వాళ్ల సంప్రదింపులతో న్యాయం జరిగేనా?
(రాఘవ శర్మ)
రాఘవ శర్మ
వివాదాస్పద మూడు వ్యవసాయచట్టాలను పరిశీలించి, అటు ప్రభుత్వంతో, ఇటు ఆందోళన చేస్తున్న రైతు ఉద్యమ నాయకులతో చర్చించడానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే మంగళవారం వేసిన కమిటీపైన అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ కమిటీ సభ్యులు గతంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలను గమనిస్తే, మేధావి వర్గంతో పాటు ఆందోళన చేస్తున్న రైతాంగంలో కూడా ఈ అనుమానాలు బలపడుతున్నాయి.
ఈ కమిటీ సభ్యులు నలుగురూ గతంలో ఈ వ్యవసాయ చట్టాలకు అనుకూలంగానే వ్యాఖ్యానించిన వారే కావడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది.
సుప్రీం కోర్టు నియమించిన కమిటీ సభ్యులు గతంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
‘వ్యవసాయాన్ని ఒక పోటీరంగంగా నిలబెట్టడానికి ఈ సంస్కరణలు అవసరం ‘ : భూపేంద్రసింగ్ మన్న.
భూపెంద్ర సింగ్ మన్న భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు.
ఈ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను అమలు చేసితీరాలని ఒక చిన్న రైతుల బృందంతో వెళ్ళి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన మహాను భావుడు.
వ్యవసాయ రంగంలో పోటీ తత్వాన్ని పెంపొందించ డానికి సంస్కరణలు అవసరమని కోరిన వారు.
‘రైతాంగానికి అవకాశాలను కల్పిస్తున్న ఈ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవలసిన అవసరం లేదు ‘ : అనీల్ ఘన్వాట్
ఈయన షేట్కార్ సంఘటన అధ్యక్షుడు.
వ్యవసాయ చట్టాలను ఉపసంహరించు కోవ డాన్ని వ్యతిరేకించాడు.
కార్పోరేట్ రంగ అనుకోలుడు.
చట్ట విరుద్ధ మైన జీ ఎం వేయాలని కోరినవాడు.
రైతులకు అవకాశాలను కల్పిస్తున్న వ్యవసాయ చట్టాలను ఉప సంహరించు కోవలసిన అవసరం లేదన్న వాడు.
‘ఈ వ్యవసాయచట్టాలలోని ఆర్థిక హేతుబద్ధత ఏమిటంటే , రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునే గొప్ప అవకాశాన్ని కల్పించడమే కాకుండా, ఆ ఉత్పత్తులను కొనే వాళ్ళకు కూడా వాటిని నిలువ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఈ చట్టాలు వ్యవసాయ మార్కెట్లో పోటీ తత్వాన్ని సృష్టిస్తాయి ‘ : అశోక్ గులాటీ
వీరు వ్యవసాయ చట్టాల ప్రతిపాదకులు.
వ్యవసాయ రంగంలో కార్పొరేట్ శక్తుల ప్రవేశాన్ని కోరుకునే వారు.
ఈ నలుగురు సభ్యుల్లో అశోక్ గులాటి ఈ మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను సమర్దిస్తూ గతంలో పత్రికల్లో కథనాలు కూడా రాశారు.
‘ వ్యవసాయ చట్టాలను ఎలా నీరు కార్చినా, భారత వ్యవసాయ రంగానికి లభించే ప్రపంచ వ్యా పిత అవకాశాలను దెబ్బతీసి నట్టే అవుతుంది ‘ : డాక్టర్ పి. కె. జోషి
వీరు IFPRI దక్షిణాసియా మాజీ డైరెక్టర్.
వ్యవసాయ చట్టాలను ప్రతిపాదించిన వారిలో ఒకరు.
భారత వ్యవసాయ రంగం లోకి విదేశీ శక్తుల ప్రవేశాన్ని కోరుకున్న వారు.
సుప్రీం కోర్టు వేసిన కమిటీలో నలుగురు సభ్యులూ వివిదాస్పద వ్యవసాయ చట్టాలకు అనుకూంగా ఉన్న వారేనని స్పష్టమవుతోంది. దానికి భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వారితో జరిపే సంప్రదింపులు ఏమేరకు ఫలవంతమవుతాయన్నది సందేహమే.
(రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)