షోభ సమయంలో కేంద్రం, రాష్ట్ర పతి భవన్ పాత్ర ఏమిటి?
ఈ రోజు విడుదలయిన నోటిఫికేషన్ వివరాలు:
జనవరి 23: నోటిఫికేషన్ విడుదల
జనవరి 25: నామినేషన్ల స్వీకరణ
జనవరి 27: నామినేషన్ల దాఖలుకు తుది గడవు
జనవరి 28: నామినేషన్ల పరిశీలన
జనవరి 29: నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
జనవరి 30: అభ్యంతరాలపై తుది నిర్ణయం
జనవరి 31: నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
ఫిబ్రవరి 5: పోలింగ్ తేదీ, అదే రోజు ఫలితాలు