(పల్లె రవి, మేకల కృష్ణ)
నీళ్ళు ,నిధులు, నియామకాల కోసం, వివక్ష, నిర్భందాలు లేని సామాజిక తెలంగాణకోసం కలలు కన్న తెలంగాణ ప్రజలు ప్రాణాలకు లెక్కచేయకుండా పోరాటాలు చేశారు.
లాఠీలు, తూటాల దెబ్బలను లెక్కచేయలేదు. ఎందరో వీరులు అమరులయ్యారు. మరెందరో పోరాటాల్లో తీవ్రంగా గాయపడి జీవశ్చవాలుగా బతుకులీడుస్తున్నారు.
ఇంకెందరో చదువులకు దూరమై, ఉపాధిలేక, ఉద్యోగాలు రాక భవిష్యత్ ను కోల్పోయారు. తొలిదశ పోరాటంలో 369 మంది అమరులయ్యారు. మలిదశ పోరాటంలో మరో 1200 మంది అసువులు బాశారు.
తెలంగాణ ఉద్యమానికి అడ్డంకులను కల్పించే వ్యతిరేక శక్తులకు ఎందరో అమరులు తమ బలిదానాలతో సవాలు విసిరారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను గడ్డిపోచలా భావించారు. ఎందరో త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన రాష్ట్రం తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పాలన సాగుతున్నది.
నీళ్ళు రాలేదు. నిధులు పక్కదారి పట్టాయి. నియామకాలు లేక నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో బరిగీసీ పోరాడి, ఉద్యమానికి వెన్నుదన్నుగా చారిత్రక భూమికను పోషించిన జర్నలిస్టులు తెలంగాణ ఆకాంక్షల సాధనకు, ఉద్యమకారుల సంక్షేమం కోసం నడుంబిగించింది.
ఉద్యమ ఆకాంక్షల నెరవేర్చేందుకు మరోపోరాటానికి తెలంగాణ సమాజాన్ని సమాయత్తపరిచేందుకు నేడు ఈ కార్యాచరణను చేపట్టాల్సి వచ్చింది. ఈ చారిత్రక ఘట్టంలో రాజకీయ పార్టీలు, ఉద్యమ సంస్థలు, ప్రజా సంఘాలను బాగస్వామ్యం చేస్తూ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది.
తీర్మానాలు
1.ఉద్యమకారులపై అన్ని రకాల కేసులను భేషరుతుగా ఎత్తి వేయాలి.
2. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాలి. అందుకోసం అన్నివర్గాల ప్రజలు,మేధావులకు భాగస్వామ్యం కల్పిస్తూ తెలంగాణసలహామండలి (తెలంగాణ అడ్వైజరీ కౌన్సిల్-టిఏసి) ని ఏర్పాటు చేయాలి.
3. ఉద్యమకారుల సంక్షేమం కోసం ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
4. ఉద్యమకారులకు అధికారికంగా గుర్తింపు పత్రం ఇవ్వాలి.
5. ప్రతి ఉద్యమకారుడు లేదా ఉద్యమకారిణి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన విధంగానే హెల్త్ కార్డులు ఇవ్వాలి.
6. ఒక్కో ఉద్యమకారునికి కుటుంబానికి 300 చ,గ విస్తీర్ణం ఇంటి స్థలం ఇవ్వాలి.
7. ఉద్యమకారుల స్వయం ఉపాధికోసం ఒక్కోరికి రూ. 10 లక్షలు ఆర్థిక సాయం అందించాలి. లేదా అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
8.ఉద్యమ కాలంలో ఆత్మార్పణ చేసుకున్న1200 కుటుంబాలకు సాంకేతిక, పరిపాలన పరమైన కారణాలు చూపకుండా ఈ సాయం అందించాలి.
9. వయసు మీదపడి 55 ఏళ్లు దాటిన ప్రతి ఉద్యమకారుడు లేదా ఉద్యమకారిణికి రూ.25 వేలు పెన్షన్ సదుపాయం అందించాలి.
(పల్లె రవి, అధ్యక్షుడు;మేకల కృష్ణ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం TJF)
(ఇది తెలంగాణ జర్నలిస్టుఫోరం విడుదల చేసిన ప్రకటన యథాతధం)