(జి.కిషన్‌రావు, వైటీడీఏ వైస్ ఛైర్మన్)
సప్తగోపురాలతో సర్వాంగ సుందరంగా స్తంభోద్భవుని ఆలయం
90 శాతం పూర్తయిన ప్రధానాలయ పునర్నిర్మాణం
తరతరాలకూ యాదికుండేలా నారసింహుని శిల్పకళాశోభ
ఎటుచూసినా.. ఆధ్యాత్మికత ఉట్టిపడే కృష్ణ శిలా సౌందర్యం.. అద్భుత గోపురాలు.. ప్రభవించే ప్రాకారాలు.. ఆళ్వారులు.. దశావతారాలు.. ఒక్కటేమిటి ఆద్యంతం భక్తి పారవశ్యంలో ఓలలాడించే కళారూపాలకు ఆలవాలంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అంగరంగ వైభవంగా రూపుదిద్దుకుంటోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వామివారి ఆలయ పునర్నిర్మాణం 90 శాతం పూర్తైంది. మిగిలి ఉన్న చిన్న, చిన్న పనులను ముగించుకొని త్వరలోనే సర్వాంగ సుందరంగా.. భక్తులకు సకల వసతుల మందిరంగా సాక్షాత్కరించబోతోంది.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ క్షేత్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పునర్నిర్మాణమవుతోంది. పాంచరాత్ర ఆగమ, సంఖ్యా శాస్త్రం ప్రకారం 2.33 ఎకరాల విస్తీర్ణంలో యాదాద్రిలో స్వయంభువుల సన్నిధి రూపుదిద్దుకుంటోంది. మాడవీధులు, ప్రాకారాలతో కలిపి క్షేత్ర ప్రాకారం 4.3 ఎకరాల విస్తీర్ణంలో సిద్ధమవుతోంది.
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో 2016 అక్టోబరు 11న ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.780 కోట్లను వివిధ నిర్మాణాలు, స్థల సేకరణకు ఖర్చు చేశారు. షిర్డీ, అక్షరధామ్ ఆలయాల్లో నిర్మించిన విధంగా ఇత్తడి క్యూలైన్లు, ఆలయ కొండకు ఉత్తర దిశలో మందిరం ఆకారంలో నిర్మించనున్న బస్‌బే యాదాద్రి క్షేత్రానికి మరింత శోభను తీసుకురానుంది. ఈ పనులన్నీ యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ-యాడా) ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
సర్వ హంగులతో ప్రధాన ఆలయం
కాకతీయుల శిల్పకళ ఉట్టిపడేలా ప్రధానాలయం పూర్తిగా కృష్ణశిలతో నిర్మితమవుతోంది. ఇప్పటి వరకు దీనికి రూ.160 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.40 కోట్ల వరకు ఖర్చు అవుతుందని వైటీడీఏ అధికారులు వెల్లడించారు.
పంచనారసింహులు కొలువైన ప్రధానాలయంలో సప్త గోపురాలతో పాటు గర్భాలయం ఎదుట 12 మంది ఆళ్వారుల శిల్పాలు, మహాముఖ మండపం, రాజగోపురాలు, దివ్య విమాన గోపురాల నిర్మాణం పూర్తయింది. ఈ కోవెలకు రెండు ప్రాకారాలతో పాటు నలువైపులా నిర్మించిన సాలాహారాల్లో దివ్య దేశాలు (వైష్ణవానికి సంబంధించిన ఆలయాలు), దశావతారాలు, నారసింహుడి రూపాలు పొందుపర్చారు. గర్భాలయానికి 17 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పు ఉండే ద్వారాలు బిగించారు. ఈ ద్వారాలకు బంగారు తాపడం చేసే పనులు మొదలుకావాల్సి ఉంది. ప్రవేశ ద్వారం దక్షిణ దిశలో రాతి గోడపై వెండి పలకలతో ప్రహ్లాద చరిత్ర, తొలి ప్రాకారంలో లోపలి వైపు యాలి (సింహం బొమ్మలతో స్తూపాలు) నిర్మాణాలను శిల్పులు అద్భుతంగా చెక్కారు. ధ్వజస్తంభం, బలిపీఠం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పట్టణం నుంచి కొండపైకి వెళ్లేందుకు మెట్ల మార్గం, ఈ దారిలో రాజగోపుర నిర్మాణం తుది దశకు చేరుకుంది. దివ్య విమాన గోపురానికి అవసరమయ్యే బంగారాన్ని భక్తుల నుంచే సేకరించాలని దేవస్థానం నిర్ణయించింది. దీనిపై తుది మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది.
కృష్ణ శిలతోనే శివాలయం*
ప్రధానాలయానికి అనుబంధంగా పునర్నిర్మిస్తున్న శివాలయం సైతం కృష్ణశిలతోనే సిద్ధమవుతోంది. స్లాబ్ వరకు కృష్ణశిలను వినియోగించగా.. పైన సాలహారాలను ఇటుకలతో నిర్మించారు. తోగుట స్వామీజీ శ్రీమాధవానంద సూచనల మేరకు ఆలయ నిర్మాణం జరుగుతోంది. శివాలయంతో పాటు త్రితల రాజగోపురం, ముఖ మండపం, పార్వతీదేవి మందిరానికి కృష్ణశిల ఉపయోగించారు. ఇదే ఆవరణలో పరివార దేవాలయాలైన గణపతి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, యాగశాలలు నిర్మిస్తున్నారు. సాలహారాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శైవ సంబంధ విగ్రహాలను అమర్చాలని స్థపతులు నిర్ణయించారు.
చురుగ్గా ప్రెసిడెన్షియల్ సూట్‌ల నిర్మాణాలు
ప్రధానాలయానికి ఉత్తరాన 13 ఎకరాల గుట్టపై రూ.104 కోట్ల వ్యయంతో ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణం జరుగుతోంది. స్వామి దర్శనం కోసం వచ్చే రాష్ట్రపతి, ప్రధాన మంత్రి లాంటి ముఖ్యులు ఇక్కడ బస చేస్తారు. ఇతర వీఐపీల బసకు 14 విల్లాలు నిర్మిస్తున్నారు.
8.. 800.. 800..
* కృష్ణ శిలలను గుంటూరు జిల్లాలోని కమ్మవారిపాలెం నుంచి తెచ్చారు. వీటి మన్నిక వేయి సంవత్సరాలు. సుమారు 2.5 లక్షల టన్నుల రాయిని వినియోగిస్తున్నారు.
* శిల్పులు తమిళనాడులోని మదురై, తిరుచ్చి, కారక్కుడి, తిరునల్‌వేళి, పుదుకొట్టై, మాథూర్, సంగ్రణ్‌కోవిల్, ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం, ఆళ్లగడ్డ, తిరుపతి, తెలంగాణలోని మహబూబ్‌నగర్, కర్ణాటక మైసూర్ పరిసర ప్రాంతాల వారు.
* ముడి రాయిని శిల్పంగా మలిచేవారికి వాస్తు, శిల్ప, ఆలయ శాస్త్రాలపైన పట్టు ఉండాల్సిందే.
* ప్రధానాలయానికి పడమటి దిశలో పెద్దగుట్టపై 850 ఎకరాల్లో ఆలయ నగరి నిర్మిస్తున్నారు. 250 ఎకరాల్లో లే అవుట్ సిద్ధమైంది. విశాల రహదారులను నిర్మించడంతోపాటు 30 ఎకరాల్లో పచ్చదనం పెంచారు.
* సంఖ్యా శాస్త్రం ప్రకారం పనులు జరుగుతున్నాయి. దేవదేవుడికి ఇష్టమైన ఎనిమిది సంఖ్యతో ఎనిమిది మంది గుత్తేదారులు, 800 మంది శిల్పులు, 800 మంది కూలీలు పనిచేస్తున్నారు.
* శిల్ప, వాస్తు శాస్త్రం ఆధారంగానే ఏ శిల్పాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో నిర్ణయిస్తారు. ఆ నియమం ఆధారంగానే శిల్పాన్ని చెక్కాలి. తొందరగా కానీ, ఆలస్యంగా కానీ చెక్కితే శిల్పానికి ఆ జీవకళ రాదని వారి నమ్మకం.
* సాంకేతిక నైపుణ్యం అందుబాటులోకి రావడంతో శిల్పాలను చెక్కే పనిలో యంత్రాలను ఉపయోగిస్తున్నారు. 90 శాతం పనులు పూర్తి క్షేత్రాభివృద్ధి పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం అన్ని విభాగాల్లో తుది దశలో ఉన్నాయి. ఆలయం ఎప్పుడు ప్రారంభిస్తారనేది సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి నిర్ణయిస్తారు.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/top-stories/gallery/yadadri-yadagiri-gutta-temple-reconstruction-90-percent-complete/