(జింకా నాగరాజు)
చాలా మంది అమెరికా వెళ్తారు. అక్కడి గుంపులో మాయమైపోతారు.కొందరే అందరికీ కనిపించేలా ఆకాశం అంత ఎత్తెదుగతారు. అలాంటి భారతీయులు, అందునా తెలుగు వాళ్లు ఒక డజను మించి అమెరికాలో ఉండరు. ఇపుడు తెలుగు వాళ్లే కాదు, మొత్తం భారతదేశం గర్వపడే స్థాయికి తిరుపతి పూర్వవిద్యార్థి ఎదిగాడు. ఆయన పేరు పార్లపల్లె హేమచంద్రారెడ్డి. ఊరు తిరుపతి పక్కనే ఉన్న చిన్న పల్లెటూరు… మల్లంగుంట.
హేమ చంద్రారెడ్డి నోబెల్, గోబల్ శాస్త్రవేత్తల క్లబ్బులో చేరాడు. అమెరికన్ అసోసియేషన్ ఫర్ ఎడ్వాన్స్ మెంట్ అఫ్ సైన్స్ (American Association of Advancement of Science , AAAS)ఫెలో అయ్యాడు. ఇది గొప్ప శాస్త్రవేత్తలకు మాత్రమే దొరికే అరుదాతి అరుదైన గౌరవం. ఈ సంస్థలో నోబెల్ శాస్త్రవేత్తలుంటారు, నోబెల్ ఫ్రైజ్ అందుకోబోయే వాళ్లుంటారు. ఇదేదో దరఖాస్తు చేసుకుంటే వచ్చేది కాదు. ముఖ్యమంత్రులో, మంత్రులో అనుకుంటే వచ్చే సిఫార్సు బాపతు కాదు. ఈ సంస్థలో వందల సంఖ్యలో ఉన్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, హేమచంద్రారెడ్డి రీసెర్చ్ ను బేరీజు వేసి వోట్లేసి ఎన్నుకుంటారు. అలా మల్లంకుంట పిలకాయ్ కి నోబెల్, గ్లోబల్ శాస్త్రవేత్తల పక్కన సీటేసి కూర్చోబెట్టారు.
మల్లంకుంట ప్రైమరీ స్కూలు, తిరుపతి ఎస్వీ హైస్కూలు, ఎస్ వి అర్ట్స్ కాలేజీ, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం… టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచి పండగ చేసుకోవాలి.
హేమ్ ఐటిలో ఉండి ఉంటే అది జరిగేదేమే.ఆయన అపుడు బిలియనీర్ అయ్యే వాడు. మిణకుమిణుకున మెరిసే ఐటి ప్రపంచంలో కాకుండా పుట్టినప్పటినుంచి మనిషిని పీడించే వృద్ధాప్యం గురించి ఆయన పరిశోధన చేేసే లాబొరేటరీకి పరిమితయ్యాడు.
వృధ్యాప్యం అంటే ఏమిటి? చావంటే ఏమిటి? వృద్ధాప్యం ఎందుకొస్తుంది? ఎందుకలా జబ్బులతో, పతనంతో పీడిస్తుంది? వృద్ధాప్యంతో పాటి మతిమరుపు ఎందుకొస్తుంది, అసలు ఈ మతిమరుపు ఎపుడు మొదలవుతుంది? దాన్ని అధిగమించడం ఎలా? మతిపరుపురాకుండా హుందాగా వృద్ధాప్యంలోకి ప్రవేశించవచ్చా, వృద్ధాప్యం గడపవచ్చా? వృద్ధాప్యం జబ్బులు సొసైటీ నుంచి వస్తాయా, లేక మనిషిలోనే ఎక్కడో కణాంతరాలలో పుడతాయా? ఈ సమస్యలేకుండా గ్రేస్ ఫుల్ గా వృద్ధాప్యాన్ని ఎంజాయ్ చేయవచ్చా, చేయవచ్చంటే ఎలా? ఇలాంటి ప్రశ్నలకు ఆయన సమాధానం వెతికాడు.
ఈయన పరిశోధన చేస్తున్నది బాహ్యప్రపంచంలో కాదు, మనిషి నరాల్లో, కంటికి కనిపించని కణాల్లో, ఇంకా లోలోతుకుపోయి జన్యువుల్లో… ఇంకా దూరం పోయి జన్యువుల్లోని ప్రొటీన్లలో. ఆయనకు ఫెలోషిప్ ఎందుకిచ్చారో చెబుతూ AAAS ఒక ప్రశంసా పత్రం విడుదల చేసింది. అందులో ఇలా రాశారు:
The AAAS elected 489 of its members as Fellows in 2020. Reddy was elected in the Biological Sciences category for his pioneering contributions to the fields of Alzheimer’s disease and mitochondrial neurobiology, particularly in discovering the key role of mitochondria in neurodegenerative diseases and their treatment. Mitochondria, considered the power generators of cells, take in and breakdown nutrients to create high-energy molecules for the cell.
ఇదే ఎత్తుకు ఆయన బిజినెస్ లోనో ఐటిలోనొో, సినిమాల్లోనో చేరివుంటే సెలెబ్రిటీ అయ్యేవాడు. నవంబర్ 27న టివీలో బ్రేకింగ్ అంటూ మద్దెల మోయించే వాళ్లు, పత్రికలోళ్లు మల్లంగుంటకు పరిగెత్తుకుంటూ హేమచంద్రారెడ్డి ఇల్లేది,బడేది,కాలేజీ ఏది,యూనివర్శిటీ ఏది, క్లాస్ మేట్స్ ఎవరూ అంటూ వెదుకులాడే వాళ్లు. హేమ్ పనిచేసింది గ్లామర్ లేని ప్రపంచంలో… ఏదో యూనివర్శిటీలో, ఏదో మూలన ల్యాబ్ లో కూర్చుని నిరంతరం చేసే పరిశోధన. మనిషి జీవితం చరమాంకంలో ప్రశాంతంగా సాగేంచేకు సాయపడే రహస్యాల అన్వేషణ.
హేమ్ 1981-83 లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాాలయంలో ఫిజికల్ యాంథ్రోపాలజీ అండ్ ప్రిహిస్టారిక్ అర్కియాలజీలో (PAPA) ఎమ్మెస్సీ చేశాడు. ఆరోజుల్లో ఈ సబ్జక్టును ఎవరు తీసుకునే వాళ్లు కాదు. ఎమ్మె్సీ జువాలజీ, బాటనీ, బయోకెమిస్ట్రీ వంటి డిపార్ట్ మెంట్ లలో సీటు రాకపోతే ఫిజికల్ యాంథ్రోపాలజీ తీసుకునే వాళ్లు. మార్కెట్లో డిమాండ్ లేని సబ్జక్టు అది.
అందుకే యూనివర్శిటీలో ఈ శాఖ ఇపుడు లేదు, ఇందులో చేరే వాళ్లు లేక మూసేశారు.దీనిని మరొకశాఖలో విలీనం చేశారు. అయితే, 1981లో ఈ శాఖలో చేరిన వాళ్లంతా చాలా సీరియస్ స్టుడెంట్స్. అందుకే కొత్త స్పెషలైజేషన్స్ కావాలని పట్టుబట్డి పోరాడి సైటో జెనెటిక్స్, పాపులేషన్ జెనెటిక్స్, ఫోరెన్సిక్ యాంథ్రోపాలజీ వంటి వాటిని తెచ్చుకున్నారు. అంటే అందరూ రీసెర్చు వైపు వెళ్లాలనుకున్నారు. హేమచంద్రారెడ్డి సైటో జెనెటిక్స్ వైపు వెళ్లాడు.
మల్లంగుంటనుంచి ప్రయాణం
హేమ్ తిరుపతికి మూడు నాలుగు కిలోమీటర్ల దూరాన ఉన్న మల్లంగుంటలో ఒక పేద రెైతుబిడ్డ, యూనివర్శీటీ లో ఇబిసి స్కాలర్ షిప్ తో హాస్టల్లో ఉండేవాడు. స్కూలు చదువు మల్లంగుంటలో సాగింది.తర్వాత తిరుపతి ఎస్వీ హైస్కూలుకు మారాడు. పొద్దునే వాళ్లవ్వ (జేజి) ముందు రాత్రి నీళ్లలో నాన బెట్టిన రాగిముద్ద టిపిన్ బాక్స్ లో పెట్టుకుని దాని మీద మాడికాయ కారం ఒప్పు ఒకటేసుకుని, చేసంచి నిండా పుస్తకాలు మోసుకుని నడచుకుంటూ తిరుపతికొచ్చే వాడు. కాలేజీ దాకా ఇదే జీవితం, యూనివర్శిటీ చేరాకనే హాస్టల్ భోజనం.
ఈ పరిశోధనకు ఎక్కడ పునాది పడిందోయ్ అంటే , ‘ మా యవ్వ కట్టిచ్చిన చద్ది రాగిముద్దలోనే ఏదో ఉందయ్యా. దాని రుచి, అది అందించిన శక్తి ఇదిగో ఇంకా భద్రంగా ఉంది తలకాయలో. అక్కడి నుంచి అవ్వే నాకు ప్రేరణ. నేను వృద్దాప్యం మీద రీసెర్చు చేయాలను కోవడానకి కారణంకూడా అవ్వనే,’ అని హేమ్ గొప్పగా వాళ్లవ్వ గురించి, తన టిఫిన్ బాక్స్ గురించి చెబుతాడు.
వాళ్లవూరు, ఆవూరి మనుషులు, స్నేహితులు…నాటి జీవితమంతా ఆయన జ్ఞాపకాల్లో సజీవంగా ఉంది. హేమ్ నిలువెత్తు కుప్పపోసిన ఆత్మీయత. పెదవులు మీద చెరగని చిరునవ్వు హేమ్ ఐడెంటిటి. తనకు AAAS ఫెలోషిప్ వస్తున్నదని, ప్రకటన నవంబర్ చివర్లో ఉంటుందని నాకు చెప్పాడు. నేను మర్చిపోయాను. ఈ విషయం మాట్లాడేందుకు ఫోన్ చేస్తే, ఒక నిమిషం పాటు, హెలో అని కూడా చెప్పకుండా, ఎమోషనల్ అయిపోయి అనందంతో నవ్వుతూనే ఉండిపోయాడు. మా ఇద్దరి మధ్య రెండు నిమిషాలు మాటల్లేవు. భాష మొత్తం నవ్వుగా విరబూసింది. గుభాళించింది.
వృధ్యాప్యం మీద రీసెర్చ్ ఎలా మొదలయింది?
వాళ్లవ్వ (జేజికి) పార్ల పల్లె చెంగమ్మ 94 సంవత్సరాల దాకాజీవించింది. ఆమెకు వృద్ధాప్యంలో మతిమరపు (Dementia) వచ్చింది. ఏదీ గుర్తుండటం లేదు. జీవితం నరకమయింది. ఇండియా వచ్చినపుడల్లా ఈ పరిస్థితి చూసి ఆయన చలించిపోయాడు. వృద్ధాప్యంలో హుందాగా జీవితం సాగాలిగాని, ఇలా నరకం కాకూడదు అనుకున్నాడు. ఈ జబ్బు గురించి పరిశోధన చేసి తీరాలనుకున్నాడు. వృద్ధాప్యంలో కనిపించే శారీకర, నరాలాపతనావస్థకు కారణాలు వెదకడంలో గత 20 సంవత్సరాలుగా మునిగిపోయాడు. ఇందులో కణంలో ఉండే మైటోఖాండ్రియా పాత్ర చాలా ఉందని ఒక సత్యం ఆవిష్కరించాడు. ఆయన పరిశోధన వల్ల వృద్ధాప్యం, డిమెన్సియా, ఎల్జైమర్స్, హంటింగ్టన్ జబ్బు ల గురించి మనిషి అవగాహన చాలా పెరిగింది. వాటి చికిత్సకు మార్గం ఏర్పడింది.