ఒక చిన్న ఎన్నికల దెబ్బ తెలంగాణలో ఎన్ని మార్పులు తీసుకువచ్చిందో చూడండి. అందుకే ప్రజాస్వామ్యంలో బలమయిన ప్రతిపక్షం ఉండాలని చెబుతారు. దుబ్బాక, మునిసిపల్ ఎన్నికల్లో బిజెపి తీసిన దెబ్బతో తెలంగాణ ప్రభుత్వ విధానాలు పూర్తిగా మారిపోతున్నాయి.
ఈ ఎన్నికల ముందు ప్రభుత్వం ఏదనుకుంటే అది జరిగేది. ముఖ్యమంత్రి ఏది చెబితే అదే మంచిది, ప్రతిపక్షాలకు సలహా ఇచ్చే హక్కుల లేవు, ప్రజలు తిరస్కరించిన పార్టీలు సలహాలు ఇచ్చేదేమిటి? అనే దోరణి తెలంగాణ ప్రభుత్వం లో కనిపించేది.
ముఖ్యమంత్రి కెసిఆర్ నిజానికి కేంద్రాన్నిప్రధానిని గుర్తించనే లేదు.నిధులు విడుదలచేయడంలేదనే ప్రకటనలో తప్ప తెలంగాణ ప్రభుత్వంలో టిఆర్ ఎస్ లో కేంద్రం, ప్రధాని అనే మాటలు వినిపించేవి కాదు. కేంద్రం మిధ్య అనే ధోరణి ఇది. ఇలాంటిచోట ఇపుడు లిబరలిజం మొదలయింది. ముఖ్యమంత్రి స్నేహపూర్వకంగా, ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. అన్ని వర్గాల మీద అభిమానం చూపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి లో పరివర్తనకు తాజా ఉదాహరణ ప్రధాని ఆయుష్మాన్ భారత్ పథకం పట్ల ధోరణి మారడం.
‘ప్రధాని ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ కంటే ఎంతో మెరుగైన ఆరోగ్యశ్రీ పథకం ఉందికాబట్టి మేం కేంద్ర పథకంలో చేర’మని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటిస్తూ వచ్చారు.
ఇపుడు ఈ విధానాన్ని రోల్ బ్యాక్ చేసుకున్నారు.
తెలంగాణప్రభుత్వం అమలుచేస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రధానిమోదీ ఆయుష్మాన్ భారత్ పథకంతో అనుసంధానం చేయబోతున్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఇలాంటి ప్రకటనల ముఖ్యమంత్రి చేయాలి.అయితే, బహిరంగంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్రానికి తెలియజేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది.
ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేరుగా ప్రధాని మంత్రి మోదీకే తెలియచేశారు.
బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ర్టాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులతో ప్రాజెక్టుల పురోగతి, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, జల్‌జీవన్ మిషన్ పథకాలపై వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు.
14 నెలలుగా ఢిల్లీ వైపు చూడని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధానిని కలుసుకుని వచ్చాకనే ఈ పరిణామాలు జరుగుతున్నాయి. ఒకటా రెండా? ప్రతిపక్షాలు వ్యతిరేకించినవి,తాను అమలుచేసి తీరతానని ముఖ్యమంత్రి ప్రకటించిన పథకాన్నింటిని ఉపసంహరించుకోవడమో మార్పు చేయడమో చేస్తున్నారు. ఉద్యోగాల రిక్రూట్ మెంట్ అంటున్నారు, ధరణి మూసేశారు. ఎల్ ఆర్ ఎస్ రద్దు చేశారు.పిఆర్సీ అమలుచేస్తామంటున్నారు. ఉద్యోగుల బకాయిలన్నీ చెల్లిస్తామంటున్నారు. రాష్ట్రంలోని ఉద్యోగుల నేతలందరిని ప్రత్యేకంగా న్యూయర్ లంచ్ కు ప్రగతి భవన్ పిల్చి తాను ఉద్యోగ మిత్రుడిని ముఖ్యమంత్రి రుజువుచేసుకుంటున్నారు. అంతేకాదు, కేంద్రం చెవులకు మ్యూజిక్ లాగా ఉండే విధంగా లోకల్ లెవెల్ ప్రొక్యూర్ మెంట్ పాలసీని మూసేసుకుంటున్నారు….
ఇలా ఎన్ని మార్పులో వచ్చాయి. ఇంకా ఎన్ని ఉపసంహారాలు, సవరణలు ఉంటాయోచూడాలి. అందుకే రాజకీయాల్లో ప్రతిపక్షాలుండాలి. రూలింగ్ పార్టీలకు పక్కలో బల్లెం ఉండాలి. ఓటర్లు ఈ విషయం గుర్తించాలి.