(టి.లక్ష్మినారాయణ)
కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం (Krishna River Management Board KRMB) విశాఖపట్నంకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ప్రతిపాదించడాన్ని నేడు (జనవరి 6, 2021) విజయవాడలో కొల్లి నాగేశ్వరరావు అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోనే బోర్డు కార్యాలయాన్ని విధిగా ఏర్పాటు చేయాలని, కర్నూలులో నెలకొల్పాలనే డిమాండ్ సహేతుకమైనది, హేతుబద్ధమైనదని సమావేశం అభిప్రాయపడింది.
కొల్లి నాగేశ్వరరావు అధ్యయన కేంద్రం, సమన్వయకర్త శ్రీ టి.లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రివర్యులు శ్రీ వడ్డే శోభనాద్రీశ్వరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కె.రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డా.ఎన్.తులసిరెడ్డి, తెలుగు రైతు విభాగం అధ్యక్షులు శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, అఖిల భారత రైతు సంఘం, ఉపాధ్యక్షులు శ్రీ ఆర్.వెంకయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వై.కేశవరావు, రాయలసీమ సాగునీటి సాధన సమితి, అధ్యక్షులు శ్రీ బొజ్జా దశరథరామిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సేవా సమితి, అధ్యక్షులు శ్రీ అక్కినేని భవానీప్రసాద్, నల్లమడ రైతు సంఘం, అధ్యక్షులు డా.కొల్లా రాజమోహన్, అమరావతి జెఏసి కన్వీనర్ శ్రీ శివారెడ్డి, అమరావతి మహిళా జెఏసి నాయకురాలు శ్రీమతి నార్ల మాలతి, సిపిఐ(ఎం.ఎల్.లిబరేషన్) నాయకులు శ్రీ హరినాథ్ లు ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అహంభావంతో తీసుకొన్న తెలివితక్కువ నిర్ణయంగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం తన నిర్ణయానికి స్వస్తి చెప్పి, విజ్ఞత ప్రదర్శించాలని హితవుపలికారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతం వెలుపల, గోదావరి నదీ పరివాహక ప్రాంతాన్ని కూడా దాటుకొని, వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నంలో కృష్ణా నది యాజమాన్య బోర్డును నెలకొల్పాన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్యవస్థీకరణ చట్టం -2014, పార్ట్ -9, సెక్షన్ -86, సబ్-సెక్షన్ -2 మేరకు కృష్ణా నది యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పాలి. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కాకుండా విశాఖపట్నానికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయడంలో కుట్ర దాగి ఉన్నదని వక్తలు అనుమానం వ్యక్తం చేశారు. అమరావతి నుండి రాజధానిని విశాఖకు తరలించాలనే దుష్ట ఆలోచనతో చేసిన చట్టాల చెల్లుబాటుపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖకు తరలించే ప్రతిపాదన చేయడం ద్వారా ప్రజలను మభ్యపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిందని తీవ్రంగా విమర్శించారు.
విభజన చట్టంలో కృష్ణా నది యాజమాన్య బోర్డు నిర్వర్తించాల్సిన బాధ్యతలు, కర్తవ్యాలను విస్పష్టంగా పేర్కొనడం జరిగింది. కృష్ణా నదీ జలాలను నేడు అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు మరియు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వినియోగించుకొనేలా కార్యాచరణను అమలు చేయడం, సమన్వయం చేయడం కృష్ణా నది యాజమాన్య బోర్డు బాధ్యత.
కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో బోర్డు కార్యాలయాన్ని నెలకొల్పితే బోర్డు తన బాధ్యతలు సజావుగా నిర్వహించడానికి సౌలభ్యంగా ఉంటుంది వక్తలు అభిప్రాయపడ్డారు.
పోలవరం ద్వారా, ప్రస్తుతం పట్టిసీమ ద్వారా 80 టిఎంసిలు ప్రకాశం బ్యారేజీకి తరలించిన మీదట, గోదావరి – కృష్ణా – పెన్నా నదుల అనుసంధాన పథకాన్ని అమలు చేయాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరితే కృష్ణా నదిపై కృష్ణా డెల్టా ఆధారపడాల్సిన అవసరమే ఉండదు. అందువల్ల కృష్ణా నదిపై ఆధారపడిన కరవు పీడిత రాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లా నీటి అవసరాలు తీర్చడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రథమ కర్తవ్యంగా ఉంటుంది. ఈ అన్ని కోణాల్లో ఆలోచించినప్పుడు కర్నూలులో బోర్డు కార్యాలయాన్ని నెలకొల్పడం సముచితమని సమావేశం అభిప్రాయపడింది.
కర్నూలు కృష్ణా నదీ పరివాహక ప్రాంతం నడిబొడ్డులో ఉన్నది. కృష్ణా నది, దాని ఉపనది తుంగభద్రపై రెండు తెలుగు రాష్ట్రాలలో నిర్మించబడిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, జలాశయాలను పరిగణలోకి తీసుకొని కర్నూలులో బోర్డు కార్యాలయాన్ని నెలకొల్పడం సముచితమని భావించింది.
అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెలగపూడి గోపాల కృష్ణ ప్రసాద్ బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో నెలకొల్పాలన్న డిమాండును సమర్థిస్తూ మెసేజ్ పంపారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ప్రధాన కార్యదర్శి శ్రీ సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కార్యదర్శి శ్రీ మల్నీడు యలమందారావు, సిపిఐ, కృష్ణా జిల్లా కార్యదర్శి శ్రీమతి అక్కినేని వనజ, ఎ.ఐ.టి.యు.సి. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్.రవీంద్రనాథ్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నాయకురాలు శ్రీమతి రాణి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పరిరక్షణ సమితి, అధ్యక్షులు డా.కొలికపూడి శ్రీనివాసరావు తదితరులు హాజరైనారు.
(టి.లక్ష్మీనారాయణ, సమన్వయకర్త, కొల్లి నాగేశ్వరరావు అధ్యయన కేంద్రం)