తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి చేతి నిండా పని దొరికింది. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ఇంత బిజి అవుేతుందని ఎవరూ వూహించి ఉండరు. ఆ పార్టీ ఇటీవల ఆంధ్రలో ఎపుడూ సొంతంగా గెలవలేదు. టిడిపితో పొత్తు ఉన్న రోజులు బిజెపికి స్వర్ణయుగం.
పొత్తు పోయాక బిజెపి మళ్లీ మాయమయింది.కేవలం పత్రికల ప్రకటనల్లో ఉండేది. ఎక్కడయిన ఒకచోట కాలు మేపే జాగా దొరకుతుందని బిజెపి అన్ని ప్రయత్నాలు చేసింది. రాయలసీమ కు వెళ్లి రాయలసీమ రాజధాని అని, హైకోర్టు అని వాదించింది. రాయలసీమ రెసొల్యూషన్ పాస్ చేసింది. ఉత్తరాంధ్రలో ప్రాంతీయ సమస్యలని ప్రయత్నించింది. ఇవేవి పనిచేయలేదు. ఇలాంటి బిజెపికి ఇపుడు ఆలయాల విధ్వంసం వరప్రసాదమయింది.
పార్టీనేతలు జనసేనతో కలసి రామతీర్థం కు ఈ రోజు ధర్మ యాత్ర చేశారు.ఈ సందర్భంగా జరిగిన హౌస్ అరెస్టు, అరెస్టు, లాఠీ చార్జీలు, పోలీసు కొట్టడాలు పార్టీకి మాంచి ప్రచారం తెచ్చాయి. ఇక ఈ సమస్య మీద వాళ్లకి గ్రౌండ్ ప్రిపేర్ చేసేందుకు త్రిదండి చిన్న జీయర్ స్వామి జనవరి 17 నుంచి దాడులకు గురయిన ఆలయాలకు యాత్ర చేస్తారట.
రామతీర్థానికి 50 వేల మంది సాధువులను ఆహ్వానించి నిరసన తెలుపుతామని అఖిల భారత హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జివిఆర్ శాస్త్రి ప్రకటించారు.ప్రతిరోజు ఏదో ఒక చోట చిన్నదో పెద్దతో ఆలయ దాడి, విగ్రహ విధ్వంసం జరుగుతూ బిజెపి చేతినిండా పని పెడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ బిజెపి కార్యకలపాలకు ఎపుడూ రాజకీయ వాతావరణం ఎపుడూ ఇంత అనుకూలంగా లేదు.
తెలంగాణలో…
ఆల్రెడీ దుబ్బాక, జిహెచ్ ఎంసి ఎన్నికల్లో గెలిచాక తెలంగాణ లో బిజెపికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. ఆ పార్టీ 2023లో అధికారం కలలు కంటూ ఉంది. నాయకులు వోవర్ టైమ్ లో పనిచేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో, మొన్నటి జిహెచ్ ఎంసి ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లంతా ప్రగతి భవన్ ను చుట్టుముట్టారు. జిహెచ్ ఎంసి నూతన పాలక మండలిని వెంటనే ఏర్పాటు చేయాలనేది వారి డిమాండ్. తాము గెలిచి నెల రోజులు అవుతున్నా కూడా తమకి ఎలాంటి గుర్తింపు లేదని , ప్రజలు ఎన్నుకుంటే ప్రజాస్వామ్య పద్దతిలో గెలిచాము గెలిచాక తమకు హోదా లేదని, ప్రజలకి ఏం సమాధానం చెప్పాలని అంటూ వారు మండిపడుతున్నారు. వారందరిని పోలీసులు అరెస్టు చేశారు.
మరొక వైపు తెలంగాణ బిజెవైఎం అధ్యక్షుడు భానుప్రకాశ్ మీద మైహోం రామేశ్వరరావు గుండాలు దాడి చేసి హత్యప్రయత్నం చేశారని, దీనికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాపితంగా మైహోం రామేశ్వరరావు దిష్టిబొమ్మను దగ్దం చేయాలని బిజెవైఎం పిలుపునిచ్చింది. రామేశ్వరరావు కొడుకు నిర్వహిస్తున్న ఆహ్ యాప్ ఒటిటి డర్టీ హరి అని సినిమాను ప్రసారం చేశారని, ఇందులో హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని చెబుతూ భాను ప్రకాశ్ నాయకత్వంలో యాప్ కార్యాలయం వెళ్లారు. అక్కడ ఆయన మీద దాడిజరిగింది. బిజెపి అధ్యక్షుడు సంజయ్ కుమార్ దాడిని ఖండించారు.
ఇదీ సంగతి.