విజయవాడ: విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపై ఉన్న కోదండరాముడి విగ్రహం ధ్వంసం చేయడ పట్ల జనసేనే అధినేత పవన్ కల్యాణ్ విస్మయం వ్యక్తం చేశారు. ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన చర్యఅని, దీని మీద ముఖ్యమంత్రి స్వయంగా స్పందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఇటీవల ఆలయాలమీద తరచూ దాడుల జరుగుతూ ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, ఎక్కువవుతున్న ఈ దాడుల మీద సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక రెండేళ్లుగా రాష్ట్రంలో హిందూ మతంపై ఒక పథకం ప్రకారమే దాడులు సాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటిదెపుడూ జరగేలేదని ఆయన గుర్తు చేశారు
రామతీర్థం కోదండ రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విధానం, విగ్రహం శిరస్సు కనిపించకుండా చేయడం చూస్తే ఇందులో ఏదో ఉద్మాదం దాగి ఉన్నట్లు అర్థమవుతుందని పవన్ కల్యాణ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల దేవతా విగ్రహాలు ధ్వంసం అవుతున్నాయి. ఆలయ రథం దగ్థమయింది. వీటి పరాకాష్ఠ రామతీర్థం ఘటన. శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని పగలగొట్టడమే కాకుండా శిరస్సు ఛేదించి తీసుకెళ్లడం జరిగింది. ఇది సాదాసీదా పిచ్చివాళ్ల చర్య కాదు. మత మౌఢ్యం తలకెక్కిన ఉన్మాద చర్య. గత ఏడాదిన్నరగా సాగుతున్న దాడుదలను ప్రస్తావిస్తూ పిఠాపురం, కొండ బిట్రగుంట, అంతర్వేది ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం తీరు నిర్లక్ష్యంగా ఉంది. అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధంచేసిన ఘటనను ప్రస్తావిస్తూ దాని వెనక ఉన్నవారిని, ఆ నేరానికి పాల్పడ్డవారిని ఇంకా పట్టుకోనేలేదులేదు.
అక్కడ అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాగుతుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కోదండ రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు. ఆయనకు ఏ మత విశ్వాసం ఉన్నా పరమతాలను గౌరవించాలి కదా?
ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల మీద కేంద్ర హోంశాఖ కూడా దృష్టి సారించాలి. ఈ సంఘటనలపై సీబీఐతో దర్యాప్తు చేయిస్తే దీని వెనక ఉన్న కారణాలు బయటపడతాయి.