ఒంగోలు:ఆంధ్రప్రదేశ్ కు అమరావతే ఏకైక రాజధాని అని ప్రకటించేంత వరకు రాజకీయ పార్టీలకు అతీతంగా తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ కన్వీనర్ ఏ.శివారెడ్డి అన్నారు.
ఒంగోలులో ఆదివారం ఆచార్య రంగా భవన్లో అమరావతి పరిరక్షణ సమితి, ప్రకాశం జిల్లా అమరాతి పరిరక్షణ సమితి జెఏసీ సంయుక్తం ఆధ్వర్యంలో ‘సేవ్ అమరావతి – సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
సమావేశానికి హజరై కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏ.శివారెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అమరావతి ఉద్యమం సాగుతుందని ప్రకటించారు. అమరావతి రాజధానిగా కొనసాగాలనే ఏకైక ఏజెండాతో అమరావతి పరిక్షణ సమితి గత ఏడాది కాలంగా ఉద్యమాన్ని కొనసాగిస్తుందన్నారు.
ఈ ఉద్యమం ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి, ఒక మతానికి, ఒక రాజకీయ పార్టీకి సంబంధించినది కాదన్నారు. గత 390 రోజుల నుంచి చేసిన ఉద్యమాలు విజయవంతం అయ్యాయని చెప్పారు.
అమరావతి పరిరక్షణ సమితి పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఒంగోలు జెఏసీ విజయవంతం చేసిందని, అందుకు జెఏసీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అమరావతి పరిక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతి కార్యక్రమం ద్వారా రాజధానిగా అమరావతి ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు.
భవిష్యత్ లో కూడా మరిన్ని కార్యక్రమాలను రూపొందిస్తామన్నారు. అన్ని వర్తక, వాణిజ్య, కార్మిక సంఘాలను కలుపుకుని ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాజకీయం పరంగా ఎన్ని ప్రాముఖ్యతలు ఉన్నా రాజధానిగా అమరావతి కావాలని ముందుకు వచ్చి ఆందోళనల్లో పాల్గొన్న నాయకులు, ప్రజలకు జెఏసీ తరపున ధన్యవాదాలు తెలిపారు.
జెఏసీ నాయకులు గద్దె తిరుపతిరావుతో పాటుగా ఒంగోలు జెఏసీ నాయకులు శశి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ప్రకాష్, ప్రకాశం జిల్లా సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శి పి.ఆంజనేయులు, సీపీఐ ప్రధాన కార్యదర్శి ఎం.నారాయణ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్, తెలుగు మహిళా విభాగం నాయకురాలు ఎ.వెంకటరత్నం, కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అర్బన్ అధ్యక్షురాలు డి.నాగలక్ష్మి, కందుకూరి జెఏసీ జి.మోషే, బెజవాడ వెంకట్రావ్, రైతు విభాగం కన్వీనర్ పి.సుధాకర్, రంగారావు తదితరులు పాల్గొన్నారు.