-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
ఢిల్లీ ముట్టడికి దిగిన రైతాంగ ఉద్యమకారులను దూరంగా ఉండి చూసే మనవంటి వారిలో ఏర్పడే అభిప్రాయాలు వేరు. ఆందోళన జరుగుతున్న చోటకు వెళ్లి స్వయంగా వారిని చూసి, వారి మనస్సులతో ఏదో మేరకు లీనమైన తర్వాత మనకు కలిగే అభిప్రాయాలు వేరు.
ఇపుడు మేము చెప్పేది ఉద్యమకారుల దృష్టి కోణం నుండి మాత్రమే. అంటే, నేడు ఢిల్లీ ముట్టడి చేస్తోన్న ఉద్యమకారుల పట్ల దేశంలోని వివిధ రకాల, రూపాల ఉద్యమ శక్తుల సాధారణ అభిప్రాయాల గూర్చి ఇక్కడ చెబుతోంది. అందుకు ఉదహరించదగ్గ కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిలోకి వెళ్లే ముందు తాజా హైవేల దిగ్బంధనం పట్ల ప్రభుత్వ అంచనాల వైఫల్యం గూర్చి ఉదహరించాల్సి ఉంది.
తొలుత నవంబర్ 26, 27 తేదీల్లో “చలో ఢిల్లీ” కి అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ (AIKSCC) పిలుపు ఇచ్చింది. ఒకవేళ మోడీ-షా ప్రభుత్వం దానికి అనుమతి ఇచ్చి ఉంటే, అది నిజానికి ఆ రెండు రోజుల పోరాట కార్యక్రమంతో ముగిసి ఉండేదేమో! తమ రైతాంగ డిమాండ్ల సాధన కోసం పైన పేర్కొన్న 26, 27 ల తర్వాత AIKSCC మరో దశలవారీ ఆందోళనలకు కొత్త పోరాట పిలుపుల్ని ఇవ్వాల్సి వచ్చి ఉండేదేమో! అలాంటి కొత్త పిలుపుల్ని వెదుక్కునే పని AIKSCC కి రానివ్వకుండా మోడీ-షా ప్రభుత్వం ఒక రాజకీయ సువర్ణావకాశాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. తాజా ఢిల్లీ ముట్టడి చేస్తోన్న రైతాంగ ఉద్యమకారుల పోరాట పటిమని ప్రభుత్వం అంచనా వేయడంలో చిత్తు అయ్యుంది.
మోడీ-షా ప్రభుత్వంతో పాటు దానికి దన్నుగా ఉన్న బడా కార్పొరేట్ సంస్థలు రైతాంగ పోరాట పటిమను చాలా తక్కువగా అంచనా వేసాయి. ఢిల్లీలోకి అడుగు పెట్టకుండా నిరోధిస్తే, చేసేదేమీ లేక నిరాశ, నిస్పృహలతో వచ్చిన దారిన రైతాంగం వెనక్కి వెళ్లి పోతుందని అవి అంచనా వేసి ఉంటాయి. మోడీ-షా ప్రభుత్వంతో పాటు దాన్ని కంటికి రెప్పలా భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యతల్లో ఉన్న నిర్ణీత బడా కార్పొరేట్ సంస్థల అంచనా కూడా చిత్తు అయ్యుంది. రైతాంగ పోరాట సంకల్పాన్ని సరిగ్గా అంచనా వేయడంలో ఘోరంగా విఫలం చెందాయి. తాము రైతులకు రెండు రోజుల పాటు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఓ ధర్నా, రామలీలా మైదానంలో ఓ బహిరంగ సభ జరుపుకునే అనుమతి ఇచ్చి ఉంటే, ఇంత వరకు వచ్చేది కాదేమో అని అవి నేడు అంతర్మధనం చెందే పరిస్థితి ఏర్పడింది. (ఇది నేడు మోడీ ప్రభుత్వం, దానికి దన్ను గా నిలిచే కార్పొరేట్ సంస్థలు ఇలాగే అంతర్మధనం చెందేదీ లేనిదీ తెలిసి చెప్పే మాట కాదు, అట్టి భావన కలిగించే విధంగా తాజా ముట్టడి సాగుతోందని చెప్పేందుకు ఉదహరించేది)
ఒకవేళ 26, 27 లలో “ఛలో ఢిల్లీ”కి అనుమతి ఇవ్వకపోతే రైతాంగం వెనక్కి వెళ్లకుండా అక్కడే బైఠాయిస్తే…? ఈ ప్రశ్న ప్రభుత్వ వర్గాలలో 26, 27కి ముందు రాకుండా ఉంటుందా? ఈ ప్రశ్న ఒకవేళ ప్రభుత్వవర్గాల మనస్సులకు అసలు తట్టదని కాదు. ఐతే గడ్డకట్టే చలికాలం లో ఎన్ని రోజులు వుంటారు? రోడ్లపై గడ్డకట్టే చలిలో రైతులు ఒకట్రెండు రోజుల కంటే ఎక్కువ ఉండలేరనే జవాబు సహజంగా ప్రభుత్వ వర్గాల మనస్సుల్లో వస్తుంది. అదే వచ్చి ఉంటుంది. ఐతే అట్టి ఊహలు, అంచనాలు తారుమారయ్యాయి.
పైన పేర్కొన్నట్లు అంచనాలు తారుమారు కావడమనేది కేవలం ప్రభుత్వ వర్గాలకు మాత్రమే పరిమితం కాదు. అది ఉద్యమ శక్తులు, సంస్థలకు కూడా ఏదో మేరకు, ఎంతో కొంత వర్తిస్తుంది. అది మా బృందం సభ్యుల ముందస్తు అంచనాల వైఫల్యంతోనే ప్రారంభించడం నిజానికి సందర్భోచితంగా ఉంటుంది.
మా బృందం ఢిల్లీ ముట్టడిని 21వ రోజు మాత్రమే క్షేత్రస్థాయి లో సందర్శించింది. అప్పటికే ముట్టడికి మూడు వారాలు గడిచింది. ఆ మూడు వారాలు కూడా ఈ చలికాలంలో హైవేల మీద ముట్టడి నడుస్తుందనే అంచనా మాకు మొదటి రోజుకి లేదు. 26, 27 తేదీల్లో ఢిల్లీలోకి అనుమతి నిరాకరణ తర్వాత రైతు ఉద్యమకారుల మాటల్ని ఒకసారి గుర్తుకు తెస్తున్నాం.
“మాకు ఢిల్లీలోకి అనుమతి ఇవ్వక పోతే, నెల రోజులు ఇక్కడే హైవే మీద ఉంటాం” అని రైతు ఉద్యమకారుల హెచ్చరిక పలుకులు నాడు సోషల్ మీడియాలో అందరం విన్నాము. ఆనాడు జనరల్ ప్రజాతంత్ర, ప్రగతిశీల ఉద్యమ శక్తుల మనస్సుల్లో కలిగిన అభిప్రాయాల్ని కింద మననం చేసుకుందాం.
“రైతులు ధర్మాగ్రహంతో అలా అంటే అనొచ్చు, కానీ ఆచరణ లో నెల రోజులు గడ్డకట్టే చలిలో వాళ్ళు ఎలా ఉండగలరు?”
“ఒకవేళ ఉంటే, గింటే పంటి బిగువుతో రెండు లేదా మూడు రోజులు వుంటారేమో! అంత కంటే ఎక్కువ రోజుల పాటు ఉండటానికి ఎలా సాధ్యం?”
“అసలు రెండుకోట్ల జనాభా గల దేశ రాజధానిని ఏకంగా స్తంభింపజేసి, దేశ ఆర్థిక వ్యవస్థకు నాడీ మండలం వంటి రవాణా వ్యవస్థను స్తంభింప జేస్తే, ఈ కార్పొరేట్ ప్రభుత్వం గుడ్డిగా చూస్తూ మౌనంగా ఊరుకుంటుందా?”
“ఒకవేళ నిజంగానే మోడీ ప్రభుత్వం వ్యూహాత్మక మౌనం పాటించిందని ఊహ కోసం అనుకుంటే ముట్టడికారుల్లో నిరాశ కలిగి రోజురోజుకు ఇంటికి వెళ్లిపోయే వారి సంఖ్య పెరిగిపోకుండా ఉంటుందా?”
పైన పేర్కొన్న రకరకాల ధర్మ సందేహాలు దేశవ్యాప్తంగా గల ఉద్యమ శక్తులలొ కూడా వచ్చి ఉంటాయి. ఇలా అనంత కోటి అనుమానాలకూ, శతకోటి సందేహాలకూ రైతాంగ ఉద్యమ కారులు సమాధానం చెప్పారు. ఉద్యమ సంస్థలు, శక్తులకు కూడా కొత్త రాజకీయ పాఠాల్ని బోధించడం విశేషం.
ఇది మన ప్రగతిశీల, ప్రజాతంత్ర మిత్రలోకంలో ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే మన్నించండి. ఢిల్లీ రైతాంగ ఉద్యమకారులు తాము నెల రోజులకు సరిపడ ఆహార సామాగ్రితో ఢిల్లీ వచ్చామని గత నెల 26, 27 లలో సోషల్ మీడియా ద్వారా పలికిన పలుకుల్ని తాము ఆనాడు సందేహించలేదని ఉద్యమ శక్తులలోని ఎవరైనా అనవచ్చు. రైతు ఉద్యమ శక్తుల పోరాట పటిమను తాము సరిగ్గానే అంచనా వేశామని నేడు స్వాతిశయంతో వారు అనవచ్చు. మనలో ఎవ్వరం కూడా స్వాతిశయంతో మాట్లాడ నక్కరలేదు. ఇది రైతాంగం పట్ల చిన్నచూపుతో చెప్పేది కాదు. వారి ఆత్మ విశ్వాసం పట్ల తేలిక భావంతో చెబుతున్నది కాదు. భౌతిక వాస్ట్స్వా స్థితి ఆధారంగా చెప్పే మాట మాత్రమే.
ఇప్పటి వరకు మన దేశంలో ఈ తరహాలో నిరవధిక హైవేల ముట్టడి జరగలేదు. ఏకంగా దేశరాజధాని దిగ్బంధనానికి దిగే సమరశీల పోరాటాల్ని మనం చూడలేదు. పైగా నేడు మోడీ-షా ప్రభుత్వ నిరంకుశ విధానం పట్ల ప్రగతిశీల, ప్రజాతంత్ర శక్తుల సాధారణ వైఖరిని కూడా దృష్టిలోకి తీసుకోక తప్పదు. ఈ వెలుగు లో మేము చెబుతోన్న మాటగా మిత్రుల మనస్సులో ఉండాలని కోరుతున్నాం. ఐనా మా బృందం సభ్యుల ముందస్తు అంచనాల వైఫల్యం గూర్చి బేషజానికి తావు లేకుండా మేమైతే చెప్పదలుచుకున్నాం.
వర్తమాన భారత దేశంలో, ముఖ్యంగా ఫాసిస్టు తరహాలో మోడీ-షా ప్రభుత్వ పాలన సాగే రోజుల్లో లక్షలసంఖ్యలో రైతాంగ బలగాలు హైవేల మీద నిలిచి నిరవధిక బైఠాయింపు సాగించే పరిస్థితిని ఊహకు అందనిదే. ఈ భౌతిక స్థితి మా బృందం సభ్యులు తరతమ స్థాయిల్లో ముందస్తు అంచనా వేయలేక పోయిందే. ఢిల్లీ వెళ్లిన మా బృందం సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల్ని కూడా ఆశ్చర్యం కలిగించింది. అది ఉత్తేజం కలిగించి, మమ్మల్ని ఢిల్లీకి నడిపించడానికి ఒక ముఖ్య కారణమైనది. మా బృందం సభ్యులు ఢిల్లీ వెళ్లడం లో సంఘీభావం ప్రకటించే రాజకీయ లక్ష్యంతో పాటు అదనంగా రైతాంగ ఉద్యమ శక్తుల మనోగతం తెలుసుకునే ప్రత్యేక శ్రద్దాసక్తులు కూడా ఉన్నాయి. కేవలం ఉద్యమ శక్తుల్ని చూసేందుకు కాకుండా, వారి మనో అంతరంగాన్ని అర్ధం చేసుకుని, దాన్ని ప్రజాతంత్ర, ప్రగతిశీల లోకం ఎదుట ఆవిష్కరణ చేయాలనే ఉద్దేశ్యం ఉంది. అది కూడా మేము ఢిల్లీ వెళ్లడంలో ఒక ప్రధాన అంశం. అందులో మేము కొంత వరకు కృతకృత్యం అయ్యాము.
తమ ఇళ్లు వదిలి ఎక్కువ రోజులు ఉండలేని రైతాంగం ఎందుకు ముట్టడిలో ఇన్నాళ్లూ ఉంది? గడ్డకట్టే చలిలో ఎలా నిలబడింది? వారిని నడిపించే కారణాలు, కారకాలు ఏమిటి? మా పరిశీలనలో పరిపూర్ణత్వం లేకపోవచ్చు. అనేక కొరతలు ఉండొచ్చు. ఐనా సేకరించిన ప్రాధమిక సమాచారం ఆధారంగా వారి అంతరంగం నుండి మా బృందం గ్రహించిన విషయాల్ని రేపటి భాగంలో తెలియజేస్తాము.
(ఇప్టు ప్రసాద్ ఈ మధ్య కొద్ది రోజులు ఢిల్లీ సమీపాన ఆందోళన చేస్తున్న రైతులతో గడిపి వచ్చారు.)