(రాఘవశర్మ)
తిరుపతిలో ఆ రోజుల్లో జరిగిన చలం సాహిత్య సభ ఒక సంచలనం.
నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఈ సభ చాలా మందికి ఒక మందహాసం, మరచిపోని ఒక మధుర మైన జ్ఞాపకం.
నాలో కొత్త ఆలోచనలను రేకెత్తించిన సభ. శ్రీశ్రీని తొలిసారిగా నాకు చూపించిన సభ.అనేక పరిచయాలతో, ఆలోచనలతో నా జీవితాన్ని ఒక మలుపు తిప్పిన సభ. నన్ను ఉక్కిరిబిక్కిరి చేసిన మహాప్రస్థాన రచయితగా ఆ సభలో శ్రీశ్రీ ని చూడడం అదే తొలిసారి.
చలం మరణించిన కొత్తల్లో, 1979 మే నెలలో అనుకుంటా, తిరుపతి ఎస్వీయూనివర్సిటీ ఆర్ట్స్‌బ్లాక్ ఆడిటోరియంలో ఈ సభ జరిగింది.
మా కుటుంబం నెల్లూరు నుంచి తిరుపతికి వచ్చేసిన రెండేళ్ళకు జరిగిన సభ అది. దానికి ముందు ఎమర్జెన్సీ కాల మంతా కోవూరు లైబ్రరీలో చలం మూజింగ్స్, ప్రేమలేఖలు, స్త్రీ, బిడ్డల శిక్షణ, మైదానం, అమీనా వంటి చలం నవలల్లో మునిగి తేలిన అనుభూతిలో ఉన్నాను.
మహాప్రస్థానాన్ని చదివి, ఆ గీతాల ప్రవాహంలో ఓలలాడుతున్నకాలం అది.
దానికి చలం రాసిన ఆర్హతా పత్రం శైలిని మురిపెంగా భావించి ముచ్చటపడుతున్న రోజులు అవి.
ఎన్నో సాహిత్య సభలకు, ఎందరో కవులకు, రచయితలకు, మహావక్తలకు వేదికైన ఆర్ట్స్‌బ్లాక్ ఆడిటోరియం ఆ రోజు చలం సాహిత్యాభిమానులతో కిక్కిరిసిపోయింది.
ఇప్పుడంటే ఆ ఆడిటోరియంను ఏసీ చేశారు. ఆధునికంగా సీట్లను అమర్చారు. ఆరోజుల్లో అంతా చెక్క బెంచీలే. ముందు చెక్క బల్లలు. పైన తిరిగీ తిరగని ఫ్యాన్లు.
ప్రేక్షకులు ఎక్కవై వెనుక తలుపులు తెరిస్తే మెట్లపై నుంచి కూడా కొందరు వీక్షించారు, ఆ మెట్లపైనుంచే ఉపన్యాసాలు విన్నారు.
ఆ ఆడిటోరియంలో కూర్చోడానికి చోటు దొరకక కొందరు ప్రముఖులు వేదిక పక్కన, దారిలో నిలుచోవాల్సి వచ్చింది. కొందరు ఆడిటోరియం బైటనిలుచునే సభ ఆసాంతం విన్నారు.
ముందుగా వెళ్ళడం వల్ల కూర్చోడానికి మధ్య బెంచీలో నాకు సీటుదొరికింది. ఒక సాహిత్య సభకు ఇంత మంది రావడం నిజంగా చాలా అరుదైన విషయమే.
తెలుగు నాట చలం ఒక సంచలనం. చలం ఆలోచనలు స్వేచ్ఛా విహంగాలు. కులమైనా, మతమైనా, జాతి అయినా, ప్రాంతమైనా స్వేచ్ఛని నియంత్రించే దేన్నైనా సరే తన మనసు నుంచి గెంటేసిన వాడు చలం.
కుటుంబ బంధంలో స్త్రీని అధికార బంధంతో బానిసను చేసిందని బాధపడిన వాడు చలం. ప్రేమ బంధమే కానీ, అధికార బంధం ఉండకూడదని భావించిన వాడు చలం.
ఈ సభ కోసం శైలకుమార్, భూమన కరుణాకర రెడ్డి శ్రీశ్రీ ని మద్రాసు నుంచి వెంటబెట్టుకుని తీసుకొచ్చి జయశ్యామ్ లాడ్జిలో బస ఏర్పాటు చేశారు.
వేదికపైన శ్రీశ్రీ కూర్చున్నారు. పక్కన కె.సభ, ఇంకా ఎవరో ఒకరిద్దరు కూడా కూర్చున్నారు.
చలం గురించి, ఆయన సృష్టించిన సాహిత్యం గురించి, ముఖ్యంగా స్త్రీ స్వేచ్ఛ గురించి, ఆయన శైలి గురించి ; ఇలా ఒక్కొక్కరూ ఒక్కో అంశం గురించి మాట్లాడుతున్నారు.
భూమన్, త్రిపురనేని మదుసూధనరావు, కె. సభా, కేతు విశ్వనాథరెడ్డి, కేయస్వీ, మధురాంతకం రాజారాం వంటి వారందరినీ నేను చూడడం అదే తొలిసారి.
చలం సాహిత్య ప్రవాహంలో ఈదులాడినవారు, చలం శైలి అలలపై తేలాడిన వారు, చలం భావాలలో ఓలలాడిన వారు, చలం వ్యక్తీకరించిన అపరిమితమైన స్వేచ్ఛను కోరుకునే వారు, చలాన్ని అంతులేకుండా అభిమానించిన వారు, చలం స్వేచ్ఛ అరాచకమని ఆ తాత్వికతను తూర్పారబట్టిన వారు , చలం అభిప్రాయాలను అంగీకరించని వారు, ఎందరో ఆయన భక్తులు కూడా ఆ సభకు వచ్చారు.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/top-stories/features/another-meaningful-book-on-ussr-soviet-sahitya-bhaskarulu-intruduction/
నిజంగా చలం అంత వివాదాస్పద రచయిత తెలుగులో మరొకరు ఎవరూ లేరు.
శ్రీశ్రీని చూడాలి, శ్రీశ్రీ ఏం మాట్లాడతాడో వినాలి, శ్రీశ్రీ తో మాట్లాడాలి అని ఉత్సాహపడే చాలా మంది యువకులు వచ్చారు.
ఎమర్జెన్సీ లో ఉద్యోగాలు పోగొట్టుకుని, ముషీరాబాద్ జైల్లో గడిపిన భూమన్, త్రిపురనేని మదుసూధనరావు బైటికి వచ్చిన రెండేళ్ళకు జరిగిన సభ అది. భూమన కరుణాకర రెడ్డి కూడా ఎమర్జెన్సీలో ఖైదీనే. సభలో భూమన్ సన్నని గడ్డంతో చలాన్ని అభిమానిస్తూ ఆవేశంగా మాట్లాడారు.
చలం భావాలను తూర్పారబడుతూ త్రిపురనేని మదుసూధన రావు తాను రాసుకొచ్చిన ప్రసంగపాటాన్ని చదివారు ఆవేశంగా.
వక్తలు చలాన్ని సమర్ధిస్తూ మాట్లాడినప్పుడు ఆడిటోరియం చప్పట్లతో మారుమోగింది. చలాన్ని విమర్శించినప్పుడు ఎవ్వరూ కిక్కురుమనలేదు.
చలం సాహిత్యాన్ని విశ్లేషిస్తూ కేతు విశ్వనాథరెడ్డి మాట్లాడారు. చలం శైలి గురించి కేఎస్వీ మాట్లాడారు.
ఎంత మంది వక్తలు మాట్లాడుతున్నావేదికపైన శ్రీశ్రీ తనపాటికి తాను ఏదో పుస్తకం చదువుతూ, అప్పుడప్పుడూ శ్రద్ధగా వింటున్నట్టు కాసేపు తలెత్తి చూసేవారు.
వేదికపైన ఉన్న కె. సభా మాట్లాడుతూ చలం బహుశా రుక్మిణీ ప్రేమ గురించి అనుకుంటా రాసిన పుస్తకాన్ని వందసార్లు పైగా చదివానని చెప్పారు.
శ్రీశ్రీ మాట్లాడుతూ “సభాగారు ఆ పుస్తకాన్ని వందసార్లు చదివానన్నారు. నేను ఒక్క సారి కూడా చదవలేకపోయా ” అన్నారు.
అంతే సభలో అంతా నవ్వుల పువ్వులు విరిశాయి. సభా కాస్త ఇబ్బందిపడినట్టున్నారు. కె. సభా రాయలసీమ రైతాంగ సాహిత్య వైతాళికుడు. పాత్రికేయుడు, గొప్ప కథారచయిత.
సభా చలం భక్తులు. ఎంత భక్తులంటే , సమయం దొరికితే చాలు తిరుమణ్ణామలైలో చలం ముందు వాలిపోయేవారు.
రమణ మహర్షి అంటే చలం లాగా సభాకు కూడా ఆరాధనాభావం. ఆ రమణ మహర్షి పేరే తన కుమారుడుకు రమణ అని పేరు పెట్టారు. ఆ రమణే రచయిత, నిశికవుల్లో ఒకరైన కె.ఎస్ రమణ.
రమణ చిన్నతనంలో వేసవి సెలవులు వస్తే, సభా తన కుమారుడిని బందువుల ఇళ్ళకో, దర్శనీయ స్థలాలకో తీసుకెళ్ళకుండా చలం దగ్గరకు తీసుకెళ్లే వారు. ఆయనంటే సభా కు అంత అభిమానం, అంత భక్తి.
శ్రీశ్రీ జనరంజకమైన పెద్ద వక్త కాదు. కానీ ఆయన ఏం మాట్లాడినా విషయం ఉంటుంది. ఓపిగ్గా వింటారు. శ్రీశ్రీ ఉపన్యాసంలో చమక్కులుంటాయి. చమత్కారాలుంటాయి.
కొన్ని గంటలపాటు జరిగిన చలం సాహిత్య సభ అయిపోయేవరకు ఒక్కరంటే ఒక్కరుకూడా లేవలేదు. సభ అయిపోగానే శ్రీశ్రీ తో మాట్లాడాలని చాలా మంది యువకులు ఆయనను చుట్టుముట్టారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్న వేశారు.
శ్రీశ్రీ ఓపిగ్గా నవ్వుతూ సమాధానం చెప్పారు. ఎక్కువగా సాహిత్యపరమైన ప్రశ్నలే. నేనూ ఒక ప్రశ్నవేశాను అమాయకంగా “మీకు స్టాలిన్ అంటే ఇష్టమా? ట్రాట్స్కీ అంటే ఇష్టమా? ” అని.
” నాకు ట్రాట్స్కీ అంటే ఇష్టం. కానీ ఆ మాట పైకి అనకూడదు ష్‌ష్… ” అంటూ నా వైపు చూసి నవ్వుతూ నోటిపైన వేలు వేసుకున్నారు శ్రీశ్రీ.
ఆ రోజుల్లో నాలో ఆ రెండు ఆలోచనల మధ్య ఘర్షణ. రష్యాలో జరిగిన సోషలిస్టు విప్లవంలో లెనిన్‌కు వారిద్దరూ కుడిఎడమ భుజాలుగా పనిచేశారు. లెనిన్ మరణానంతరం వారిద్దరి మధ్య సైద్దాంతిక విభేదాలు పొడచూపాయి.
స్టాలిన్‌ది పై చేయి అయ్యింది. అందుకే ఆ ప్రశ్న వేశాను. తిరుపతిలో ఎన్ని సాహిత్య సభలు జరిగాయో! కానీ, చలం సాహిత్య సభ మాత్రం ఒక మైలు రాయి.
(అలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)
https://trendingtelugunews.com/top-stories/features/how-beautiful-lakes-and-tanks-disappeared-from-tirupati/