యుఎస్ ఎస్ ఆర్ మీద మరొక మంచి పుస్తకం ‘సోవియట్ సాహిత్య భాస్కరులు ‘ పుస్తక పరిచయం
(రాఘవ శర్మ)
ఈ భూమిపైన ఒక మహత్తరమైన కల సాకారమైంది.
రష్యాలో శ్రామిక వర్గ మహావిప్లవం 1917 అక్టోబర్ 25వ తేదీన విజయవంతం కావడంతో తొలి సోషలిస్టు వ్యవస్థ పురుడుపోసుకుంది.
ఈ పరిణామం జరగడానికి ముందు దాదాపు రెండు శతాబ్దాలపాటు రష్యాలో కళలు, సాహిత్యం, సాంస్కృతిక రంగాలలో పునరుజ్జీవనం జరిగింది.
ఆ నేలపై పుష్కిన్, గోగోల్, టాల్‌స్టాయ్, చ్చేహోవ్, గోర్కీ, మయకోవస్కీ వంటి మహారచయితలు, కవులు ఉద్భవించి, తమ ప్రతిభాపాటవాలతో సమాజాన్ని ప్రభావితం చేశారు.
వీరి రచనలు రష్యాపైనే కాకుండా, ప్రపంచంలోని అన్ని భాషలపైనా బలమైన ప్రభావం కలగచేశాయి.
లెనిన్ నాయకత్వంలో ఏర్పడిన సోషలిస్టు వ్యవస్థకు ప్రజలను సంసిద్ధులను చేయడానికి వీరి రచనలు అద్భుత నేపథ్యగానంలా పనిచేశాయి.
వీరందరినీ మరొక సారి పరిచయం చేయడానికి డాక్టర్ యస్. జతిన్ కుమార్ ‘సోవియట్ సాహిత్య భాస్కరులు’ అన్న పుస్తకాన్ని చక్కని శైలిలో రాశారు.
వారి రచనలను, వాటి ప్రాధాన్యతను, రచయితల జీవిత సంఘర్షణను, వారి జీవిత సంక్లిష్టతను ఎలాంటి అరమరికలు లేకుండా వివరించారు.
” ఏ కలలూ లేకుండా జీవించడం కన్నా, ఎన్నడూ ఫలించకపోయినా వేయి కలలు కనడం ఉత్తమం ” అంటాడు పుష్కిన్.
పుష్కిన్ (1799-1837) కాల్పనిక సాహిత్య పతాకగా, కవితా శిఖరంగా వెలుగొందాడు.
సంప్రదాయ సాహితీ సంద్రంలో నవ్య సంప్రదాయ తరంగాలను ఉరకలెత్తించాడు.
కాల్పనిక కవితా వారధిని అధిరోహించి వాస్తవిక తీరాన్ని చేరుకున్నాడు.
సాంఘిక సంస్కరణల కోసం, ఉదార భావాల వ్యాప్తి కోసం ఎలుగెత్తాడు.
ఆయన రచనలు నృత్య రూపకాలుగా, సంగీత నాటకాలుగా ప్రజానీకాన్ని అలరించాయి.
‘దక్వేక్ ఆఫ్ స్పీడ్’ ‘పీస్ట్ ఇన్ టైమ్ ఆఫ్ ప్లేగ్ ‘ ‘ కెప్టెన్ డాటర్’ ‘ రష్యన్ అండ్ ల్యుడిమిలా’ ‘ద డిజైర్ ఆఫ్ గ్లోరీ’ ‘ జిప్సీ ‘ వంటి రచనలు ఆయన ప్రతిభకు తార్కాణాలు.
కాల్పనికత నుంచి వాస్తవికతకు సాగిన కళాయాత్రగా ఆయన జీవితాన్ని అభి వర్ణించవచ్చు. నటాలియా అన్న ఒక సొగసరి ప్రేమలో పడి పుష్కిన్ ఆమెను వివాహం చేసుకున్నాడు. ప్రతిష్టకు పోయి జరిగిన ద్వంద యుద్ధంలో గాయపడి నడివయసులోనే మరణించాడు.
పుష్కిన్ రచనలు ప్రాతిపదికపైనే టాల్‌స్టాయ్ వంటి మహారచయితలు తమ రచనా సౌధాలను నిర్మించుకున్నారు. పుష్కిన్న్ను సోవియట్ ప్రజలు ఎంతగా ప్రేమించారంటే దేశంలో దొరికిన ఒక అరుదైన వజ్రానికి పుష్కిన్ అని పేరు పెట్టారు.
రష్యన్లు కనుగొన్న ఒక నూతన గ్రహానికి పుష్కిన్ అని నామకరణం చేశారు. ఆయన జన్మదినమైన జూన్ 6వ తేదీని రష్యా భాషా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రపటించింది.
“వివేక వంతుడు ఎవరినీ చిన్న చూపు చూడడు. అందరినీ నిశితంగా పరిశీలిస్తాడు. ఆ పరిశీలన వల్ల అతని అస్విత్వానికి ఒక వసంత వికాసం తోడవుతుంది ” అంటాడు గోగోల్. రష్యన్ సాహిత్యంలో వాస్తవిక స్వాభావిక వాదాన్ని ప్రవేశపెట్టిన గోగోల్ (1809-1852) ప్రాంతీయ, వ్యావహారిక భాషా సుగంధాన్ని అద్దాడు. ఆయన రచనల్లో హాస్యం, వ్యంగ్యంతోపాటు నిరాశ కూడా కలగలిసి ఉంటుంది. ఆత్మాశ్రయ ధోరణి, ఉద్వేగాల చిత్రణ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అప్పటికి ఉనికిలోకి రాని అధివాస్తవిక ధోరణుల ఛాయలు ఆయన రచనల్లో కనిపిస్తాయి.
పాత్రల చిత్రణలో విభిన్నంగా ఉన్నా, సారాంశం సామాజికంగా ఉండడం వల్ల గోగోల్ వాస్తవిక వాదిగా గుర్తింపు పొందాడు. రష్యన్ అధికార యంత్రాంగం తప్పులపైన తప్పులు చేయడాన్ని తన హాస్యంతో ఎత్తి చూపించాడు.
పుష్కిన్ అనగానే తెలుగులో ప్రపసిద్ధమైన ‘ఇన్స్పెక్టర్ జనరల్ ‘ నాటకం గుర్తుకు వచ్చినట్లు గొగోల్ అనగానే ‘ఓవర్ కోట్ ‘ కథ కూడా గుర్తుకు వస్తుంది.
రష్యన్ సామ్రాజ్యపు లోపాలను , దోషాలను, నేరాలను, క్రౌర్యాలను వ్యంగ్య విమర్శ ద్వారా ఆవిష్కరించిన గొప్ప రచన ‘డెడ్ సోల్’ తన నాటకాలు, కథలు, నవలలను అపూర్వ నైపుణ్యంతో సృష్టించి గోగోల్ చిరకీర్తిని సంపాదించాడు.
పుష్కిన్తో ఏర్పడిన స్నేహం వల్ల గోగోల్ జీవితంలోనే కాదు, సాహిత్యంలో కూడా స్థిరపడ్డాడు. పుష్కిన్ మరణం గోగోల్‌ను బాగా కుంగదీసింది.
అధికార పీడనను, సామాజిక దౌష్ట్యాలను, దార్మార్గాలను ఎండగట్టిన గోగల్ తాత్వికంగా రాచరిక వ్యవస్థను సమర్థించాడు.
వాస్తవాలను రాస్తూనే, దయ్యాల వంటి అభూత కల్పనలను రంగరించాడు. ఆయన వ్యంగ్య ధోరణి తరువాత రచయితలకు అనుసరణీయమైంది.గోగోల్ తీవ్రమానసిక సంఘర్షణకు గురై తన రాత ప్రతులన్నిటినీ తానే తగులబెట్టి, అవి దయ్యపు చేష్టలని ప్రపకటించాడు. తొమ్మిది రోజులు అన్నపానీయాలు ముట్టుకోకుండా జీవితాన్ని ముగించాడు.
” ప్రతివారూ ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటారు. కానీ, తాను మారాలనే విషయం ఆలోచించరు. జీవితానికి ఏకైక మార్గం మానవ సేవ చేయటమే ” అంటాడు టాల్‌స్టాయ్.
కాల్పనిక సాహిత్యంలో వాస్తవికతావాది, సోవియట్ నవలా పితామహుడు, ప్రపంచ నవలాకారులలో అగ్రగణ్యుడు టాల్‌స్టాయ్(1828-1910). ఆయన రాసిన ‘యుద్ధమూ- శాంతి ‘ ప్రపథమ శ్రేణి నవల మాత్రమే కాదు, ఆనాటి సమకాలీన నవలకు నిర్వచనంగా నిలిచింది.
‘అన్నా కెరినినా’ బృహత్తరమైన రచనగా అజరామరమైన కీర్తిని తెచ్చిపెట్టింది. టాల్‌స్టాయ్ రచయితగా కంటే ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపిన తాత్వికుడిగా గుర్తింపు పొందాడు.’చెడును హింసాత్మకంగా ప్రతిఘటించకపోవడం ‘ అనే టాల్‌స్టాయ్ సూత్రం గాంధీజీకి మార్గదర్శకమైంది. వారిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి.
టాల్‌స్టాయ్ మాట మార్టిన్ లూతర్ కింగ్ వంటి నల్ల జాతి నాయకులకు ఒక పోరాట రూపమైంది.
విందులు, విలాసాలు, జూదాలతో కులాసా జీవితానికి అలవాటు పడ్డ టాల్‌స్టాయ్ అప్పులపాలై సైన్యంలో చేరి క్రిమియా యుద్ధం(1854-55) లో పాల్గొన్నాడు. పోయిన ప్రాణాలు, విధ్వంసం, అంతులేని హింస టాల్‌స్టాయ్‌ను కలిచివేసింది.
తన పుస్తకాలపై వచ్చిన కాపీ రైట్ను తిరస్కరించాడు. టాల్‌స్టాయ్ రాసిన ‘యుద్ధమూ- శాంతి’ నవల 1901లో నోబెల్ బహుమతికి ఎంపికైనా దాన్ని తిరస్కరించాడు.
శాంతి, అహింస, నిరాడంబరత, స్వంత ఆస్తిపట్ల వ్యతిరేకతని ప్రబోధిస్తూ దేశదిమ్మరిలా తిరిగాడు.
భోగభాగ్యాలను , కుటుంబాన్ని విడిచి సన్యాసిలా 82వ ఏట ప్రాణాలను విడిచాడు.
మానవ చైతన్యంలో సంభవించే అతి సూక్ష్మ పరివర్తనలను పరిశీలించి, విశ్లేషించి సాహిత్యంలో చిత్రించడమే టాల్‌స్టాయ్ విశిష్టత అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
“జీవితంలో ఓటమి పొందే రోజులు చాలా ఉంటాయి. చెప్పలేని అసంతృప్తి ఎదురవుతుంది. వీటికి నీవు సిద్ధంగా ఉండాలి. నీ మార్గంలో అచంచలంగా సాగిపోవాలి ” అంటాడు ఛెహోవ్.
కల్పనా సాహిత్యలో ప్రతిభావంతుడు, కథానికా రచనలో, హాస్యప్రహసనాలలో అపూర్వ విన్నాణంతో అత్యంత ప్రతిభాసామర్థ్యాలు కలవాడు.
చిన్నచిన్నకథల రచయితగా ఛెహోవ్(1860-1904) ప్రసిద్ధుడు. తెలుగు కథారచనలో కొడవటిగంటి కుటుంబరావును ఛెహోవ్తో పోలుస్తారు.విప్లవ పూర్వ జీవితాన్ని లోతుగా పరిశీలించి, మధించి జీవన వాస్తవాలను చిత్రించిన వాడు.
‘లేడీవిత్ద డాగ్ ‘ ‘వార్డ్ నెంబరు 6 ‘ వంటి కథలు లోతైన పరిశీలతో మానవ స్వభావాన్ని, జీవిత సంక్లిష్టతను చిత్రించాయి.
‘ స్టెప్పీ ‘ ‘ లేడీ విత్ద డాగ్’ వంటి కథలు, ‘ సీగల్ ‘ ‘అంకుల్ వాన్యా ‘ వంటి నాటకాల రచయితగా మానవ స్వభావంలోని లోతుపాతులను చిత్రించి చిరంజీవిగా మిగిలాడు.
ఛెహోవ్ రచనలలో ఉత్కంఠ, ఊహించని మలుపులు, నాటకీయత కనిపించవు.
మనుషుల అంతరంగాన్ని, విరుచుకుపడే సంక్షోభం, సంఘర్షనని బలంగా చిత్రించాడు. ఛెహోవ్ నాటకాలు నిరాడంరతతో సత్యాన్ని ఆవిష్కరిస్తాయి. ఛెహోవ్ బాల్యం ఒక బాధాకరమైన జ్ఞాపకమే.తల్లి చెప్పే కథలు ఓదార్పునిచ్చేవి.
కుటుంబం మాస్కోకు తరలిపోవడంతో తన్రాగ్లోనే ట్యూషన్లు చెప్పుకుంటూ చదువకునేనాడు. డాక్టర్ పట్టా పుచ్చుకున్నా, కుటుంబ పోషణ కోసం స్థానికి ప్రతికలకు చిన్న చిన్న కథలు, కల్పనలు రాసేవాడు.సంప్రదాయ సాహిత్యం నుంచి వైదొలగి, కొత్త మార్గంలో రచనలు చేశాడు. చివరికి క్షయవ్యాధితో ప్రాణాలు కోల్పోయాడు.
జేమ్స్ జాయిస్, ఎర్నెస్ట్ హెమింగ్వే వంటి రచయితలు కూడా తమపై ఛెహోవ్ ప్రభావం ఉందని చెప్పుకునే వారు.”పని ఆహ్లాదమైతే జీవితం ఆనందకరం. అదే పని తప్పనిసరి విధిగా మారితే ఆ జీవితం బానిసత్వం” ” గతం అనే వాహనంలో ప్రయాణిస్తే నీవు ఎ్కడికీ చేరుకోలేవు ” అంటాడు మాక్సిమ్గోర్కీ.
గోర్కీ అనగానే ‘ అమ్మ ‘ గుర్తుకు వస్తుంది. ‘అమ్మ ‘ అంటే ఉద్యమం. ‘ అమ్మ ‘ అంటే విప్లవం. ‘అమ్మ ‘ అంటే మానవ జాతికన్న మహత్తరమైన కల.
గోర్కీ(1868-1936)కి నాన్న చనిపోతే, అమ్మ మరొకరిని వివాహంచేసుకుని వెళ్ళిపోతే, అమ్మమ్మ గారింట్లో పెరిగి ఎనిమిదేళ్ల వయసు నుంచి దొరికిన పనల్లా చేశాడు.
యజమానుల తిట్లు, వారి చేతిలో చావు దెబ్బలు, రోజుల తరబడి పస్తులు, చినిగిపోయిన దుస్తులతో బాల్యమంతా దైన్యమైన జీవితం గడిపాడు.గోర్కీ బాల్యాన్ని తెలుగులో శారద(నటరాజన్) బాల్యంతో పోల్చవచ్చు.
ఇరవై ఏళ్ళు వచ్చేవరకు గడిపిన గోర్కీ దారిద్ర్య జీవితానుభవం అతని రచనలకు దోహదపడింది.
ఛెహోవ్ను, టాల్‌స్టాయ్ ని కలిసిని ప్రభావంతో గోర్కీ తన రచనలను అట్టడుగు ప్రజల వాణిగా వినిపించడం మొదలు పెట్టాడు.
‘ మేకర్ ఛుద్రా ‘ అన్న చిన్న కథ గోర్కీ తొలి రచన. ‘ చలకాష్ ‘ అన్న రచనతో బాగా గుర్తింపు లభించింది.
‘ఒక బేకరీ కథ ‘ గోర్కీ అత్యుత్తమ కథల్లో ఒకటిగా నిలిచింది.గోర్కీ రాసిన విప్లవ గీతం ప్రచురించడంతో ‘లైఫ్ ‘ అన్న పత్రికను అణచివేశారు. గోర్కీని అరెస్టు చేశారు.జార్ చక్రవర్తులను బాహాటంగా విమర్శించాడు. బహిరంగంగా ఎదిరించాడు.
లెనిన్తో 1902లో ఏర్పడిన పరిచయం వారిద్దరినీ మంచి స్నేహితులుగా మార్చడమే కాకుండా, ఉద్యమంలో కలిసి నడిచేలా చేసింది.
సెయింట్ పీటర్స్ నగరంలో చక్రవర్తికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన 500 మంది రైతులను దారుణంగా చంపివేసిన ఘటన గోర్కిని కలిచివేసింది.
దాంతో గోర్కీ పూర్తిగా లెనిన్ పక్షం చేరిపోయాడు. సాహిత్యాన్ని ఒక కళాత్మక ప్రక్రియగా కంటే, ప్రపంచాన్ని మార్చే మార్పు వైపు నడిపించే నైతిక, రాజకీయ బాధ్యతగా పరిగణించాడు.
పార్టీ నిధుల వసూలు కోసం అమెరికా వెళ్ళి అక్కడే 1906లో ‘అమ్మ ‘ నవల రాశాడు. ఏ సోవియట్ రచయితా చేయనంతగా దైవం, మతం, చర్చి వ్యవస్థలను తూర్పారబట్టాడు. విప్లవకాలంలో, అంతర్యుద్ధ కాలంలో గోర్కీకి లెనిన్ తోడుగా నిలిచాడు.
కానీ, కార్మిక వర్గ విప్లవం తీవ్రమైన హింసాకాండగా మారిపోతోందని బాధపడేవాడు.
తనకు ఇష్టమైన, తాను నిజమని నమ్మిన అంశాలలోనే ప్రభుత్వంతో సహరించేవాడు.
లెనిన్, స్టాలిన్‌తో పొరపొచ్చాలొచ్చినా గోర్కీకి వారు గొప్ప స్థానమిచ్చారు.
ఆ మహారచయితను ఆర్డర్ ఆఫ్ లెనిన్తో సత్కరించారు.
గోర్కీ జీవిత కథను సినిమాగా తీశారు.
మాస్కో థియేటర్‌ను గోర్కీ థియేటర్ గా మార్చారు.
వీధులకు, పార్కులకు ఆయన పేరు పెట్టారు.
నోబెల్ బహుమతికి గోర్కీ పేరును అయిదు సార్లు ప్రతిపాదించారు.
గోర్కీ శవపేటికను స్టాలిన్ స్వయంగా మోశాడు.
” కళ అనేది ప్రాణం లేని ఆలయాల వంటి మ్యూజియంలలో ప్రదర్శించడానికి కాదు. దాన్ని అన్ని చోట్లా వెదజల్లాలి ”
“కమ్యూనిజం లేకపోతే నా దృష్టిలో ప్రేమ అనేదే లేదు ” అంటాడు మయకోవస్కీ.
మయకోవస్కీ(1893-1930) అనగానే శ్రీశ్రీ అనువాదం చేసిన కావ్య రచయితగా అందరికీ గుర్తుకు వస్తాడు.
కవి, రచయిత, చిత్రకారుడు, నటుడు, నాటక కర్త, సినీ రచయిత, రాజకీయ కార్యకర్త, సాంస్కృతిక సంస్థల సంచాలకుడు సాహితీ పత్రికల సంపాదకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి మయకోవస్కీ.
ఫీజుకట్టలేక స్కూలు నుంచి తొలగింపునకు మయకోవస్కీ గురయ్యాడు.
రాజకీయ కార్యకలాపాల వల్ల రెండేళ్లు జైలు శిక్షను అనుభవించాడు.
జైలులోనే కవితాక్షరాలను దిద్దాడు.
సంప్రదాయ కవిత్వాన్ని విడనాడి సాహిత్యంలో నూతన విధానాలు ప్రవేశపెట్టాడు.
పాత ఛందస్సులను వెనక్కి నెట్టి వేసి, కొత్త అలంకారాలతో, కొత్త నుడికారాలతో ఒకింత ఆడంరంగా నూతన సాహిత్య భాషను తయారు చేశాడు.
‘ ఎక్లేడ్ ఇన్ ట్రేజర్ ‘ అన్న దీర్ఘ కావ్యాన్ని 1915లో రాశాడు.
మయకోవస్కీ భాష, శైలి, అనూహ్యమైన పదప్రయోగం, గేయపు నడక అందరినీ ఆశ్చర్యచకితులను చేశాయి.
అవి ఎంత ఉన్నతంగా ఉన్నాయంటే ఆధునిక కవితా శకటం నుంచి పుష్కిన్, టాల్‌స్టాయ్ వంటి మహారచయితలను కూడా కిందకి తోసేసేలా ఉన్నాయి.
రష్యన్ సోషలిస్టు విప్లవంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగాడు.
తన కలం, గళం విప్లవ సంకీర్తనలకు అంకితం చేశాడు.
ఎన్నో ప్రేరణాగీతాలు, మరెన్నో నాటకాలు రాశాడు.
కమ్యూనిస్టు వ్యవస్థ పాదుకొనడానికి ఒక ప్రచార యుద్ధమే చేశాడు.
పెట్రోగ్రాడ్ రక్షణ కోసం 1919నుంచి అవిశ్రాంతంగా ప్రచార గీతాలు రాశాడు.
సోవియట్ సమాజంలో 1920 కల్లా బ్యూరోక్రసీ పెరిగింది.
దీనిపై మయకోవస్కీ ‘రీకన్ఫరెన్స్ ‘ అన్న వ్యంగ్య రచన చేశాడు .
అది లెనిన్ దృష్టికి వెళ్ళింది. ‘ఈ రచనను నేను ఏకీభవిస్తున్నాను. మన శ్రామిక రాజ్యాన్ని అధికార వర్గం కబళిస్తోంది ‘ అని చెప్పి తగిన చర్యల కోసం లెనిన్ ఆదేశించాడు.
లెనిన్ 1924లో మరణించినప్పుడు మయకోవస్కీ దీర్ఘ స్మృతి గీతం రాసి చదువుతుంటే వేలాది మంది కన్నీటితో కదిలిపోయారు.
ఆ తరువాత స్కూళ్ళలో అది పాఠ్యాంశమైంది.
ఈ గీతాన్ని శ్రీశ్రీ అనువదించాడు.
‘కట్టుకథలు కాదు, కల్పనలు కాదు, సత్యమే సాహిత్యం’ అన్న దృక్పథంతోనే మయకోవస్కీ వ్యవహరించాడు.
ఒక పక్క ప్రేమవ్యవహారంలో అపజయం పొందడం, మరొక పక్క అధికార వర్గాలతో పొసగక పోవడంతో భావావేశపరుడైన మయకోవస్కీ 1930లో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఒక ప్రేమ నౌక వ్యవహారపు జీవితపు ఆటుపోట్లకు తట్టకోలేక, జీవన కాఠిన్యాలలకు గుద్దుకుని విచ్ఛిన్నమైపోయింది.
‘సోవియట్ సాహిత్య భాస్కరుల’ను అర్థం చేసుకోవడానికిముందు ఈ పుస్తకంలో పొందుపరిచిన జతిన్ రష్యా పర్యటనానుభవాలు ఎంతగానో దోహదం చేస్తాయి.
ఆ మహారచయితల కృషి నేపథ్యంగా కలిగిన సోవియట్ రష్యా మన కళ్ళ ముందు కదలాడుతుంది.
ఛెహోవ్ కథను, పుష్కిన్ కవితలను ఈ పుస్తకంలో అనుబంధంగా జోడించారు.
ఈ పుస్తక పఠనం ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగుతుంది.
జ్ఞాపకాల నుంచి క్రమంగా తెరమరుగవుతున్న సోవియట్ సోషలిస్టు కలను మరొక సారి జ్ఞప్తికి తెస్తుంది.
‘ సోవియట్ సాహిత్య భాస్కరులు ‘ నవోదయ బుక్ హౌస్ లో లభిస్తుంది.
(అలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)