తెలంగాణ స్కూళ్ల మీద కెసిఆర్ జనవరి 11 నిర్ణయం

తెలంగాణలో  పాఠశాలలను ఎప్పటి నుంచి ప్రారంభించాలనే విషయం మీద జనవరి 11 ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కీలకసమావేశం ఏర్పాటుచేస్తున్నారు.

ఆ  రోజు  ఉదయం 11.30 గంటల నుండి రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతిభవన్ లో ఈ సమావేశం జరుగుతుంది.

రాష్ట్రంలో విద్యా సంస్థల్లో తరగతులను ఎప్పటి నుండి తిరిగి ప్రారంభించాలనే అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. ఏ తరగతి నుండి క్లాసులు నిర్వహించాలి ? ఏ విధంగా నిర్వహించాలి ? ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానం ఏమిటి ? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు.

కలెక్టర్ల తో పాటు సీనియర్ అధికారులు సమగ్ర సమాచారంతో ఈ సమావేశానికి  రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

సమాచారంలో చర్చకు వచ్చే ఇతర అంశాలు

రెవెన్యూకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రగతిభవన్ లో సీనియర్ అధికారులు, కొంత మంది కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో రెవెన్యూకు సంబంధించి పరిష్కరించాల్సిన కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. 11వ తేది నాడు జరిగే సమావేశంలో రెవెన్యూకు సంబంధించిన అంశాలను కూలంకషంగా చర్చిస్తారు. పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యూనల్ల ఏర్పాటు, పార్ట్.బి. లో చేర్చిన అంశాల పరిష్కారం తదితర విషయాలపై సమాశంలో చర్చిస్తారు. రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయిస్తారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందించే కార్యాచరణపై చర్చిస్తారు. వ్యాక్సీన్ అన్ని ప్రాంతాలకు సరఫరా చేయడం, ప్రధాన్యతా క్రమంలో వ్యాక్సీన్ ను పౌరులకు వేయడానికి సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తారు.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును సమీక్షిస్తారు. గ్రామాలకు, పట్టణాలకు నిధులు సకాలంలో అందుతున్నాయా? వాటి వినియోగం ఎలా ఉంది ? తదితర అంశాలపై చర్చిస్తారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన పనుల పరోగతిని సమీక్షిస్తారు.

రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం అమలును సమావేశంలో సమీక్షిస్తారు. గ్రామాల్లో, పట్టణాల్లో పచ్చదనం పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *