వరంగల్ కోట ముట్టడికి కదులుతున్న బండి…

గ్రేటర్ వరంగల్ మీద భారతీయ జనతా పార్టీ ఎక్కు పెట్టింది. వరంగల్ ను కాపాడుకోవడం తెలంగాణ రాష్ట్రసమితికి ఎంత ముఖ్యమో, దుబ్బాక, జిహెచ్ ఎంసి  విజయపరంపరలను కొనసాగించడం బిజెపికి అంతే ముఖ్యం.

మరీ ప్రత్యేకించి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు చాలా చాలా ముఖ్యం.

ఎందుకంటే, రెండు విజయాల తర్వాత మూడో విజయం వస్తేనే సంజయ్ కు క్రెడిబిలిటీ ఉంటుంది.లేకపోతే, ఏదో  గుడ్డోడి రాయి గూట్లో పడినట్లు బిజెపి దుబ్బాకలో, జిహెచ్ ఎంసి లో గెలిచిందని ముఖ్యమంత్రి కెసిఆర్, కాబోయే ముఖ్యమంత్రి కెటిఆర్, ఇతర టిఆర్ ఎస్ మంత్రులు చేస్తున్న ప్రచారం నిజమని తెేలుతుంది.

అపుడు టిఆర్ ఎస్  తెలంగాణ ప్రజలు టిఆర్ ఎస్ తోనే ఉన్నారని, వాళ్లంతా బంగారు తెలంగాణాని చూస్తున్నారని, రైతుబంధుతో మస్తు హ్యాపీ గా ఉన్నారని  చెబుతుంది.

అంతేకాదు, దుబ్బాక, జిహెచ్ ఎం సిలో తగిలిన దెబ్బలు స్థానిక  నాయకత్వం లోపం వల్ల కాని, టిఆర్ ఎస్ ప్రభుత్వం వైఫల్యంగాని, కెసిఆర్ ప్రభుత్వం మీద ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని అర్థం  కాదని చెబుతుంది.

అందువల్ల వరంగల్ మునిసిల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడం బండి సంజయ్ నాయకత్వానికి సవాల్.

ఇక ముందు సంజయ్ కు అన్నీ సవాళ్లే.  నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఒక సవాల్. ఈ లోపు ఖమ్మం  కార్పొరేషన్ ఎన్నిక  కూడా జరుగుతుంది. అది కూడా సవాల్. ఈ మూడు ఎన్నికల్లో బిజెపి పరాజయం పాలయితే, టిఆర్ ఎస్ దూకుడు పెంచుుతంది.

అంతేనా?

కాదు ఇంకా చాలా ఉంది, బిజెపిలో కూడా సంజయ్ మీద వ్యతిరేకత పెరుగుతుంది. సంజయ్ దుందుడుకు విధానం, ఇతర నాయకులను కలుపుకుని పోక పోవడం వల్లే బిజెపికి ఎదురు దెబ్బలనే విమర్శలు మొదలవుతాయి.

అందువల్ల సంజయ్ వరంగల్ కోట ను పట్టుకునేందుకు వ్యూహం మొదలు పెట్టారు.

తొలుత ముఖ్యమంత్రి కెసిఆర్ మీద దాడితో ఈ వ్యూహం అమలుచేస్తున్నారు. ఇందులో మూడు ప్రధానాంశాలున్నాయి. ఒకటి: ముఖ్యమంత్రి కెసిఆర్ అజండాలో వరంగల్ అభివృద్ధి లేదు.అందుకే వరంగల్ పట్టణం నిర్లక్ష్యానికి గురైంది.  రెండు: వరంగల్ మీద వివక్ష ఉంది. అందుకే హైదరాబాద్ లో ఇచ్చిన వరద నష్టపరిహారం వరంగల్ లో  ఇవ్వలేదు.  మూడు : కేంద్రం వరంగల్ పట్టాణాభివృద్ధికి ఇచ్చిన నిధులను ఇతరపథకాలకు దారి మళ్లిస్తున్నాడు.

మొన్న వరంగల్ వరదలను బండి సంజయ్ పెద్ద ఇష్యూచేస్తున్నారు. తెలంగాణలో రెండో పెద్ద నగరమయిన వరంగల్ ను పేరుకు తగ్గట్టుగా అభివృద్ధి చేయలేదని,  వరంగల్ నిర్లక్ష్యంచేశారని, అసలు ముఖ్యమంత్రి అజండాలో వరంగల్ లేదని ఆయన వాదిస్తూన్నారు.

ఈ వాదనతో వరంగల్ ప్రజలను వప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

మొన్న వరదల్లో వరంగల్ మునిగిపోతే, ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక సారైన ఇటు వైపు చూడని విషయాన్ని ఆయన నొక్కి చెబుతున్నారు.

‘‘వరంగల్‌ వరదల్లో అతలాకుతలం అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటువైపు ఎందుకు రాలేదు,”  అని ఆయన మొదటి అస్త్రం వరంగల్ నుంచే ప్రగతి భవన్ మీద  సంధించారు.

“హైదరాబాద్ వరద బాధితులకు పదివేలు ఇచ్చిన కేసీఆర్ వరంగల్‌ వరదబాధితుకులకు నష్టపరిహారం  ఎందుకు ఇవ్వలేదు,”అని రెండో అస్త్రం విసిరారు.

కెసిఆర్ కు జిహెచ్ ఎంసి తర్వాత వరంగల్ భయం పుట్టుకుందని ఆయన చెప్పారు.

“కేసీఆర్ బడా చోర్. జిహెచ్ ఎంసిలో  జరిగిందే వరంగల్‌లోనూ జరగబోతోంది. ఇది గ్రహించాడు.  వరంగల్‌లో బీజేపీ గెలవబోతోందని సర్వేలు కూడా చెబుతున్నాయి. అందుకే వరంగల్‌లో ఎన్నికలు పెట్టడం లేదు, వాయిదా వేస్తున్నాడు,” అంటూ కెసిఆర్ కవ్వించే వ్యాఖ్యలు చేశారు.

వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 196 కోట్ల రూపాయలు ఇచ్చిందని చెబుతూ ఆ నిధులను కెసిఆర్ ప్రభుత్వం  దారి మళ్లించి, కేవలం రూ. 40 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆయన ఆరోపించారు.

వరంగల్ అభివృద్ధి నిర్లక్ష్యంచేస్తున్నారని, అక్కడ అభివృద్ధి ఏంచేశారని చెబుతూ ఈ విషయంమీద వరంగల్  భద్రకాళీ ముందర ప్రమాణానికి వరంగల్ ఎమ్మెల్యేలు, మంత్రులు సిద్ధమా? అని సవాల్ విసిరారు.

 

ఒక వైపు వరంగల్ మీద వివక్ష చూపుతూ మరొక వైపు వరంగల్‌లో టీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *