KRMB ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన అఖిలపక్ష సమావేశం
KRMB ని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం
రాయలసీమకు అన్ని విధాలుగా అండగా వుంటామని ప్రకటించిన అఖిలపక్షం
సాగునీటి విషయంలో ఉభయ తెలుగు రాష్టాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు కర్నూలులో వున్నందున కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులోనే ఏర్పాటు చేయాలని నేడు విజయవాడలో సమావేశమయిన రాజకీయపార్టీలు, రైతు సంఘాలు, వివిధ ప్రజాసంఘాలు ఏకగ్రీవంగాతీర్మానించాయి.
విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమావేశం వ్యతిరేకించింది.
బుధవారం నాడు కొల్లి నాగేశ్వరరావు అద్యయన కేంద్రం సమన్వయకర్త T.లక్ష్మీనారాయణ ఆద్వర్యంలో కృష్ణా నది యాజమాన్య బోర్డును విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులోనే ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.
సమావేశానికి మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షత వహించారు.
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఈ సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమకు సంబంధించిన పలు అంశాలను సమావేశం ముందు ఉంచారు.
శ్రీభాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు రాజధాని లేదా హైకోర్టు గానీ ఏర్పాటు చేయాలని వున్నప్పటికి తెలుగుదేశం ప్రభుత్వం శ్రీభాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కి రాజధాని, హైకోర్టులతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలనీ అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేసిందని ఆయన విమర్శించారు.
ఇప్పటి ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించిన నేపథ్యంలో న్యాయ రాజధానిని కర్నూలుగా ఎంపిక చేసిందని,కృష్ణా నది నీటి నిర్వహణలో కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు కర్నూలులోనే వున్నందున కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులోనే ఏర్పాటు చేయడం సమంజసమని దశరథరామిరెడ్డి అన్నారు.
1953 నుంచి నేటి వరకు కూడా రాయలసీమకు హక్కుగా వున్న తుంగభద్ర ఎగువకాలువకు 32.5 tmcలు,తుంగభద్ర దిగువకాలువకు 29.5 tmc, K.C.కెనాల్ కు 39.9 tmc, గాజులదిన్నె ప్రాజెక్టుకు 2 tmc ల నీటిని రాయలసీమకు వాడుకునే హక్కు ఉన్నప్పటికీ ఏనాడుకూడా పూర్తి స్థాయిలో రాయలసీమ రైతాంగం నీటిని వాడుకోలేదని దశరథరామిరెడ్డి తెలిపారు.
దీనికి ప్రధాన కారణం నీటిని నిల్వ చేసుకునే రిజర్వాయర్లు రాయలసీమలో లేకపోవడమేనని దీనితో రాయలసీమ రైతాంగం కోట్లాది రూపాయలను నష్టపోతున్నారని ఆయన సమావేశం ముందు ఉంచారు.
ఎక్కడో ఢిల్లీలోనో లేక హైదరాబాదు లోనో కృష్ణా నది నీటి నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటున్న KRMB ,తెలుగు రాష్టాలలో అసలు రాయలసీమ అనే ప్రాంతం ఉందనే విషయాన్ని గుర్తించడం లేదని ఆయన దుయ్యబట్టారు. శ్రీశైలం రిజర్వాయర్ లో కనీస నీటిమట్టం 854 అడుగులు వుంటేనే రాయలసీమ ప్రజానీకానికి త్రాగునీరు లభిస్తుందని కానీ KRMB శ్రీశైలం ప్రాజెక్టు లో 854 అడుగులు నీటిని నిల్వ ఉంచకుండా 790 అడుగుల వరకు నీటిని దిగువకు తోడేయడం వలన రాయలసీమకు గుక్కెడు త్రాగు నీరు కూడా లభించడం లేదని దశరథరామిరెడ్డి విమర్శించారు.
వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అత్యంత వెనుకబడిన రాయలసీమ నాలుగు జిల్లాలకే గాక,ప్రకాశం, నెల్లూరు, దక్షిణ తెలంగాణ జిల్లాలకు సక్రమంగా నీటిని అందించాలంటే కృష్ణా నది యాజమాన్య మండలిని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేసారు.
కోవిడ్ -19 వలన భారతదేశంలో లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో దేశమంతటా అన్ని పరిశ్రమలు మూతపడినప్పటికీ భారతదేశాన్ని ఆదుకున్నది రైతాంగమేనని అలాంటి రైతన్నల వెన్ను విరిచే కార్యక్రమాలను ఏ ప్రభుత్వము కూడా చేపట్టరాదని దశరథరామిరెడ్డి అన్నారు.
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాలకు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు. RARS పరిరక్షణకు మార్చి 1న నంద్యాలలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని దశరథరామిరెడ్డి అఖిలపక్ష నాయకులను కోరారు.
అంతేకాకుండా మచిలీపట్నం, అనకాపల్లి అగ్రికల్చరల్ రీసెర్చ్ భూములను కూడా ప్రభుత్వం వైద్య కళాశాలకు కేటాయించిందని దీనిని రైతు సంఘాల నాయకులు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన కోరారు.
ఈ అఖిలపక్ష సమావేశంలో C.P.I. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తులశిరెడ్డి,C.P.M. పార్టీ నుండి కేశవ్ రావు, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్రక్షులు రావుల వెంకయ్య, తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీని వాస రెడ్డి, రైతు సంఘం నాయకులు డాక్టర్ కొల్లా రిజమోహన్ రావు, మహిళా సంఘాల ప్రతినిధులు వనజ, మాలతి, తదితరులు పాల్గొన్నారు