కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని ప్రాజక్టు కోసం జరిగిన కొనుగోళ్లను 1686 కోట్ల నుంచి రు. 7348 కోట్లు పెంచి చూపించారని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు.
నాగంజనార్దన్ రెడ్డి రాజకీయంగా ఈ మధ్య అంత యాక్టివ్ గాలేరు. తెలుగుదేశం పార్టీలో ఉన్నపుడు ఆయన రాష్ట్రంలో మంచి వక్త. కెసిఆర్ విమర్శకుల్లో ఒకరు. ఎపుడూ వినిపించిన గొంతు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక మూగవోయిన గొంతుల్లో నాగం ఒకరు. కొంతమంది టిఆర్ ఎస్ లో చేరి మాట్లాడటం మానేస్తే, మారిని రాజకీయ పరిస్థితుల్ల మూగవోయిన తరం మరొకటి. ఈ జాబితాలోకి వస్తారు నాగం.
ఈ రోజు ఉన్నట్లుండి ఆయన మళ్లీ వార్తలకెక్కారు. ఆయన కాళేశ్వరం ప్రాజక్టులో అవినీతి జరిగిందని బాంబ్ షెల్ వేశారు.
ఆయన ఏమంటున్నారంటే..
కాళేశ్వరం ప్రాజెక్టు 4 ప్యాకేజీలకు సంబంధించి పంపులు, మోటార్ల కొనుగోళ్ల విషయంలో 5,662 కోట్ల రూపాయల అవినీతి జరిగింది.
. కాళేశ్వరం ప్యాకేజీ 6,8,10,11 లలో పంపులు మోటార్లకు BHEL సప్లై చేసిన ధర 1686 కోట్లు మాత్రమే.
ఐతే.. అగ్రిమెంట్ వాల్యూ రు. 7348కోట్ల రూపాయలని చూపించారు.ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా తేలింది. వాస్తవ ధరకు, ప్రభుత్వం చూపిన అగ్రిమెంట్ ధర మధ్య తేడా 5 వేల 662 కోట్ల రూపాయలు ఉంది.
ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజా ధనం ఎవరి చేతుల్లోకి వెళ్లింది?. ఈ దోపిడీలో ప్రభుత్వ పెద్దల వాటా ఎంత?
ఈ సమాచారాన్ని బీహెచ్ఈఎల్, ప్రభుత్వం నుంచి నేను ఆర్టీఐ ద్వారా సేకరించాను.
దీని మీద ప్రభుత్వం స్పందించాలి.