(బి వెంకటేశ్వర మూర్తి)
నా మాదిరి అరవయ్యోపడిలో ఉన్న వాళ్లందరూ టెంట్ లనుంచి మల్టీప్లెక్స్ ల దాకా సినిమా హాళ్ల పరిణామ క్రమాన్ని తప్పనిసరిగా గమనించే ఉంటారు. మా తరంలోనూ కొందరు, శ్రీమాన్ విశ్వనాథ సత్యనారాయణ వారు చెప్పినట్టుగా, ఆధునిక (మ్లేచ్ఛ) నాగరికతా పరిభ్రష్ట జీవనులై గబ్బు పట్టిపోయిన మాట నిజమే అయినప్పటికిన్నిన్నీ, ఇప్పటిలాగా పల్లె తల్లితో పూర్తిగా బంధం తెగిపోలేదు కాబట్టిన్నీ, ఇప్పటికీ అప్పుడప్పుడు పుట్టిపెరిగిన, బాల్యస్మృతులతో ముడిపడిన ఊళ్లకు వెళ్లి మట్టివాసన గుండె నిండుగా పీల్చుకునే మహద్భాగ్యాన్ని పూర్తిగా వొదులుకోకుండా అట్టిపెట్టుకున్నాం కాబట్టిన్నిన్నీ, సినిమా టెంటుల తియతియ్యని జ్ఞాపకాలు మదిలో ఇప్పటికీ పచ్చపచ్చగా మిగిలే ఉన్నాయి.
బనగానపల్లె, నంద్యాల, ఆళ్లగడ్డ, మార్కాపురం పట్టణాల్లో 1960 వ దశకంలో నా ఎలిమెంటరీ, హైస్కూలు విద్యాభ్యాసం సాగింది. మా నాయన రామేశ్వర రావు ప్రకాశం జిల్లా కందుకూరు కోర్టులో హెడ్ క్లర్కు (హెడ్ గుమాస్తా)గా రిటైరయినారు.
అంతకు ముందు ఆయన కర్నూలు, బనగాన పల్లె, నంద్యాల, మార్కాపురం మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో పని చేసినారు. ఆయన ఫస్ట్ అపాయింట్ మెంట్ బళ్లారి లోనని పెద్దవాళ్లు మాట్లాడుకుంటుంటే నాకు తెలిసింది.
1950 దశకంలో మద్రాసు నుంచి విడిపోయి విశాలాంధ్రగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు బళ్లారి జిల్లా కర్ణాటకలో భాగమైపోయింది. జన్మతః ఆంధ్రులైన కొందరు ఉద్యోగులను బళ్లారి నుంచి కర్నూలుకు బదలీ చేసినారని చెప్పుకొనేవారు. అది వాళ్ల అభీష్టం మేరకు జరిగిన ఐచ్ఛిక బదిలీనో లేక ప్రభుత్వ సౌలభ్యం మేరకు జరిగిన అనివార్య బదిలీనో నాకు తెలియదు.
సినిమా తాలూకు నా తొట్ట తొలి జ్ఞాపకం లవకుశ. కర్నూలు సాయిబాబా థియేటర్ లో లవకుశ, కృష్ణార్జున యుద్ధం సినిమాలు చూసినాను. కర్నూలులో అప్పటికి రాధాకృష్ణ, సాయిబాబా, చాంద్ థియేటర్లుండేవి. చాంద్ లో ఎక్కువగా హిందీ సినిమాలే ఆడేవట. అప్పటికి నేనింకా రెండు మూడేళ్ల చిన్నపిల్లాడిని.
లవకుశ, కృష్ణార్జున యుద్ధం రెండూ యుద్ధం సీన్లు, ఎక్కువగా పద్యాలున్న సినిమాలే. లవకుశలో ఇద్దరు చిన్నపిల్లాళ్లు ముఖ్యపాత్రలు కావడం వల్లనేమో నేను బాగా కనెక్ట్ అయ్యాను.
లవకుశులు శ్రీరాముడితో, ఆయన తమ్ముళ్లతో యుద్ధం చేయడం, యుద్ధానికి ముందు పద్యాలు పాడుతూ మాటకు మాట సమాధానం చెప్పడం నాకు బాగా నచ్చేది. శివ ధనువు విరిచిన బలశాలి శ్రీరాముడంటే, పుచ్చిన విల్లు విరగ్గొట్టాడని లవకుశులు రాముడి తమ్ముళ్లను ఎగతాళి చేస్తారు.
తాటకి వంటి బ్రహ్మరాక్షసిని చంపాడంటే, ఆడదాన్ని చంపాడు అదేం ధర్మమని నిలదీస్తారు. యుద్ధం సీన్ లో బాణాలు స్క్రీన్ నిండా పరచుకోవడం, వాటి ధాటికి నిప్పులూ నీళ్లూ కురవడం బలే నచ్చేది. ఆ సినిమా గేవా కలర్ లో తీశారు. యుద్ధం సీన్ లో మెరుపులు ఉరుములు వచ్చినప్పడు స్క్రీనంతా ఎర్రగా, పచ్చగా మారిపోయి డిమ్ అండ్ డిప్ కావడం గొప్ప ఉత్సాహాన్నిచ్చేది. ఈ సినిమా సాయిబాబాలో బెంచీ మీద కూర్చుని చూశానా, కుర్చీలోనా అని ఎంత మాత్రం గుర్తు లేదు గానీ పద్యాలూ, పాటలు కొన్ని కంఠతా వచ్చేవి.
తర్వాత బనగానపల్లె వెళ్లాక అక్కడ వెంకటరమణ స్వామి గుళ్లో నేనూ మా అన్న సూర్యప్రకాష్ కలిసి లవకుశ పాటలూ పద్యాలు పాడటం ఇప్పటికీ నాకు గుర్తుంది.
కొండపేటలో అమ్మవారి శాల ఎదురుగా వెంకటరమణ స్వామి గుడి ఉండేది. మా అభిమానులైన అంగడి గురుమూర్తి, మరి కొందరు భక్తుల కోరిక మేరకు, గుడిలో వెనక వైపు అశ్వర్థకట్ట మీద నిలబడి మేమిద్దరం పద్యాలూ పాటలు పాడే వాళ్లం. మా ఇంటి నుంచి రవ్వల కొండ పోయే దారిలో కొంచెం ముందుకు పోతే గురుమూర్తి అంగడి ఉండేది. గురుమూర్తి బలే మంచోడు. ఒక్క పైసాకు పావు నిండా బొరుగులు ఇచ్చేవాడు. అవి నా రెండు నిక్కరు జేబులకు నిండా వచ్చేవి. గురుమూర్తి రెండు పైసలు, ఐదు పైసల నాణాలను నుదుటి మీద అతికించుకుని, అవి పడిపోకుండా పాట పాడుతూ కళ్లు తిప్పుతూ తమాషా చేసేవాడు.
బనగానపల్లె టెంటులో సినిమా చూడటం అప్పట్లో అదో గొప్ప అదృష్టం. నమో వెంకటేశ ….ట్యుంవ్…. ట్యుంవ్… ట్యుంవ్….నమో తిరుమలేశ…. ట్యుంవ్…. ట్యుంవ్… ట్యుంవ్….నమస్తే …..నమస్తే…. నమహ అని ఘంటసాల పాట రికార్డు వేయడంతోనే ఊళ్లో సినిమా హడావుడి మొదలయ్యేది.
దీని తర్వాత ఇంకేవో పాటల రికార్డులు వేసేవాళ్లు గానీ మిగతావేవీ ఇప్పుడు నాకు గుర్తు లేవు. ఏడు కొండల సామీ ఎక్కడున్నావయ్యా అన్న పాటలో భక్తులకు లాగా వెదుక్కుంటూ కొండెక్కినంత ఉత్సాహంగానూ, కష్టంగానూ ఉండేది నడుచుకుంటూ టెంటును చేరుకోవడం. కొండపేటనుంచి ఏటిమీది బ్రిడ్జీ దాటి, ఇంకా ఇంకా చాలా దూరం నడిచి, తారు రోడ్డు దిగి కింద తగ్గులో ఎర్రమన్ను, సున్నం పట్టీల గోడలు గల గుడిని దాటి ఇంకొంచెం ముందుకు పోతే వచ్చేది సినిమా టెంటు.
సినిమాకు పోవాలంటే మా సీతమ్మత్త నీళ్లు నింపిన మరచెంబు, ఓ పాత చాప చుట్ట వెంట తెచ్చుకునేది. సినిమాకు వచ్చే కొంతమంది పెద్దవాళ్లు వక్కాకు డబ్బీ కూడా తెచ్చుకునే వారేమో నాకు పూర్తిగా గుర్తు లేదు.
నమో వెంకటేశ పాట సినిమా ఆరంభానికి బహుశ రెండో బెల్లు అయ్యుంటుంది. ఊరంతా మారుమోగేలా తప్పెట్లు కొట్టడం మొదటి బెల్లు వంటిది. తప్పెట్ల శబ్దం మాంచి ఊపందుకుని క్రమంగా బలహీనమవుతూ చివరకు నిలిచిపోయేసరికల్లా సినిమా కోసం దారిలో ఉన్నవాళ్లంతా నడకలో స్పీడు పెంచుతారు. పెద్దవాళ్లంతా పెద్ద పెద్ద అంగలతో స్పీడు పెంచితే వాళ్ల వెంట నడిచే మా వంటి చిన్నపిల్లలకు దాదాపు పరిగెత్తినంత పనయ్యేది.
పాటలు కూడా నిలిచిపోయే లోపల టికెట్టు తీసుకుని తడిక వాకిలి నుంచి లోపలికి చేరుకునే సరికి స్వర్గానికి కేవలం ఒకించీ దూరంలో ఉన్నామన్న ఫీలింగు. లోపలికి రారమ్మన్నట్టు తడి ఇసుక వాసన కమ్మగా ఆహ్వానించేది. ఆ టెంటులో ఉండేది ఇసుక, మన్ను కలగలిసిన అదో రకం నేల. కూచుంటే మెత్తగా బుజుగు బుజుగ్గా ఉండేది. ప్రతిరోజూ ఆటకు ఓ అరగంట ముందు తెరకు ఓ ఐదారడుగుల దూరం దాకా బహుశ నీళ్లు చల్లే వారనుకుంటా. అందుకే తెరకు చేరువకు వెళ్లే కొద్దీ ఆ తడి వాసన ఘుమ్మని మీద మీదకొచ్చేది. దీంతో పాటు వక్కాకు, బీడీల వాసన్లు కూడా ఉండేవి.
తెరకు ముందు అటు ఇటూ పక్కల్లో రెండడుగుల దూరంలో భద్రంగా పాతిన తడికె గోడలుండేవి. పాత పంచెలతోనో కోరా గుడ్డతోనో అతుకులు తెలీకుండా కుట్టి లాగి పట్టినట్టున్న తెర బార్ లైట్ల కాంతిలో తెల్లగా మెరుస్తుండేది. ఈ తెరమీదే బొమ్మలు పడేవి.
https://trendingtelugunews.com/top-stories/features/anantapur-collector-gandham-chandrudu-trend-setter/
టెంటులో ముక్కాలు భాగం నేల టికెట్టయితే దాని తర్వాత ఓ ఐదారు వరుసలు బెంచీలో కుర్చీలో ఉండేవి. ఇవి కేవలం షావుకార్ల కోసం. ఈ కుర్చీ క్లాసు తర్వాత మరో తడికె గోడ వచ్చేది. ఈ గోడలో అంతెత్తున చతురస్రాకారం రంధ్రం లోంచి వచ్చే కాంతి కిరణాల గొట్టం టెంటు తెర మీద పడేసరికి సినిమాగా మారిపోయేది. ఈ తడికె వెనకే ప్రొజెక్టర్ రూము ఉండేది. ఒక్కోసారి టెంటు బైట ప్రొజెక్టర్ రూము దగ్గర మాకు సినిమా ఫిల్ము ముక్కలు దొరికేవి. అప్పుడప్పుడు వీటిని ఎండలో భూతద్దంతో గోడ మీదకు ఫోకస్ చేసి బొమ్మలు పడేలా చేసి ఆడుకునే వాళ్లం.
మేం బనగానపల్లెలో ఉన్నప్పుడు చూసిన టూరింగ్ టాకీస్ లో సినిమాల్లో మాయమంత్రాల సినిమాలే ఎక్కువ. జ్వాలా ద్వీప రహస్యం, తోటలో పిల్ల కోటలో రాణి, కనకదుర్గ పూజా మహిమ వంటివి. ఎన్టీఆర్ సినిమాలు దాగుడుమూతలు, దొరికితే దొంగలు కూడా అక్కడే చూసినట్టు గుర్తు.
సినిమా పోస్టర్లు అతికించిన రెండు పెద్ద పెద్ద చెక్క పలకలను నిలువునా త్రిభుజాకారంగా అతికించి అడుగునా గడగడా పెద్ద శబ్దం చేసే నాలుగు చక్రాలను బిగించి దాన్ని తోసుకుంటూ టెంటులో ఆడుతున్న సినిమా గురించి ఊళ్లో ప్రచారం చేసేవాళ్లు.
ఓ సారి సెలవులకు నందికొట్కూరులో మా మామ వాళ్లింటికి పోయినప్పుడు అక్కడ కూడా టెంటులో సినిమాలు చూసినాను. అది కొంచెం పెద్ద ఊరు కాబట్టి అక్కడి టెంటులు కూడా, బనగానపల్లెలో వలె పేదవి కాకుండా, కొంచెం పెద్ద తరహాలో ఉండేవి. అప్పటికి నేనూ కొంచెం పెద్ద పిల్లోణ్ని అయినాను కాబట్టి అక్కడ నేను చూసిన మహామంత్రి తిమ్మరుసు, మంచివాడు కొంచెం మంచి సినిమాలని నాకు అర్థం అయింది.
మహామంత్రి తిమ్మరుసులో కృష్ణ దేవరాయలు ఎన్టీఆర్ తిమ్మరుసు గుమ్మడికి చివరలో కాల్చిన ఇనుపకడ్డీలతో కన్నుగుడ్లు పొడిపించే సీను చూస్తున్నప్పుడు మనకే కాదు ఎవ్వరికైనా ఏడుపొచ్చినట్టవుతుంది.
నంద్యాలలో నేను మూడు, నాలుగు తరగతులు చదివినాను. అప్పటికే నంద్యాలలో మూడు థియేటర్లుండేవి. నేషనల్, రామనాథ, రాజ్ థియేటర్లు ఒకే రోడ్డులో ఒకదాని తర్వాత ఒకటి వచ్చేవి. ఇవి కాక అప్పుడప్పుడే మినీ ప్రతాప్ అని ఇంకో కొత్త థియేటర్ ప్రారంభమయింది. దీంట్లో ఎన్టీఆర్ డబులాక్షన్ వేసిన భలే తమ్ముడు సినిమా చూసినట్టు జ్ఞాపకం. రామనాథలో ఎక్కువగా నాగేశ్వర్రావు సినిమాలు, రాజ్ లో ఎక్కువగా ఎన్టీ రామారావు సినిమాలు వేసేవారని మేం అనుకునే వాళ్లం. రామనాథలో నాగేశ్వర్రావు నటించిన జమీందార్, ఆస్తిపరులు, వీలునామా, అంతస్తులు సినిమాలూ, రాజ్ లో లక్షాధికారి, సిఐడి (ఇవి ఎన్టీఆర్ సినిమాలు) చూసినాను. ఇంకా రామనాథలోనే కృష్ణ నటించిన సర్కర్ ఎక్స్ ప్రెస్, టక్కరి దొంగ చక్కని చుక్క, శోభన్ బాబు నటించిన వీరాభిమన్యు సినిమాలు చూసినట్టు గుర్తు. నేషనల్ లో నేను చూసిన సినిమాల్లో లేత మనసులు అప్పట్లో పెద్ద హిట్టు. నాగేశ్వర్రావు మూగమనసులు, కృష్ణ మొట్టమొదటి సినిమా తేనె మనసులు కూడా ఈ థియేటర్ లోనే చూసినట్టు గుర్తు.
ఇప్పటికి ఆరు దశాబ్దాలు జీవితంలో ఎన్నెన్నో గొప్పవీ, అద్భుతమైన సినిమాలు చూసి ఉండవచ్చు గానీ చిన్నప్పుడు చూసిన సినిమాలతో, ముఖ్యంగా వాటిలోని చిన్నపిల్లల పాత్రలతో కనెక్ట్ కావడం మాత్రం ఎప్పటికీ, ఇంకెన్ని జన్మలైనా మర్చిపోలేని ఓ గొప్ప అనుభవమనిపిస్తుంది. లవకుశ సినిమా ప్రభావంతో అప్పట్లో కొన్ని రోజులు విసనకర్ర దబ్బలతో విల్లు చేసుకుని, పొరకపుల్లలతో బాణాలు చేసుకుని భుజాన వేసుకుని తిరిగేవాళ్ళం. మనకు యుద్ధం చేయడానికి రాముడో, లక్ష్మణుడో దొరకడు కాబట్టి రోడ్డు పక్కన కుక్కల మీదకు బాణాలు వేసి ఆనందించేవాళ్లం. ఒక్కోసారి నేనూ మా అన్న ఎదురెదురుగా కొంతదూరంలో నిలబడి ఒకరి మీదొకరు బాణాలు వేసుకునే వాళ్లం. లవకుశలో రాముడుగా ఎన్టీఆరూ, సీతమ్మగా అంజలీ దేవి అత్యద్భుతంగా నటించి ఉండవచ్చు గానీ అప్పట్లో మాకు మాత్రం లవకుశులే హీరోలు.
లేత మనసులు సినిమాలో లల్లి, పద్మినిగా డబులాక్షన్ వేసిన కుట్టి పద్మిని కూడా ఆ ఒక్క సినిమాతోనే బాలనటిగా తారాపథానికి దూసుకెళ్లింది. భక్త ప్రహ్లాదలో ప్రహ్లాదుడిగా నటించిన రోజా రమణి కూడా ఆ సినిమాతో సూపర్ స్టారై పోయింది. లేత మనసులులో పిల్లలూ దేవుడూ చల్లనివారే అనే పాట ఆనాడు ఆంధ్ర దేశమంతటా ప్రతిధ్వనించింది. అందులో `పుట్టినపుడు మనిషి మనసు తెరచి ఉండును- ఆ పురిటి కందు మనసులో దైవముండును…..వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే అంత మనిషిలోని దైవమే మాయమగును లే’….అనే ఈ చరణం ఎప్పటికీ గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. వయసనే నిషిద్ధఫలాన్ని ఆరగించిన పాపానికి ప్రేమలూ, ద్వేషాలూ, ఈర్ష్యాసూయల శాఖా చంక్రమణంలో గింజుకుంటూ గానుగెద్దులా బతికెయ్యడం తప్ప మనిషికి గత్యంతరమేదీ?
(featured images credit: moviemaker)
(బివి మూర్తి, సీనియర్ జర్నలిస్టు, ముఖ్యంగా క్రీడల విశ్లేషకుడు.బెంగళూరు)
Very fantastic description of your childhood memories
మూర్తిగారి టెంటు సినిమా స్టంటులు చదువుతోంటే నా చిన్నతనాల్లో టూరింగ్ టాకీస్ లో నేల టిక్కెట్ కొనుక్కుని ఇసుక మీద కూచుని జేబులునిండా పోసుకొచ్చిన వేరుశనక్కాయలు వొలుచుకుతింటూ నేరువెళ్ళబెట్టి చూసిన సినిమా అనుభూతులు నాకళ్ళముందు సినిమా రీళ్ళ లా ప్రత్యక్ష మయ్యాయి., ఆ రోజులే వేరు. అలాంటివి మళ్ళీరావు. రచయిత శైలి పాఠకుల్ని ఎంతగానో ఆకట్టుకునే విథంగా వుంది.
నేను కడప జిల్లా వేపరాలలో టెన్త్ చదువుతున్నపుడు స్కూలు ఎదురుగా టెంట్ ఉండేది. అగ్గిబరాటా, గండరగండడు వంటి జానపద సినిమాలు వేసేవారు. ఎపుడూ టెంట్ లో సినిమా చూల్లేదు. అయితే, నేను ఎమ్మెస్సీ తిరుపతిలో చదువుతున్నపుడు రేణిగుంటలో టెంట్ వుండింది. అందులో ముద్దమందారం (1981) సినిమా వచ్చింది. రాత్రి తొమ్మిదికి తీరుబడిగా వెళ్లాం. కింద ఇసుకలో వెళ్లకిలా పడుకుని సినిమా చూశాం. అన్నట్లు జంద్యాల దర్శకుడిగా మారిన తొలి సినిమా అది. టెంట్ లో ఒక షో మాత్రమే వేశేవాళ్లు. మూర్తిగారూ, అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలు గతంలోకి జరజరా లాక్కుపోయారు.మీరలా అపుడపుడూ ఇలాంటివి రాస్తూ ఉండండి.