అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘ పంచాయతీ ఎన్నికలను బహిష్కించాలని నిర్ణయించింది. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని ఎన్జీవోలు ఇలా బహిరంగంగా వ్యతిరేకించి, బహిష్కరిస్తామనడం బహుశా దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగులు ఎన్నికలలో పాల్గొనరని, ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల విషయంలో మొండిగా వ్యవహరించి ముందుకెళ్లడం సరి కాదని ఎన్జీవోల సంఘం అభిప్రాయపడింది. కమిషన్ ప్రకటించిన తేదీలలో ఎన్నికల విధులకు ఉద్యోగులు హాజరు కాలేరని, అంందువల్ల ఎన్నికలను హిష్కరిస్తున్నామని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
గుంటూరులో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు.
ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో ఉద్యోగులు ఆందోళన చెందారని స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని ఉద్యోగులు రెండు నెలలుగా ఎన్నికల కమిషన్ను కోరుతున్నచంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేశారు.
రాష్ట్రంలో కరోనావైరస్ తీవ్రత నేపథ్యంలో ఉద్యోగులు ఎన్నికల్లో పాల్గొనడం సాధ్యం కాదని ఆయన అన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను సత్వరం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల కమిషన్ మొండిగా ముందుకు వెళ్తే తాము వాయిదా కోసం అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కూడా చెప్పారు.
తాము ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని కరోనా కారణంగా ప్రభుత్వం ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతోందని చెబుతూ ఉద్యోగులకు ఇవ్వాల్సిన రాయితీలను భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి తప్పకుండా సాధించుకుంటామని చంద్రశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు..