*ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వైసీపీ కండువా కప్పుకోవాలి- *ప్రభుత్వ ఉత్తర్వుల్లో రాజకీయ విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం- *తక్షణమే జీవోను ఉపసంహరించుకోవాలి
(కింజారపు అచ్చెన్నాయుడు)
జగన్ రెడ్డి పాలనలో కొంతమంది అధికారులు పరిధిదాటి వ్యవహరిస్తున్నారు. బిజినెస్ రూల్స్ తెలుసుకోకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జారీ చేసిన జీవోలో రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
మత సామరస్య కమిటీలను నియమిస్తూ ఇచ్చిన జీవో నెం.6 ఒక ప్రభుత్వ అధికారి తయారు చేసినట్లుగా లేదు. ఇది సెక్రటేరియట్ లో తయారైందా లేక తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులు తయారుచేసిన జీవోనా?
వైసీపీ నాయకులు తయారుచేసిన జీవోపై సీఎస్ కళ్లుమూసుకుని సంతకం పెట్టారా? లేక సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ గారే వైసీపీ కండువా కప్పుకున్నారా? 67 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి జోవో ఎన్నడైనా విడుదలైందా? ఏ జీవోలో అయినా ఇలాంటి భాష ఉపయోగించారా? మీరు అధికారులా? రాజకీయ నాయకులా? జగన్ రెడ్డి పాలనలో ఇప్పటిదాకా కొంతమంది పోలీసులే వైసీపీ కండువా కప్పుకున్నారని ప్రజలు భావిస్తున్నారు.
ఇప్పుడు ఈ జీవోతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సహా ఉన్నతాధికారుల్లో కొందరు కూడా వైసీపీ కండువా వేసుకున్నట్లుగా ఉంది. తక్షణమే ఈ జోవోను ఉపసంహరించుకోవాలి. సరైన భాష ఉపయోగించి ఈ కమిటీలపై మరో జీవోను విడుదల చేయాలి. పాలసీ పెరాలసిస్ వచ్చిన ప్రభుత్వంలోనే ఆదిత్యనాథ్ దాస్ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీగా, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారా?
పాలసీ పెరాలసిస్ వచ్చింది గత ప్రభుత్వానికి కాదు.. వైసీపీ కండువా కప్పుకున్న మీలాంటి అధికారులకే పాలసీ పెరాలసిస్ వచ్చింది. మీ పాలసీ పెరాలసిస్ తో 19 నెలల్లో మొత్తం రాష్ట్రానికే పెరాలసిస్ వచ్చేలా చేయడం సిగ్గుచేటు. అధికారులు తమ పరిధి తెలుసుకుని వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వ ఉత్తర్వుల్లో రాజకీయ విమర్శలు చేయడాన్ని మొట్టమొదటి సారిగా చూస్తున్నాం. ఇలాంటి ఎన్నో వింతలు జగన్ రెడ్డి పాలనలోనే జరుగుతున్నాయి. గతంలో జగన్ రెడ్డికి మేళ్లు చేకూర్చిన అధికారులకు ఏ గతి పట్టిందో మనం చూశాం. 2014-19 మధ్య పాలసీ పెరాలసిస్ జరిగిందని సీఎస్ ఏ విధంగా చెబుతారు?
మీరు సీఎస్ గా పనిచేస్తున్నారా, లేక వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారా? 2014-19 మధ్య దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలను చంద్రబాబునాయుడు గారు అమలు చేశారు. 2014-19 మధ్య అన్ని రంగాల్లో ప్రతి ఏడాది రెండెంకల వృద్ధి రేటు సాధించడం జరిగింది. 2016-17లో నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలవడం మీకు కనిపించలేదా? పోలవరం ప్రాజెక్టును 70శాతం పూర్తి చేయడం జరిగింది.
ఇది రాజారెడ్డి హయాంలో జరిగిందా లేక జగన్ రెడ్డి హయాంలో జరిగిందా? వ్యవసాయంలో 11 శాతం వృద్ధిరేటు రాజారెడ్డి పాలనలో జరిగిందా లేక జగన్ రెడ్డి పాలనలో జరిగిందా? రాజకీయ వ్యాఖ్యలతో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడటం సిగ్గుచేటు. సీఎస్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకోవాలి. వ్యవస్థలను ధ్వంసం చేస్తూ.. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన జగన్ రెడ్డిలో మీకు అభివృద్ధి ప్రదాత కనిపించడం దౌర్భాగ్యం.
ఆయన అభివృద్ధి ప్రదాత కాదు.. అభివృద్ధి విధ్వంసకుడు. వైసీపీ పాలనలో ఏ రంగంలో చూసినా అవినీతే కనిపిస్తోంది. ప్రశ్నిస్తున్న వారిని అణచివేస్తూ.. దళితులు, బడుగు, బలహీనవర్గాలపై దాడులకు పాల్పడుతూ.. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తున్న జగన్ రెడ్డి వైఖరి సీఎస్ కు కనిపించకపోవడం బాధాకరం. ప్రతిపక్షాలపై రాజకీయ విమర్శలు మాని ప్రజలకు మేలైన పాలన అందించేందుకు కృషిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. (ఇది తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ప్రకటన)
(కింజారపు అచ్చెన్నాయుడు,తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు)