అమరావతి, జనవరి,16 : ఎపిలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన గాడి తప్పిందని, విధ్యంసాలను ప్రశ్నించిన వారిపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించే బాధ్యతలో వున్న డిజిపి గౌతమ్ సవాంగ్ అసలు నేరస్తులను వదిలి పెట్టి ప్రతిపక్ష పార్టీలపై గురిపెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించి ప్రజల దృష్టి మరల్చాలన్న ప్రశాంత్ కిశోర్ వ్యూహానికి పోలీసులు ఊతమిస్తున్నారని విమర్శించారు. బోగి రోజు విగ్రహాల విధ్వంసం దొంగలు, మతిస్థిమితం లేని వారి చర్యలని ప్రకటించిన డిజపి కనుమ రోజు మాటమార్చి రాజకీయ పార్టీలను ఇరికించడం వెనుక కుట్ర ఉందని చెప్పారు.
సంక్రాంతి రోజు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి మందలించడం వల్లే డిజిపి మాటమార్చారని ఆరోపించారు. రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసాలకు పాల్పడున్నది తానే అంటూ కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీన్ చక్రవర్తి చెపుతుండగా టిడిపి, బిజెపి కార్యకర్తలను ఇరికించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఆ పాస్టర్ కు మంత్రి కన్నబాబు, ఎంపి వంగా గీత తదితర నేతలతో వున్న సంబంధాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. పేదకుటుంబలో పుట్టిన ప్రవీణ్ 1000 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో ఆరాతీసి తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఆయన విద్యాసంస్థల ముసుగులో సాగిస్తున్న మోసాలను బయట పెట్టాలన్నారు. నిజమైన నిందితులను వదిలేసి ప్రతిపక్షాల నోరు నొక్కే ప్రయత్నం మానుకోవాలని సుధాకర్ రెడ్డి డిజిపికి హితవు చెప్పారు.