నెల తిరగలేదు, అపుడే అరెస్టులా?

-ఇఫ్టూ ప్రసాద్ (పి.పి)
భిన్న రాజకీయ అభిప్రాయాల్ని కలిగి ఉన్న కారణంగానే ఉపా (Unlawful Activities (Prevention) Act 2020 చట్టం క్రింద నెల రోజులు తిరక్క ముందే ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఇది నేడు మొత్తం ప్రజాతంత్ర రాజకీయ సమాజాన్ని తీవ్రంగా కలవర పరుస్తోంది.
ఈ ఎనిమిది మందిలో, నిన్న 23-12-2020 తేదీన హైదరాబాద్ లో అరెస్టైన ప్రజా కళా మండలి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కోటి కాకుండా మిగిలిన ఏడుగురు కూడా ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వారే. వీరిలో నలుగురు మహిళలే. వీరందరూ ఆయా ప్రజా సంఘాలలో బహిరంగ కార్యకలాపాలు సాగిస్తున్న వారే.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కొండారెడ్డి (గుంటూరు జిల్లా); ఆంజనేయులు (చిత్తూరు జిల్లా); అన్నపూర్ణ (విశాఖ జిల్లా) ప్రగతిశీల కార్మిక సమాఖ్య (PKS) లో పని చేస్తున్నారు. రాజేశ్వరి (గుంటూరు జిల్లా) చైతన్య మహిళా సంఘం (CMS) లో, అంజమ్మ (గుంటూరు జిల్లా) అమరవీరుల బంధు మిత్రుల సంఘంలో పని చేస్తున్నారు. విజయ్ (అనంతపురం), కోటి (హైదరాబాద్) ప్రజా కళా మండలిలో పని చేస్తున్నారు. క్రాంతి (గుంటూరు జిల్లా) న్యాయ విద్యార్థిని. వీరు చేసిన నేరం కేవలం కొన్ని నిర్దిష్ట రాజకీయ అభిప్రాయాల్ని కలిగి ఉండటమే.
ఇది పోలీసు వర్గాలు అమలు జరిపే సాధారణ నిర్బంధకాండ కిందికి రాదు. రాష్ట్ర ప్రభుత్వం విధానపరంగా నమోదు చేసిన కుట్ర కేసుల ఫలితం. నిరాధార ప్రక్రియతో ఉపా క్రింద బనాయించిన అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టు చేస్తున్నది. ఇది స్థూలంగా ఫాసిస్టు వ్యతిరేక ప్రజాతంత్ర రాజకీయ సమాజాన్ని భయోత్పాతానికి గురిచేసే లక్ష్యంతో చేస్తోంది. నేడు కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు తరహా పాలన ఫలితమిది.
ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ సమాజం మధ్య విభజించి పాలించే ఎత్తుగడలతో ఒకరి తర్వాత ఒకరిని వేటాడే విధానంలో భాగమిది. ఇవి కాకతాళీయ అరెస్టులు కాదు. ఇప్పుడు ఒకరి వంతు. రేపు మరొకరి వంతు. ఎల్లుండి వేరొకరి వంతు. ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తుల్ని ఒక్కొక్క దశలో ఒక్కొక్క రాజకీయ సమూహాన్ని ఒంటరిగా విడగొట్టి చేపట్టే వ్యూహాత్మక నిర్బంధకాండలో అంతర్భాగమిది.
రాష్ట్రాల అధికారాల్లోకి కేంద్రం జోక్యం చేసుకోవడం ఇటీవల పెరిగింది. కోరేగామ్ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వ స్థానాన్ని కేంద్రం ఓవర్ టేక్ చేయడం తెల్సిందే. ఇప్పుడు కూడా కేంద్రం కనుసన్నల్లోనే AP రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కుట్ర కేసుల్ని బనాయిస్తోందని భౌతిక స్థితిగతుల్ని బట్టి అర్ధం అవుతుంది. అందులో భాగంగా మన రాష్ట్రంలో ఉపా చట్టం అమలు జరుగుతోందని కూడా బోధపడుతోంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్రం వత్తిడి తెచ్చి ఉపా చట్టం క్రింద ఏరికోరి అరెస్టులను చేయించే నిర్దిష్ట రాజకీయ పరిస్థితులు నేడు దేశంలో నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో కూడా తాజా కుట్ర కేసుల్ని పరిశీలించాల్సి ఉంది.
ఒక నిర్దిష్ట రాజకీయ భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారి అరెస్టులుగా వీటిని చూడటం సరైనది కాదు. ఇవేవో ఓ రాజకీయ విభాగానికి మాత్రమే చెందిన అరెస్టులుగా భావించడం సరికాదు. లౌకిక, ప్రజాతంత్ర ప్రగతిశీల, వామపక్ష రాజకీయ సమాజం మౌనం వహించే సందర్భం కాదిది. ఇది కేవలం ఖండనలకు మాత్రమే పరిమితమయ్యే వ్యవహారం కూడా కాదు. దీన్ని సామాజిక, రాజకీయ సమస్యగా మార్చి, ఉద్యమ రూపం ధరించాల్సి ఉంది. లేని పక్షంలో మున్ముందు ఒకరి తర్వాత మరొకరికి వ్యాపించి, మొత్తం ఫాసిస్టు వ్యతిరేక ప్రజాతంత్ర రాజకీయ వర్గాలు అన్నింటినీ భయోత్పాతానికి గురిచేసే పరిస్థితి వస్తుంది.
“నాజీలు తొలుత యూదుల కోసం వచ్చారు. …. తర్వాత….. తుదకు…. నాకోసం… కానీ నాకు అండగా ఎవరూ మిగల లేదు” అనే నాజీ జర్మన్ నాటి ఓ సుప్రసిద్ధ కవిత తెల్సిందే. అట్టి పరిస్థితిని నివారించాలంటే, నేడు ప్రజా సమస్యల పై పని చేసే పార్టీలు, సంస్థలన్నీ స్పందించాలి. మరీ ముఖ్యంగా ఫాసిస్టు వ్యతిరేక శక్తులన్నీ తమతమ పూర్వ రాజకీయ విబేధాల్ని పక్కకు పెట్టాల్సిన సమయమిది. ఉపా చట్టం కింద అరెస్టుల పై సమైక్య ఉద్యమాన్ని నిర్మించడం కూడా తక్షణ కర్తవ్యంగా చేపట్టాల్సిన సందర్భమిది. “ఈ నిర్బంధం మా మీద కాదు కదా” అని గానీ; అరెస్టు కాబడ్డ వారి రాజకీయ అభిప్రాయాలతో మాకు ఏకీభావం లేదు కదా” అని గానీ నిర్లిప్త ధోరణికి తావు ఇవ్వరాదు. ఇకనైనా పైన పేర్కొన్న శక్తులన్నీ క్రియాశీల స్పందనను కనబరచవల్సి ఉంది. అట్టి విశాల ప్రజాతంత్ర భావనతో రాష్ట్రంలోని అన్ని ప్రజాతంత్ర, ప్రగతిశీల, లోకిక, వామపక్ష, విప్లవ సంస్థలు, శక్తులు విశాల ఐక్య స్పూర్తితో ముందుకు వస్తాయని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *