‘హైదరాబాద్ వరదసాయం ఏమైంది కెసిఆర్ సారూ!’

హైదరాబాద్,జనవరి 6 ,2021 :కెసిఆర్ జిహెచ్ ఎంసి ఎన్నికల ముందు హైదరాబాద్ వరదల్లో నష్టపోయిన వారికి  ప్రకటించిన వరదసాయం ఏమైందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.

గ్రేటర్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఎందరికో ఇచ్చాం ఇంకొందరికి ఇవ్వలేమా అనడం, ఎన్నికల ఫలితాలు రాగానే అందరికి వరదసాయం అందుతుందని  కెసిఆర్ ప్రకటించడాన్ని గుర్తు చేస్తూ  ఇపుడు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదని అన్నారు.

ప్రస్తుతం హైకోర్టు నోటిసులకైనా స్పందించి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మరియు జిఎచ్ఎంసి కమిషనర్లు సమాధానమియ్యాలని ఇంతవరకు ఎంతమందికి వరదసాయం అందించారో,ఇంకా ఎంతమంది అర్హులు ఉన్నారో మరియు యెంత మంది అర్హులను గుర్తించాల్సివుందో తెలియజేయాలని దాసోజు డిమాండ్ చేసారు.

వెంటనే అధికారులు స్పందించి వరదసాయం పంపిణి వివరాలు డివిజన్,వార్డుల వారీగా తెలియజేయాలని డిమాండ్ చేసారు.

AICC అధికార ప్రతినిధి డా. శ్రవణ్ దాసోజు

ముఖ్యమంత్రి సహాయనిధిపై రాష్ట్ర ప్రజలకు పూర్తి హక్కులు ఉన్నాయని అర్హులైన వారందరికీ సాయం అందించాల్సిందేనని ఈ సహాయనిధి ముఖ్యమంత్రిదో లేక తెరాస పార్టీ సొంత ఖజానా కాదని ఆయన వ్యాఖ్యానించారు.

తాను రాసిన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ వరదసాయం లో ఘోరమైన అవినీతికి తెరాస నాయకులు,ఎమ్మెల్యే లు జిఎచ్ఎంసి అధికారులు పాల్పడ్డారని వారందరికీ కఠిన శిక్షలు విధించాలని దాసోజు కోరారు.

నవంబర్ 2 ,2020 న హైకోర్టుకు రాసిన లేఖలో శ్రవణ్ వరదసాయం అవినీతిపై సమగ్ర వివరాలు పొందుపరిచారు.ఈ లేఖలో తెరాస ప్రభుత్వం హామీ మేరకు పదివేల రూపాయలు పంచాల్సి ఉందని చాలా చోట్ల డబ్బులు పంచారని పదివేలకు బదులు తెరాస నాయకులు,కార్పొరేటర్లు తమ చేతివాటం ప్రదర్శించారని పేర్కొ్న్నారు.

కొన్నిచోట్ల టిఆర్ ఎస్ నాయకులు వరద సాయం 10 వేల రూపాయలకు బదులు 2వేలు,3 వేలరూపాయలు  చేతిలోపెట్టారని ఇదేమని అడిగితే దిక్కున్నచోట చెప్పుకోవాలని  బెదిరించారని శ్రవణ్ లేఖ లో తెలిపారు

అసలు ప్రభుత్వ సాయం అందించడం లో ఏ హోదా లేని తెరాస నాయకుల జోక్యం ఏంటని శ్రవణ్ అన్నారు.

“అక్టోబర్ లో కురిసిన వర్షాలకు హైదరాబాద్ ప్రజలు తీవ్ర కష్ట,నష్టాలకు గురైనారని వారికి వరదసాయం అందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆరున్నర లక్షల మందికి 650 కోట్లు వరదసాయం అందించామన్నారు. ఇంకా ఓ లక్ష మందికి సహాయం చేస్తామన్నారు. ఈ మాటలు నీటిమూటలు అయ్యాయి,” అని  దాసోజు  అన్నారు.

గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా కెసిఆర్,తెరాస నాయకులు ప్రజలను మభ్యపెడుతూ ప్రజాధనాన్ని వాడుకుని ఎన్నికల తరువాత ప్రజలను విస్మరించారని ఆయన విమర్శించారు.

గౌరవ హైకోర్టు నిజమైన లబ్దిదారులకు న్యాయం చేసి అవినీతిపరులను జైలుకు పంపాలని దాసోజు అభ్యర్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *