రవి తేజ
శంఖుస్థాపన శిలాఫలకాల వజ్రోత్సవాలు
అంతలక్కలా
సాగునీటి ప్రాజెక్టులు అంటే
పొలాలకు ‘సాగు’నీరు అందించే ప్రాజెక్టులు
రాయలసీమలో
సాగునీటి ప్రాజెక్టులు అంటే
తరాల తరబడి అతీగతీ లేకుండా ‘సాగు’తూ ఉండేవి
అంతలక్కలా
అదిగో ప్రాజెక్టు అంటే
ఇదిగో పంటకాల్వ అంటారు
సీమలో మాత్రం
అదిగో ప్రాజెక్టు అంటే
ఇదిగో ‘దావా’ అంటున్నారు
అంతలక్కలా
ప్రాజెక్టుల ‘ప్రారంభోత్సవానికి’ ‘రజతోత్సవాలు’ జరుగుతాయి
సీమలో
పూర్తికాని ప్రాజెక్టుల ‘శంఖుస్థాపనల శిలాఫలకాలకు’
‘వజ్రోత్సవాలు’ జరుగుతాయి
అంతలక్కలా
అడగకుండానే ముక్కారు పంటకు నీరు పారుతుంది
సీమలో
అరిచిగీపెట్టినా చుక్క నీరు రాదు, ఎకరం భూమి తడవదు
********
గుండెచెదరని ధీరులు (2)
శ్రీశైలానికి రాళ్ళెత్తినవారెవ్వరు
సోమశిలకు భూమిచ్చినవారెవ్వరు
తెలుగుగంగకు తావిచ్చినవారెవ్వరు
ఎవరన్నా, సీమ రైతులు కాక ఇంకెవ్వరు
చూడని కరువు లేదు
చేయని త్యాగము లేదు
పడని కష్టము లేదు
అయినా గుండెచెదరని ధీరులెవ్వరు?
సేద్యపు పశువులను
సొంత పిల్లల వోలె
నట్టింట గాటిపట్టన
పెట్టేదెవ్వరు?
సొంత కుండ నిండుకున్నా
మంది కడుపు నింపేదెవరు ?
పిడికెడు అన్నమైనా, ఉన్నది
పలువురికి పంచిపెట్టేదెవరు ?
నాకే కావాలన్న
ఆశ లేదు
ఏమీ ఇవ్వకున్నా
నిరాశ లేదు
శ్రమను నమ్ముకున్న
సుశిక్షిత సైనికులు వీరు
రేగడి సేలల్ల రతనాలు పండించు
రాయలసీమ రైతులు వీరు
********