శ్రీ రంజిత్ మూవీస్ … ఈ బ్యానర్ పేరు వినగానే ‘అలా మొదలైంది’, ‘అంతకుముందు…ఆ తరువాత’, ‘కళ్యాణ వైభోగమే’ వంటి విజయవంతమైన చిత్రాల పేర్లు గుర్తుకు వస్తాయి. అలాగే ఈ చిత్రాల పేర్లు గుర్తుకు వచ్చినా ఉత్తమ కధా చిత్రాల నిర్మాణ సంస్థ ‘శ్రీ రంజిత్ మూవీస్’ పేరు స్ఫురణకు వస్తుంది ఇటు చిత్ర పరిశ్రమలోనూ, అటు ప్రేక్షక వర్గాలలోనూ….
శ్రీ రంజిత్ మూవీస్ సంస్థ అధినేత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ…’నాని కథానాయుడిగా నందినిరెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ నిర్మించిన ‘అలా మొదలైంది, సుమంత్ అశ్విన్ కథానాయకునిగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకునిగా నిర్మించిన ‘అంతకు ముందు…ఆ తరువాత’, మరోసారి నందిని రెడ్డి దర్శకురాలిగా నాగ శౌర్య కధా నాయకునిగా నిర్మించిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రాల విజయాల వెనుక వాటి వైవిధ్యమైన కధా బలం తో పాటు చిత్ర తారాగణం, సాకేంతిక నిపుణుల ప్రతిభ ఎంతో ఉంది. వీటితో పాటు ఆ చిత్రాల పబ్లిసిటీ, ప్రింట్ మరియు, ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారం ఎప్పటికీ మరిచిపోలేనిది ఈ సందర్భంగా వారికి మరోసారి కృతఙ్ఞతలు అన్నారు.
ఆయనే మాట్లాడుతూ..’ కొంత విరామం తరువాత మళ్ళీ వరుసగా చిత్రాలను నిర్మించబోతున్నాను. ఇప్పటికే నాలుగు కధలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయటం జరిగింది. వీటిలో ఒక చిత్రాన్ని, వాటి వివరాలను కొంతవరకు ఈరోజు అధికారికంగా ప్రకటిస్తున్నాను. జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా యువ జంటగా కార్తీక్, తమిళ నాయిక అమ్ము అభిరామి(తమిళ చిత్రం ‘అసురన్‘ ఫేమ్) నటిస్తున్నారు. బాల నటి సహశ్రిత మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. విద్యాసాగర్ రాజు చెప్పిన కథలోని నవ్యత ఎంతగానో నచ్చింది. తమ సంస్థ నిర్మిస్తున్న పథ్నాలుగవ చిత్రమిది అని తెలిపారు నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్. ఇక ఈ చిత్రం పేరు ‘ ఫాదర్- చిట్టి – ఉమ – కార్తీక్’. చిత్ర కథానుసారమే పేరును నిర్ణయించాం. చిత్రం లోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ ప్రచార చిత్రాలను విడుదల చేయనున్నాము అని తెలిపారు.
‘చిత్ర నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. కోవిడ్ సమయంలో ధియేటర్ లు తెరుచుకోని పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే ఈ రంగం కోలుకునే దిశగా ప్రయాణం మొదలవుతోంది. మంచి చిత్రాలను కుటుంబ సమేతంగా ధియేటర్ లో చూసి ఆదరించే ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈ చిత్రం రూపొందింది. ధియేటర్ లలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. జనవరి 2021 లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు శ్రీ రంజిత్ మూవీస్ సంస్థ అధినేత కె.ఎల్. దామోదర్ ప్రసాద్.
దర్శకుడు విద్యాసాగర్ రాజు మాట్లాడుతూ…‘ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‘ గా ఈ చిత్రానికి రూపకల్పన చేయటం జరిగింది. ఈ చిత్రం పేరు ను బట్టి ఇది మరింతగా ప్రస్ఫుటమవుతుంది అన్నారు. ‘ఫాదర్- చిట్టి – ఉమ – కార్తీక్’ అనే పాత్రల మధ్య జరిగే ఈ చిత్ర కథలో భావోద్వేగాలు, వినోదం సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి అని తెలిపారు దర్శకుడు.
చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు: కరుణాకర్, ఆదిత్య; ఛాయాగ్రహణం: శివ.జి; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; పాటలు: కరుణాకర్, ఆదిత్య, భీమ్స్; ఎడిటింగ్: కిషోర్ మద్దాలి; ఆర్ట్: మూర్తి
కథ-స్క్రీన్ ప్లే- కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్.