‘పీపుల్స్ కింగ్’గా కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ ఎం.జి. రామచంద్రన్ వర్ధంతిను పురస్కరించుకొని ‘తలైవి’ చిత్ర బృందం ఎంజీఆర్‌గా నటిస్తోన్న అరవింద్ స్వామి న్యూ లుక్‌ను గురువారం ఉదయం విడుదల చేసింది.ఇదివరకు ఎంజీఆర్ 103వ జయంతి సందర్భంగా ‘తలైవి’లో ఆయన పాత్రను పోషిస్తోన్న అరవింద్ స్వామి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన విషయం విదితమే. యాక్టర్‌గా ఆయన యంగ్ లుక్కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది.ఇప్పుడు ఎంజీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని పొలిటికల్ కెరీర్లో రాజకీయవేత్తగా శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న సందర్భానికి సంబంధించిన న్యూ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ లుక్‌లో ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి ఆకట్టుకుంటున్నారు.ఎంజీఆర్ సహకారంతో జె. జయలలిత నటిగా, రాజకీయ నాయకురాలిగా ఎలా ఎదిగారనే ఇతివృత్తంతో దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ‘తలైవి’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టైటిల్ రోల్‌ను కంగనా రనౌత్ పోషిస్తున్నారు.‘రోజా’, ‘బాంబే’ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ తర్వాత ‘తలైవి’తో బాలీవుడ్‌కు మళ్లీ వస్తున్నారు అరవింద్ స్వామి. ఎంజీఆర్‌గా ఆయన ఫస్ట్ లుక్కు వచ్చిన అనూహ్యమైన రెస్పాన్స్ తర్వాత ఇప్పుడొస్తున్న సెకండ్ లుక్ ప్రేక్షకుల్లో మరింత ఆదరణ పొందుతుందనీ, ‘తలైవి’పై అంచనాలను మరింతగా పెంచుతుందనీ ఆశిస్తున్నారు.
ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి లుక్ గురించి క్రియేటివ్ ప్రొడ్యూసర్ బృందా ప్రసాద్ మాట్లాడుతూ, “తమిళనాడు ప్రజల్లో అత్యంత ఆదరాన్నీ, గౌరవాన్నీ పొందిన గొప్ప వ్యక్తుల్లో ఎంజీఆర్ ఒకరు. అలాంటి మహనీయుని వ్యక్తిత్వాన్ని తెరమీద తీసుకురావడంలో ఎంతో జాగరూకతతో వ్యవహరిస్తున్నాం. కేవలం లుక్ విషయంలోనే కాకుండా ఆ లెజండరీ హీరో గుణగణాల్ని ప్రతిబింబించేలా కనిపించే అరవింద్ స్వామి ఆ పాత్రకు సరిగ్గా సరిపోయారు” అని తెలిపారు.
ప్రొడ్యూసర్ శైలేష్ ఆర్. సింగ్ మాట్లాడుతూ, “ఈ సినిమాకు సంబంధించి ఇదివరకు రిలీజ్ చేసిన జయలలిత పాత్రధారి కంగనా రనౌత్ లుక్కు కానీ, ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి ఫస్ట్ లుక్కు కానీ వచ్చిన అపూర్వమైన స్పందన మాలో అమితమైన ఉత్సాహాన్ని నింపింది. అంచనాలను మరింత పెంచేలా రాజకీయవేత్తగా ఎంజీఆర్ శిఖరాగ్ర స్థాయిలో ఉన్నప్పటి అరవింద్ స్వామి లుక్‌ను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. మా సినిమాపై ప్రేక్షకుల ప్రేమాభిమానాలు కొనసాగుతాయనీ, సౌత్ ఇండియన్ సినిమా, పాలిటిక్స్‌లో తమదైన ముద్ర వేసిన లెజెండ్స్‌కు మేం అర్పిస్తున్న నివాళిని స్వీకరిస్తారనీ ఆశిస్తున్నాం” అన్నారు.
విబ్రి మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘తలైవి’ చిత్రానికి హితేష్ ఠక్కర్, తిరుమల్ రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎ.ఎల్. విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు.