రవితేజ రాక్: ‘క్రాక్‌’ మూవీ రివ్యూ

Rating:3

తెలుగులో సరైన మాస్ సినిమా వచ్చి ఎంతకాలమైంది..సర్లైండి..అసలు తెలుగులో థియోటర్ లో పెద్ద హీరో సినిమా రిలీజై ఎంతకాలమైంది అది చెప్పండి అంటారా..అంతేకదా కరోనా కాలంలో సినిమా రిలీజ్ కాకపోవటమూ పెద్ద కష్టమే. ఇప్పుడిప్పుడే థియోటర్స్ తెరుచుకుంటున్నాయి. యాభై శాతం ఆక్యుపెన్సీ అయినా ఫరవాలేదు..మా బాధలేవో మేము పడతాం అని సినిమా వాళ్లు రిలీజ్ లు పెట్టుకుంటున్నారు. సంక్రాంతి శోభను తీసుకురావటానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మొదటగా మాస్ మసాలా సినిమా క్రాక్ వచ్చేసింది. హిట్ కోసం డెస్పరేట్ గా ఎదురుచూస్తున్న రవితేజను ఈ సినిమా మరో కిక్ అవుతుందా లేక అతని కెరీర్ ని క్రాక్ అంటే బీటలు తీయించే పనిపెట్టుకుంటుందా చూద్దాం.

కథ

అనగనగా ఓ సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌. అతనిపేరు పోతరాజు వీర శంకర్‌(రవితేజ). అతని నిక్ నేమ్ క్రాక్‌ అనే పిలుస్తారు. ఆ నిక్ నేమ్ నిలబెట్టాలన్నట్లుగా నిరంతరం పనిచేస్తూంటాడు. దానికి తోడు అతని ఎదురుగా ఎవరైనా  బ్యాగ్రౌండ్‌ గురించి బిల్డప్ ఇస్తే..వాడికి బ్యాగ్రౌండ్ ప్రంట్ గ్రౌండ్ ..లేకుండా చేసేస్తూంటాడు. టాన్సఫర్స్ కేరాఫ్ ఎడ్రస్ గా కెరీక్ లో దూసుకుపోతున్న శంకర్ ఈసారి ఒంగోలు వస్తాడు. అక్కడ కటారికృష్ణ(సముద్రఖని) అనే పెద్ద పేరున్న రౌడీ గురించి తెలుస్తుంది. అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే అతని అడ్డాలో ఎంట్రీ ఇచ్చి అతని తాట తీసి సెంట్రల్ జైలుకు పంపుతాడు. అంత పెద్ద పేరున్న రౌడీని శంకర్ ఎలా లొంగతీసాడు. కటారి కృష్ణ ఎలాంటి ఎత్తులు వేసి శంకర్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. చివరకు కటారి కృష్ణ కటకటాల పాలవటానికి దారితీసిన సంఘటన ఏమిటి వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ

పోలీస్ కథలు ఎన్నో తెలుగు తెరపై చూసిన సగటు ప్రేక్షకుడుకి ఇదేమీ కొత్తా కాదు. అయితే ఈ విషయం డైరక్టర్ కు తెలుసు.పాత కథను కొత్త స్క్రీన్ ప్లేతో ఇంట్రస్టింగ్ గా చెప్పాలనే సినీ సూత్రాన్ని ఫాలో అయ్యిపోయాడు. ఈ కథను చక్కటి,చిక్కటి స్క్రీన్ ప్లే చేసాడు. ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ని ఆబ్జెక్టివ్ గా తీసుకుని కథను పరుగులుపెట్టించాడు. అందుకు రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాగా సహకరించాయి. అలాగే మరో ప్రక్క తమన్ ..ఈ సినిమాలో ఎలివేషన్ సీన్స్ కు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇలా ప్రతీ డిపార్టమెంట్..దీన్నో మాస్ ముత్యంలా తీర్చిదిద్దాలని ఉత్సాహపడటం కలిసొచ్చింది. ఇక కెమెరా వర్క్ అయితే వావ్ అనకుండా ఉండలేం. డైలాగులు బాగానే పేలాయి. వీళ్ళందిరీని సమన్వయపరుస్తూ నిర్మాత బాగానే ఖర్చుపెట్టారు. రవితేజ అయితే తనకు అలవాటైనా పాత్రలో అలవోకగా దూరిపోయారు. శృతి హాసనే కొద్దిగా తేడా కొట్టింది. సముద్రఖని విలన్ గా తెలుగులో వరస సినిమాలు చేసేస్తారేమో అన్నంత నమ్మకం కలిగించారు. వరలక్ష్మి శరత్ కుమార్ అదే నటనతో లాక్కొచ్చేసింది. ఓవరాల్ గా హిట్ సినిమాలో వీళ్లంతా ఉన్నరా లేక వీళ్లంతా ఉండటం వల్ల హిట్ అయ్యిందో అనిపించేలా ఉంది.

బ్యానర్స్‌: సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌
నటీనటులు:  రవితేజ, శ్రుతిహాసన్‌, సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్‌, రవిశంకర్‌, సప్తగిరి, వంశీ, సుధాకర్‌ కోమాకుల తదితరులు
దర్శకత్వం:  గోపీచంద్‌ మలినేని
నిర్మాత: బి.మధు
సంగీతం: తమన్‌.ఎస్‌.ఎస్‌
సినిమాటోగ్రఫీ:  జీకే విష్ణు
ఎడిటర్‌: నవీన్‌ నూలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *