ఇఫ్లూ (English and Foreigh Languages University EFLU)లో అధ్యాపక నియామకాల్లో బీసీ లకు జరుగుతున్న అన్యాయం పై జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజి ఆచారికి వినతిపత్రం అందజేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్
హైదరాబాద్ జనవరి 22 2021:ఏఐసీసీ అధికార ప్రతినిధి డా.దాసోజు శ్రవణ్..ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి హైదరాబాద్ దిల్ కుషా విశ్రాంతి భవనం లో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారిని కలిసి ఇఫ్లూ లో జరుగుతున్న బీసీ వ్యతిరేక విధానాలపై వినతిపత్రం అందజేశారు.
వెనకపడ్డ తరగతులకు చెందిన వ్యక్తి ప్రస్తుతం ప్రధానిగా ఉన్న మన దేశంలో ముఖ్యంగా వెనకపడ్డ వారికే దేశవ్యాప్తంగా అన్యాయం జరుగుతోందని ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అనేక విద్యాసంస్థల్లో బీసీలకు మొండిచేయిచూపెడుతున్నారని అన్నారు.ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో గాని,అటు వరంగల్ లోని కాళోజి హెల్త్ యూనివర్సిటీలతో పాటుగా కొత్తగా ఏర్పాటైన ఇఫ్లూ లో కూడా బీసీ రిజర్వేషన్లను తుంగలో తొక్కుతున్నారని శ్రవణ్ మండిపడ్డారు.ఇఫ్లూ లో మంజూరైన 236 అధ్యాపక పోస్టులలో ప్రభుత్వం నిర్దేశించిన 27% ప్రకారం 64మంది అధ్యాపకులు పనిచేయాల్సి ఉండగా కేవలం 27మందితోనే నెట్టుకొస్తున్నారని దుయ్యబట్టారు.ఈ మధ్యనే ఇఫ్లూ యాజమాన్యం 58 ఉద్యోగాలకు ఇచ్చిన నోటిఫికేషన్ లో బీసీ లకు కేవలం 8 పోస్టులనే కేటాయించడం దారుణమని అన్నారు.ఇఫ్లూ ఉపకులపతి సురేష్ కుమార్,రిజిస్ట్రార్లు కనీసం 30 మంది అర్హులైన బీసీ సామాజికవర్గాల వారికి శాశ్వత అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయమై జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారికి వినతి పత్రం ఇవ్వగా వారు వెంటనే స్పందించి ఇఫ్లూ ఉపకులపతికి,రిజిస్ట్రార్ కి నోటీసులు జారీచేసి 24 గంటల్లో వివరాలు అందించాలని ఆదేశాలు జారీచేశారు.ఎట్టి పరిస్థితుల్లో ఒక్క శాతం పోస్టు అయినా కానీ బీసీ లకు అన్యాయం జరిగితే సహించేదిలేదని అన్నారన్నారు.
ఈ వ్యతిరేకవిధానాలపై ఇఫ్లూ కులపతి సురేష్ కుమార్ ను సూటిగా ప్రశ్నించారు.ఎవరూ తమ బీసీ బిడ్డలకు తమ సొంతంగా ఉద్యొగాలు కల్పించడం లేదని అసలు రాజ్యాంగ బద్దంగా బీసీ లకు లభించిన హక్కులను కాపాడుకోడానికి బీసీ లు కమీషన్ల వెంబడి తిరగాల్సిన దుస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేసారు.
ఉపకులపతి సురేష్ కుమార్ యూజీసీ నియమనిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించడంతో పాటుగా తనకు కావాల్సిన బంధుమిత్రులకొరకు అనుకూలంగా నియమాలను మార్చి మొదటి నోటిఫిలేషన్ ను రద్దు చేసి రెండో నోటిఫికేషన్ విడుదలచేసి సరైన విద్యార్హతలు లేని తన వారికి కట్టబెట్టాలని చూస్తున్నారని అన్నారు.ఉపకులపతి యూనివర్సిటీ తన సొంత జాగీరులా అనుకుంటూ అర్హులైన బీసీ లకు అన్యాయం చేస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు.అధ్యాపక ఉద్యోగ భర్తీకి సంబంధించిన స్క్రీనింగ్ కమిటీ ని సైతం నియమించలేదని శ్రవణ్ దుయ్యబట్టారు.
ఇఫ్లూ లో జరుగుతున్న అప్రజాస్వామిక మరియు బీసీ వ్యతిరేక విధానాలను అరికట్టాలని బీసీలకు న్యాయం జరగడానికి తక్షణం జోక్యం చేసుకోవాలని తెలంగాణరాష్ట్ర గవర్నర్ ,కేంద్ర విద్యాశాఖ మంత్రి ని శ్రవణ్ కోరారు.
డా.శ్రవణ్ వినతి పత్రానికి స్పందించిన సభ్యులు ఆచారి ఇఫ్లూ ఉపకులపతి సహా అధికారులను 25/01/2021 న ఉదయం 10:30లకు తమ ముందు సమగ్ర వివరాలతో హాజరు కావాలని ఆదేశించారు.