(ఇఫ్టూ ప్రసాద్ -పిపి)
ఢిల్లీ సమీపంలో కొనసాగుతున్న రైతాంగ ప్రతిఘటనకు నేటికి 48వ రోజు. ఈ జనవరి 26న రిపబ్లిక్ డే రోజు (62వ రోజు) “మా ట్రాక్టర్లు, ట్రక్కుల తో ఢిల్లీ లోపలకు వస్తాం” అని ఐక్య రైతాంగ పోరాట కమిటీ ప్రకటించింది.
ఈ నేపద్యంలో ఈరోజు సుప్రీం కోర్టు మూడు వ్యవసాయ చట్టాలపై స్టే ఆర్డర్ ఇచ్చింది. కేంద్రం ఈ ట్రాక్టర్ల ర్యాలీని నిలపాలని కోర్టును వేడుకుంది. ఇది ఎవరి పక్షాన ఇచ్చింది? ఈ క్రింద ప్రశ్నలు పరిశీలించి ఒక తీర్పు ఇవ్వొచ్చునేమో!
వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయించుకునేంత వరకూ పోరాడే మానసిక సంసిద్ధత రైతాంగంలో వున్న పరిస్థితి లో ఒకవేళ స్టే ఉత్తర్వు వస్తే, ప్రభుత్వానికి లాభం.
ఎన్నాళ్ళు పోరాడినా మొండి ప్రభుత్వం తమ కోర్కెల్ని పరిష్కరించడం లేదనే నిస్పృహతో తమ దిగ్బంధన కార్యక్రమం నుండి రైతాంగం క్రమంగా వెనక్కి తగ్గే భావన (మూడ్) లో ఉన్న పరిస్థితి లో స్టే ఉత్తర్వు వస్తే, రైతాంగానికి లాభం.
చట్టాల రద్దు కై పోరాడే రైతాంగాన్ని లాఠీ, తూటాల నిర్బంధంతో అణిచివేయ జూసే కొద్దీ, వారి ప్రతిఘటన దశదిశలా వ్యాపించడంతో పాటు ప్రభుత్వ రద్దు (బర్తరఫ్) డిమాండ్ వైపు కూడా రూపాంతరం చెందే అవకాశం ఉన్న పరిస్థితి లో స్టే ఆర్డర్ వస్తే, ప్రభుత్వానికి పరమ అనుకూలం.
చట్టాల రద్దు కై పోరాడే రైతాంగాన్ని క్రూర అణిచివేత ద్వారా లొంగదీసుకునే వీలు వున్న పరిస్థితి లో స్టే వస్తే, రైతాంగానికి లాభం.
ఒక్కమాటలో చెప్పాలంటే, బంతిని నేలకేసి కొట్టేకొద్దీ, అది మరింత పైకి ఎగిరి & ఎగిసి పడ్డట్లు రైతాంగంలో చైతన్యం ఉన్న పరిస్థితి లో స్టే ఆర్డర్ వస్తే, అది ప్రభుత్వానికి లాభం.
బంతిని నేలకేసి కొడితే, తిరిగి పైకి లేవకుండా, నేలకు కప్ప వలె కరుచుకు పోయే స్థితిలో రైతాంగం ఉన్న సమయంలో స్టే ఆర్డర్ వస్తే, అది రైతాంగానికి లాభం.
( గమనిక :-బంతిని రైతాంగంతో, అందులోని గాలిని రైతాంగ చైతన్యంతో పోల్చి చెప్పడం జరిగింది)
ఈ స్టే ఆర్డర్ ఎవరి పక్షాన ఇ(వ)చ్చినట్లు? సుప్రీం కోర్టు తీర్పు పై కూడా ప్రజా తీర్పు అవసరమేమో! అలా చెప్పాల్సి వస్తే, ఏ తీర్పు ఇద్దాం? మీ నిస్పాక్షికంగా తీర్పు ఏమిటో..