కాకులు కనిపించని అరుదైన ఆంధ్ర పుణ్యక్షేత్రం….

(చందమూరి నరసింహారెడ్డి)

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని బనగాని పల్లెకు సమీపాన యాగంటి క్షేత్రం ఓ సుందరప్రదేశం.ఆ ప్రదేశంలో నిలబడి చూస్తే ఆ అనూభూతే వేరు.  ఎక్కడో పర్వతాల మధ్యలో తేలియాడుతున్నట్లు అనిపిస్తుంది. సినిమా సెట్టింగుల్లా ఓ పద్దతి గా అందంగా నేర్పుగా ఆనందం కలిగించేలా ఏర్పాటు చేశారా అన్నంత అనుభూతి కలిగిస్తోంది. చాలా సహజ సిద్దంగా ఉన్న ఆ కొండల అందచందాలను వర్ణించడానికి వర్ణనలు లేవు. గుహలు , ఎత్తెన కొండ శ్రేణులు , చెట్లు , ఓ వైపు కొండపైకి దారి ఆ దారికీ నిర్మించిన రక్షణ గోడ, కొండల్లో ఉన్న గుహలకు చిన్న మెట్లదారులు మైమరచిపోయాలా అనుభూతి ని పంచుతున్న వాతావరణం యాగంటి మహాక్షేత్రంలో అందరికీ కనువిందు చేస్తున్నది. యాగ క్షేత్రాన్ని సందర్శిస్తే కానీ ఆ మధురానుభూతిని ఎంత వర్ణించినా పొందలేము. కరోనా ప్రభావం వల్ల నిబంధనల మేరకు కోనేరు ప్రాంతం మూసివేయడంవల్ల కోనేటి అందాలను ఆశ్వాదించలేదు అందులో స్నానాలు చేయలేక పోవడం మాకు కొంత బాధ కల్గించింది.

యాగంటి క్షేత్రం ఓ శైవక్షేత్రం అయితే గోపురం వైష్ణవ క్షేత్రం లా ఉంది.యాగంటి బసవయ్య గురించి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తెలిపిన ఓ విషయం చాలామంది కి తెలిసే ఉంటుంది. యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేను అంటూ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు. యాగం బసవన్న ప్రతి ఏటా కొంత మేరకు పెరుగుతున్నట్లు పురావస్తు శాఖ , శాస్ర్తవేత్తలు ధృవీకరించారు. సైటిఫిక్ రీజన్స్ ప్రకారం కొన్ని రకాల రాళ్లు పెరుగుతాయని పేర్కొనడం మరోకోణం కావచ్చు. ఏదిఘమైనా యాగంటి బసవన్న పెరుగుతున్నాడన్నది అంగీకరిస్తున్నారు. 15′ X 10′ X 8′ పరిమాణం లో భారీ నంది విగ్రహం ఉంది.పురావస్తుశాఖ అంచనా ప్రకారం ఈ నంది ప్రతి 20 సంవత్సరాలకు అంగుళం మేర పెరుగుతోంది. బనగానపల్లె నుంచి 12కిలోమీటర్లు దూరంలో యాగంటి ఉంది. ఇక్కడ మహాశివరాత్రి పండుగ ఇక్కడ ఘనంగా జరుపుకొంటారు.

యాగంటి క్షేత్రం ఒక శైవ క్షేత్రం. ఇక్కడ ప్రధాన దేవాలయంలో ఉమామహేశ్వర లింగం ఉంది. శివపార్వతులు ఇద్దరూ ఒకే లింగంలో కనిపించడం విశేషం. ఏకశిల పై నంది ,ఉమామహేశ్వరులున్న క్షేత్రం యాగంటి లో తప్ప దేశంలో మరెక్కడా లేదు.

ఈ క్షేత్రం ఎప్పుడు నిర్మించారన్న విషయం ఖచ్చితంగా ఆధారాలు లేవు. హరిహరాయిలు, బుక్కరాయల కాలంలో (14వ శతాబ్దం) ఈ ఆలయం అభివృద్ధి చెందిందని కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించినట్టు ఆధారాలున్నట్లు చెబుతున్నారు. ఈ గుడి నిర్మాణంలో, ఆకృతి లో కట్టడాల్లో విస్తృతిలో విజయనగర కాలం నాటి ధోరణి కనిపిస్తుంది. యాగంటిలో ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి వుంటుంది. ఈ గోపురాన్ని దాటగానే రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి.

అగస్త్యుడు ఇక్కడ వైష్ణవాలయం నెలకొల్పాలని భావించడనీ, అయితే అందుకు సిద్ధం చేసిన మూలవిరాట్టు కు చివరి నిమిషంలో చిన్న దోషం ఏర్పడిందట. ఎందుకు ఇలా జరిగిందని అగస్త్యుడు ఆలోచిస్తూ, కారణాంతరాన్ని అన్వేషించడం కోసం తపస్సు చేశాడని అప్పుడు శివుడు ప్రత్యక్షమై స్వయంగా తానే ఇక్కడ వెలుస్తానని చెప్పి స్వయంభువుగా శ్రీ ఉమామహేశ్వరుడు తన వాహనం నంది తో సహా ఇక్కడ ఆవిర్భవించారని చెబుతారు. ఈ కారణంతోనే  వైష్ణవాలయంకోసం రూపొందిన ఈ క్షేత్రం శివక్షేత్రమైనట్లు విశ్వసిస్తారు. యాగంటి క్షేత్రం వైష్ణవాలయానికి తగినట్టుగా గాలి గోపురంతో ఉంటుంది.

కాకులు కనిపించని క్షేత్రం ఇది.

ఈ క్షేత్రంలో కాకి కి ప్రవేశం లేకపోవడం ఒక వింత. అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేస్తేంటే కాకుల సమూహం తపస్సుకు ఆటంకం కలిగించిన్నట్లు అందుకు ఆగ్రహించిన ఆగస్త్యముని ఈక్షేత్ర ప్రాంతంలో కాకులు సంచరించరాదని శపించాడట. అప్పటి నుంచి ఈ క్షేత్రంలో కాకులు కనిపించలేదట. కాగా కాకి శనిదేవుని వాహనం కనుక తన వాహనానికి స్థానం లేని ఈ క్షేత్రంలో తాను ఉండనని శనీశ్వరుడు ప్రతిన బూనాడనిఅందువల్ల ఇక్కడ నవగ్రహాలు లేవట. ఫలితంగా శని ప్రభావం లేని క్షేత్రంమని చెబుతున్నారు.

మరో కథనం ప్రకారం ఇక్కడ చిట్టెప్ప అనే శివభక్తుడు శివుడి కోసం తపస్సు చేశాడట. కొన్ని రోజులకు అతడికి పెద్ద పులి కనిపించిందట. ఆ పెద్దపులినే శివుడని భావించిన చిట్టెప్ప సంతోషంతో ‘‘నేకంటి నేకంటి ’’ అని కేరింతలు కొట్టడంతో అదే కాలక్రమంలో యాగంటి అయ్యిందని అంటారు.

యాగంటి ప్రధానాలయానికి చుట్టూ ఉన్న గుహలయాల్లో ఒక దానిలో శ్రీ వెంకటేశ్వరుడి గుడి ఉంది. ఆ మూర్తికి ఎడమకాలి బొటనవేలు సక్రమంగా లేకపోవడాన్ని భక్తులు దర్శించవచ్చు. కొండల మీద వున్న వివిధ గుహలకు, ఆలయాలకు చేరడానికి ఉన్న మెట్ల మార్గాలు చూడ్డానికి చాలా బాగుంటాయి.

అగస్త్య పుష్కరిణి

యాగంటి ఉమామహేశ్వర ఆలయంలో వున్న పుష్కరిణికి ‘అగస్త్య పుష్కరిణి’ అనే పేరు వుంది. మునీశ్వరుడైన అగస్త్యుడు ఈ కోనేరులో స్నానం చేశాడని, అందుకే ఈ కోనేరుకు ఆ పేరు వచ్చిందని స్థలపురాణం పేర్కొంటోంది. ఈ పుష్కరిణిలోకి నీరు అక్కడున్న ఓ నంది నోటి నుండి వస్తూ వుంటుంది.
ఎక్కడో పుట్టిన జలధార పర్వతాల్లోంచి ప్రవహించి నంది నోటి ద్వారా పుష్కరణిలోకి చేరుతుంది. మండే ఎండల్లో అయినా, ముంచెత్తే వర్షాల్లో అయినా పుష్కరణిలో నీరు ఒకే మట్టంలో వుండటం విశేషం. ఈ పుష్కరిణిలో నీటికి ఔషధ గుణాలు వున్నాయని చెబుతారు.

ప్రధాన ఆలయం దర్శనం చేసుకొని బయటకు వస్తే గుహలతో ఉన్న కొండలు కనిపిస్తాయి. వీటికి చిన్న సైజులో మెట్లమార్గం ఉంటుంది. ఆగస్త్య మహర్షి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించిన గుహను వెంకటేశ్వర గుహ అని పిలుస్తారు. ఇక్కడే పక్కన ఉన్న మరో గుహలో శివలింగాన్ని ప్రతిష్టించినాడు దీనినే రొకళ్ల గుహ అని పిలుస్తారు. మరో గుహను శంకర గుహ అంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి తన శిష్యులకి జ్ఞానోపదేశం ఇక్కడే చేసాడని చెబుతుంటారు.

చేరుకోవడమెలా?

యాగంటికి చేరుకోవడం చాలా సులభం. మంచి రోడ్డు  వుంది.  కర్నూలు నుంచి రావచ్చు. కడప నుంచి చేరుకోవచ్చు. గుంటూరు నుంచి  రైలు మార్గానా వచ్చే వాళ్లు, నంద్యాల నుంచి యాగంటి చేరుకోవచ్చు.

Chandamuri Narasimhareddy

(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు,కదిరి. ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *