బెంగుళూరులో నుంచి అమరావతికి కొత్త రైల్లే లైన్ నిర్మించి దేశంలోనే ఒక ఉన్నత విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందుతున్న పులివెందులను రైల్వే మ్యాపులోకి తీసుకురావలసిన అవసరం ఉందని హిందూపూరం లోక్ సభ సభ్యుడు (వైసిపి) గోరంట్ల మాధవ్ దక్షిణ పశ్చిమ రైల్వే జీఎం అజయ్ కుమార్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు.
ఈ రోజు బెంగుళూరులో జిఎంతో పాటు బెంగుళూరు డివిజన్ రీజినల్ మేనేజర్ అశోక్ కుమార్ వర్మతో కూడా సమావేశమయి రాయలసీమలో తక్షణావసరమయిన కొన్నినూతన రైలు మార్గాల నిర్మాణం గురించి చర్చించారు.
ఇటీవల రాష్ట్రంలో నంద్యాల నుంచి ఎర్రగుంట్ల వరకు రైలు మార్గం పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మార్గానికి పెద్దగా రైలు సౌకర్యం లేదు అందువల్ల, బెంగుళూరు నుంచి అమరావతికి కదిరి-పులివెందుల- ముద్దనూరు దాకా కొత్త రైలు మార్గం వేస్తే, ఈ ప్రాంతావసరాలు తీరడమే కాకుండా, ఈ ప్రాంతాభివృద్దికి దోహపడుతుందని ఆయన రైల్వే అధికారులకు సమర్పించిన వినతిపత్రంలో మాధవ్ పేర్కొన్నారు.
దీనికోసం కదిరి నుంచి పులివెందులకు, అక్కడినుంచి ముద్దనూరుకు కొత్త రైలు మార్గం వెస్తే సరిపోతుందని చెబుతూ ఈ ప్రాంతాలన్ని కేవలం రైలు కనెక్టివిటీ లేక వెనకబడి ఉన్నాయని ఆయన తెలిపారు. ఇలా జమ్మలమడుగు నంద్యాల మీదుగా బెంగుళూరు-అమరావతి రైలు నడప వచ్చని, ఇదొక కీలకమయిన రైలు మార్గం అవుతుందని కూడా ఆయన చెప్పారు.
ఈ మార్గం పూర్తయితే, ఈ ప్రాంతాలకు రాకపోకలు పెరిగి అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందని చెప్పారు.
అంతేకాదు, పులివెందుల రాష్ట్రం లోనే కాకుండా దేశంలోనే ఒక విశిష్టమయిన ఉన్నత విద్యాకేంద్రం కాబోతున్నందున పులివెందులను రైల్వేమాపులోకి తీసుకురావడం చాలా అవసరమని కూడా మాధవ్ తెలిపారు.
2021 బడ్జెట్ లో ఈప్రతిపాదనలు చేర్చేలా చర్యలు తీసుకోవాలని గోరంట్ల మాధవ్ విజ్ఞప్తి చేశారు.
మాధవ్ వెంబడి పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి , కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
1.బెంగుళూరు నుండి అమరావతికి కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. (వయా బాగేపల్లి,అమడగూరు,ఓ.డి.చెరువు,కదిరి,పులివెందుల,జమ్మలమడుగు మీదుగా)
2.ముద్దనూరు,పులివెందుల,ముదిగుబ్బ మీదుగా పుట్టపర్తి వరకు నూతన రైల్వేలైన్ ను నిర్మించాలని కోరారు.
3.కదిరి,పుట్టపర్తి మీదుగా గతంలో పంపిన ప్రతిపాదనలను మరొకసారి సమీక్షించి నూతన రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని కోరారు.
4.హిందూపురం పార్లమెంట్ లోని రైల్వే అండర్ పాస్ ల వల్ల ముఖ్యంగా కొత్తచెరువులోని పెనుకొండ రోడ్ వైపు వున్న రైల్వే అండర్ పాస్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,వాటిని పరిష్కారించే విధంగా తక్షణమే చర్యలను తీసుకోవాలని కోరారు.