తెలంగాణను పొగమంచు మరి కొద్ది రోజులు కప్పేయనుంది. మరికొద్ది రోజులు అంటే కనీసం జనవరి మూడో తేదీ దాకా హైదరాబాద్ తో సహా అనేక ప్రాంతాలలో ప్రజలు చలికి వణికిపోక తప్పదు. పొద్దున ఎనిమిదిన్నరదాకా పొగమంచు కమ్ముకునే ఉంటుంది. నిజానికి తెల్లవారుజామునే నాలుగున్నర నుంచే నగరానికి కూరగాయలు,పాలు రవాణా చేసే వాళ్లు విజిబిలిటి సమస్య ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాలలో రోడ్లమీద ఎదురుగా ఏమొస్తున్నదో తెలియని పరిస్థితి ఎదురవుతుంది.
హైదరాబాద్ లోని బిహెచ్ ఇఎల్ ప్రాంతంలోనిన్న రాత్రి 11.1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. పగటి పూట కొద్ది వేడిగా, ఎండగా ఉన్న రాత్రి అయ్యే సరికి పొగమంచు పెరుగుతున్నది, చలివణికిస్తున్నది. ఇంత చలి కాలం హైదరాబాద్ చరిత్రలో లేదు. ఇటీవల హైదరాబాద్ లో కూడా తీవ్రచలికాలం ఎదురవుతున్నది.
పగటి పూట ఉష్ణోగ్రతకు సంబంధించి హైదరాబాద్ ఎల్ బినగర్ లో 32.4 డిగ్రీల సెల్సియస్ రికార్డయింది. ఇది బాగా వేడిగా ఉన్నట్లే లెక్క.
రాష్ట్రంలో అనేక ప్రాంతాలో రాత్రి పూట సగటు ఉష్ణోగ్రత 13 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ దాకా పడిపోవచ్చని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి,ప్రణాళిక విభాగం పేర్కొంది.
కొమరం భీమ్ జిల్లాలోని గిన్నదారిలో డిసెంబర్ 27, డిసెంబర్ 28 మధ్య 8.7 డి సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది.
హైదరాబాద్ లో సోమవారం సగటు కనీసం ఉష్ణోగ్రత 13.5 డి.సె. ఇది ఇంకా పడిపోయే అవకాశం ఉందని, చలిగాడ్పులు, పొగమంచు కష్టాలు మరికొద్ది రోజులుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పొద్దున పూట ప్రయాణాలు మానుకుని, పొగమంచుతగ్గాకన ప్రయాణాలు చేపట్టాలని హైదరాబాద్ పోలీసులు కూడా హెచ్చరిక చేశారు.
తక్కువ ఎత్తులో తూర్పు, ఆగ్నేయం నుంచి వీస్తున్న గాలులవల్ల ఇలా ఉష్ణోగ్రత పడిపోతున్నదని వాతావరణ శాఖ పేర్కొంది.
గాలి కలుషితమవుతూ ఉంది
ఇలాంటి శీతల వాతావరణ కారణంగా హైదరాబాద్ లో గాలి పాడువుతూ ఉంది. అటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) పడిపోతూ ఉంది. రెండు రోజుల కిందట ఆదివారం నాడు AQI 185గా నమోదయింది. అదే ఒక వారం కిందట 126 ఉండింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నెంబర్ ఎంత తక్కువగా ఉంటే గాలి అంత ‘మంచి’ (Good ) అని అర్థం. ఉాదాహరణకు AQI 0-50 ఉంటే గాలి మంచిగా ఉందని అర్థం. AQI 51-100 ఉంటే సంతృప్తి కరంగా (satisfactory)ఉందని, 101-200 పర్వాలేదు (మోడరేట్ )అని, 201-300 ఉంటే పూర్ అని, 301-400 ఉంటే వెరీ పూర్ అని 401 నుంచి 500 ఉంటే సివియర్ (severe) అని అర్థం.
తెలంగాణ పొల్యూషన్ కంట్రోలో బోర్డు అందిస్తున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ లో గాలి వేగంతక్కువగా ఉండటం వల్ల గాలిలో సూక్ష్మాణు కలుషిత పదార్థాలు (Particulate matter) చిక్కుకుని పోయి ఎయిర్ క్వాలిటీ పడిపోతున్నది. గాలి వేగం గత రెండు మూడు రోజులుగ దాదాపుగా నిలకడగా ఉంది. దీనితో నగరంలో విడుదలవుతున్న పొల్యూషన్ పైపైకి ఎగిరిపోలేదు. దీనితో పార్టిక్యులేట్ కలుషిత పదార్థాలు గాలిలో బాగా పేరుకుపోయి, ఎయిర్ క్వాలిటీ పడిపోయింది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇలా పడిపోయింది
డిసెంబర్ 21 న 126 ఉండింది. డిసెంబర్ 22న ఇది 141 కి పెరిగింది. డిసెంబర్ 23న 162కు పెరిగింది. డిసెంబర్ 24న 160కి వచ్చింది. డిసెంబర్ 25 న 176, డిసెంబర్ 26న 186, డిసెంబర్ 27న 185 గా రికార్డు అయింది.