(ఢిల్లీ-హర్యానా సింఘూ సరిహద్దు నుంచి ఇఫ్టూ ప్రసాద్ (పిపి) అందిస్తున్న ప్రత్యేక నివేదిక)
నిన్న మా బృందం టిక్రీ బోర్డర్ వద్ద హైవే ముట్టడి ప్రాంతాన్ని పర్యటించింది. దిగ్బంధనంలో పాల్గొన్న రైతాంగం మొన్న, నిన్న ఒకే విధంగా కనిపించింది. ఒక్క పరిమాణంలో తప్ప గుణంలో తేడా కనిపించలేదు. సింఘు వద్ద పాల్గొన్న జనంతో పోల్చితే, టిక్రీ వద్ద పాల్గొన్న రైతాంగం సంఖ్యా పరంగా తక్కువ. జనం నాడిలో తేడా కనిపించ లేదు.
మేము చూసిన ఈ రెండు హైవేలపై దిగ్బంధన స్ధలాలలో పాల్గొన్న రైతాంగాన్ని నిశిత పరిశీలన చేసాం. ప్రాధమిక సమాచారం ప్రకారం మేమొక అవగాహనకు వచ్చాము. అది రైతాంగ ఉద్యమ శక్తిని అంచనా వేసే అంశం. ప్రత్యేకంగా దాన్ని నొక్కి చెప్పాల్సి ఉంది.
సాధారణంగా ఉద్యమాలలో పాల్గొనే జన సంఖ్యను బట్టి ఉద్యమ బలాన్ని అంచనా వేయడం ఒక దృష్టికోణంగా ఉద్యమశ్రేణుల్లో ఉంది. అది సమగ్ర దృక్కోణం కాదు. ఇక్కడ బొత్తిగా వర్తించదు.
ఉద్యమాలను సమగ్ర అంచనా వేయడానికి రకరకాల కొలబద్దలు ఉంటాయి. ఆయా సమస్యలపై జరిగే పోరాటాల్లో ఎంత జనం పాల్గొంటున్నారనేది ఆ ఉద్యమ బలాన్ని అంచనా వేయడానికి ఏకైక కొలబద్ద కాదు. అది ఆయా ఉద్యమాల్లో భౌతికంగా పాల్గొనే జనబలగం మీద ఆధారపడి దాని బలాన్ని అంచనా వేయడమంటారు. ఇది అట్టి ఉద్యమ బలాన్ని శాస్త్రీయంగా అంచనా వేసే పద్దతి కాదు. దీనిని “భౌతిక బలం” (physical strength) ఆధారంగా ఆయా ఉద్యమ బలాల్ని అంచనా వేయడం! నిజానికి బయటకు కనిపించే బలమది. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనే సంబంధిత ప్రజల సంఖ్య మీద ఆధారపడి ఉద్యమ బలాన్ని లెక్కించే పద్దతి. అది చాలా మొరటు కొలబద్ద. ఈ ముడి లేదా మోటు కొలబద్దతో పరిమితం కాకుండా శాస్త్రీయ కొలబద్దతో ప్రజల పోరాటాల్ని అంచనా వేయాలి. ఆ వెలుగులోనే తాజా ఢిల్లీ రైతాంగ ముట్టడి రూపం యొక్క వాస్తవ బలాన్ని గూర్చి ఆలోచిద్దాం.
ఉద్యమ స్థితిని అంచనా వేయడానికి కేవలం సంఖ్యలు, అంకెలు గీటురాయి కాదు. మా బృందం గత రెండు రోజులు చూసిన, చేసిన ప్రాధమిక పరిశీలనాంశాలు సరైన నిర్ధారణకు రావడానికి కొంత వరకు సహకరిస్తాయి.
మా పరిశీలన సమగ్రమైనది కాక పోవచ్చు. అందులో చాలా కొరతలు కూడా ఉండొచ్చు. ఐతే కొట్టొచ్చినట్లు కళ్లకి కనిపించే కొన్ని వాస్తవాల్ని సేకరించాం. తాజారైతాంగ బలాన్ని అంచనా వేయడానికి తోడ్పడవచ్చు.
మా పరిశీలనాంశాల్ని చెప్పే ముందు ఒక అంశాల్ని మిత్రుల దృష్టికి తేవాలి. సోషల్ మీడియాలో మా కధనాలు చదివిన కొందరు మిత్రులు ఇక్కడ పాల్గొనే జన సంఖ్య పై నిర్దిష్ట అంచనాల్ని కోరారు. (పై రెండు చోట్ల కలిపి సుమారు లక్షమంది లేదా కొంత తక్కువే ఉండొచ్చు. ఐతే అది ముఖ్యం కాదు, వాటిలో పాల్గొనే జన సంఖ్య ఆ ఉద్యమ బలనిర్ధారణ కి ప్రాతిపదిక కాదు) ముట్టడి లో పాల్గొనే జన సంఖ్య పట్ల నేడు రకరకాల అంచనాలు సోషల్ మీడియా లో వెలువడే స్థితి ఉంది. ఈ నేపథ్యంలో మా బృందం నుండి తెలుసుకునే మిత్రుల జిజ్ఞాసను అర్ధం చేసు కోవచ్చు. అదే సమయంలో వాటిలో పాల్గొనే జనసంఖ్య సరైన కొలబద్ద కాదని ఇక్కడకు వచ్చిన తరువాత మరింత ఎక్కువగా మాకు అర్ధమైనది.
ఈ హైవేల దిగ్బంధన కార్యక్రమంలో పాల్గొనే జనం స్థిరసంఖ్యలో లేదు. ఇది నిత్యం మారుతుంది. మొదటి రోజు వచ్చిన మనిషి చివరి రోజు వరకూ స్థిరంగా వుంటాడనే మా పాత భావన నిజం కాదు. దీనికి సంబంధించిన వివరాలు కొన్ని ఈ క్రింద పేర్కొంటున్నాము. ఈ హైవే దిగ్బంధనం లో పాల్గొనే జనం భాగస్వామ్యత గూర్చి మా పరిశీలనాంశాలివి.
1- నవంబర్ 26 నుండి నేటి వరకీ (23వ రోజు) ముట్టడిలో స్థిరంగా కొనసాగే ప్రదర్శకులు ఒకరకం కోవలోకి వస్తారు.
2- వారం రోజుల పాటు ఈ ముట్టడిలో వుంటారు. తర్వాత స్వంత గ్రామం వెళ్తారు. ఇంటి వద్ద ఒకట్రెండు రోజులుంటారు. తిరిగి వచ్చి ముట్టడిలో పాల్గొనే వాళ్ళు మరో కోవలోకి వస్తారు.
3- రెండేసి లేదా మూడేసి రోజులు ముట్టడిలో వుంటారు. తర్వాత ఇంటికి వెళ్తారు. అక్కడ కూడా రెండేసి లేదా మూడేసి రోజులు వుంటారు. మళ్లీ వచ్చి ముట్టడిలో పాల్గొనే వాళ్ళు ఇంకో కోవలోకి వస్తారు.
4- ఇంటి వద్ద వ్యవసాయం చేసే రైతు కొడుకుని ముట్టడి నుండి ఇంటికి రప్పిస్తాడు. పొలం పనిని రెండు లేదా మూడు రోజులు ఆ కొడుక్కి అప్పగిస్తాడు. ముట్టడి వద్దకు వస్తాడు. రెండు లేదా మూడు రోజులు ముట్టడిలో పాల్గొని తిరిగి పొలం పనికి వెళ్తాడు. కొడుకును తిరిగి ముట్టడి వద్దకు పంపిస్తాడు. ఇలాంటి వాళ్ళు మరో కోవలోకి వస్తారు.
5- ముట్టడి స్థలాలకు 50 కిలో మీటర్ల లోపు ప్రాంతాల నుండి ప్రతిరోజూ ఉదయం టూ వీలర్లు, లేదా ఫోర్ వీలర్లతో ముట్టడి వద్దకు బృందాలుగా వస్తారు. ఐతే సందర్శకుల వలె కాదు. వారు బైఠాయింపులో పగలంతా పాల్గొంటారు. తిరిగి అదే రోజు సాయంత్రం 5 లేదా 6 గంటల తర్వాత తమ స్వంత గ్రామాలకు వెళ్లి పోతారు. వీళ్ళు మరో కోవలోకి వస్తారు.
6- వందల కిలో మీటర్ల దూరంలోని పంజాబ్, హర్యానా మారుమూల గ్రామాల నుండి కూడా, రెండు లేదా మూడు రోజులకు ఒకసారి వాహనాల్లో నినాదాల హోరుతో వస్తారు. ఆరోజు ప్రత్యక్షంగా ముట్టడిలో పాల్గొంటారు. ఒక్క రాత్రైనా అక్కడే బస చేసే సంకల్పంతో గడిపి, ఆ మరునాడు పగలు కూడా బైఠాయింపులో పాల్గొని, ఆ రాత్రికి తమఊరు చేరతారు. వీరు ఇంకో కోవలోకి వస్తారు.
7- ఒక్కరోజైనా తమ ఊరి ప్రియతమ రైతుల ముట్టడిని చూసి రావాలనే సంఘీభావ ధర్మంతో ముట్టడి స్థలానికి వస్తారు. దాన్నొక సందర్శనీయ క్షేత్రంగా భావిస్తారు. ఇక్కడకు వచ్చి ఓ రెండు లేదా మూడు గంటలు తిలకించి వెళ్తారు. వీరు వేరొక కోవలోకి వస్తారు.
మా బృందం చేసిన ప్రాధమిక పరిశీలనలో కింది విధంగా అర్ధమైనది. మొదటి కోవలోకి అత్యధిక శాతంమంది వృద్ధులు వస్తారు. యువత ప్రధానంగా రెండో, మూడో కోవలలోకి వస్తుంది. తమ గ్రామాల్లో పొలం పనులు చేసే రైతులు& కూలీలు నాలుగో కోవలోకి వస్తారు. ఇక పోతే ప్రధానంగా పొలం పనులు చేసే రైతుల కుటుంబీకులుగా వుంటూనే ఇతర శ్రమ వృత్తులు కూడా చేసే వాళ్ళు ఐదవ కోవ లోకి వస్తారు. ప్రధానంగా రైతు కుటుంబాలకు చెందిన స్త్రీలు, పిల్లలు (వారు గృహిణులు కావచ్చు లేదా పొలం పనులు చేసే వాళ్ళు కూడా కావచ్చు) ఆరవ కోవలోకి వస్తారు. గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామీణ చేతి వృత్తులు, చిల్లరవర్తకులు, ఇంకా రకరకాల రైతాంగేతర మిత్ర వర్గాల వారు ఏడవ కోవలోకి వస్తారు.
పంజాబ్, హర్యానాలకు చెందిన సుదూర ప్రాంతాల గ్రామీణ జనంలో ఇదో జాతర వంటి సందోహంగా మారింది. ముట్టడిలో ప్రత్యక్షంగా పాల్గొనే సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మెజారిటీ గ్రామాల జనాభాలో వీరి సంఖ్య దాదాపు మెజార్టీకి చేరి వుండొచ్చేమో! ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా దానిలో ప్రత్యక్షంగా పాల్గొనలేక పోయిన వాళ్ళు గ్రామీణప్రజల్లో అత్యల్ప శాతం మంది మాత్రమే మిగిలి ఉండొచ్చునెమో! ఇప్పటి వరకు సందర్శించలేని ప్రజల్లో కూడా రేపో మాపో సందర్శించే తపన వుందని ప్రదర్శకుల మాటల్ని బట్టి మాకు అర్ధమైనది. దీన్ని బట్టి సింఘు, టిక్రీ ముట్టళ్లలో పాల్గొనే పంజాబ్, హర్యానా రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల ప్రజలలో భౌతికంగా లేదా మానసికంగా ఇదొక సార్వత్రిక భాగస్వామ్య ధోరణిగా ఉంది. ఫలానా రోజు ముట్టడి వద్దకు వెళ్లి అందులో పాల్గొనే సంఖ్యని లెక్కించే రాజకీయ విశ్లేషకుల అంచనాలకు వాస్తవ లెక్కకు పొంతన ఉండదు. దీనిని స్పష్టం చేయడమే మా ఉద్దేశ్యం.
సందర్శకులు, విలేఖరులు, పరిశీలకులు , రాజకీయ విశ్లేషకులు ఒక్క రోజు వెళ్లి, ముట్టడి స్థలాన్ని సమగ్ర పరిశీలన చేసినప్పుటికీ సమగ్రత రాదు. అందులో పాల్గొనే జనసంఖ్య విస్తృతి, తీవ్రత, సాంద్రతల్ని బట్టి శాస్త్రీయంగా అంచనా వేయడం సాధ్యం కాదు. ఇది భూమికి సర్వేయర్లు కొలతలు వేయడం వంటిది కాదు. గణిత శాస్త్రంలో రెండురేండ్లు నాలుగు అనే సంఖ్యల వంటి లెక్కింపు వర్తించదు. ముట్టడిలో పాల్గొనే జనసంఖ్య లెక్కింపు పద్దతి కంటే అనేక రేట్లు విస్తృతి ఈ ఉద్యమానికి ఉంటుంది. ఈ అంశాల్ని దృష్టిలో ఉంచుకొని (మాత్రమే) తాజా రైతాంగ ముట్టడి యొక్క బలాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది.
తాజా ముట్టడికి దేశవ్యాపిత మద్దతును కూడా పరిగణన లోకి తీసుకోవాలి. ఐతే మేము ఇక్కడ వాటిలోకి వెళ్లడంలేదు. ముట్టడిలో ప్రత్యక్షంగా పాల్గొనే జన బలాన్ని పరిగణనలోకి తీసుకొని ఉద్యమ బలాన్ని లెక్కించే విషయానికి మాత్రమే పరిమితమైన సందర్భమిది.
ఉద్యమ బలాన్ని అంచనా వేయడానికి ప్రాతిపదికలలో ఒకటిగా అందులో పాల్గొనే బలగాల సంఖ్య ఉంటుంది. విధిగా అదో ప్రాతిపదికగా ఉంటుంది. ఐతే అది ఏకైక ప్రాతిపదిక కాదు. అనేక సార్లు అది ప్రధాన ప్రాతిపదికయే. అరుదుగా అది అప్రధాన ప్రాతిపడికగా కూడా మారొచ్చు. ఇక్కడ మాత్రం జనసంఖ్య ఏకైక ప్రాతిపదికకాదు. కనీసం ప్రధాన ప్రాతిపదిక కూడా కాదని తెలుస్తోంది. దాని కంటే విస్తృత ప్రాతిపదిక తాజా ముట్టడికి ఉంది. గాన తాజా ముట్టడిలో పాల్గొనే జనసంఖ్య అప్రధాన అంశంగా మారిపోవచ్చు.
దోపిడీ రాజ్యాలు కూడా ప్రజాఉద్యమ బలాల అంచనా కు వాటిలో ప్రత్యక్షంగా పాల్గొనే బలగాల సంఖ్యని సదా ఏకైక ప్రాతిపదికగా చేయవు. వివిధ కోణాలలో విభిన్న అంశాల ప్రాతిపదిక మీద ఆధారపడి ఆయా దోపిడీ ప్రభుత్వాలు అంచనా వేసి, వాటి అణచివేత కై తగిన నిర్బంధ రూపాల్ని ఎంపిక చేసుకుంటాయి. కొన్ని సార్లు ఒక్క నిరసనకారుడు వినిపించే ఉద్యమ వాణిని రాజ్యం అణిచివేస్తే నూరు మంది నుండి నిరసన వచ్చే స్థితి ఉంటుంది. మరికొన్ని సార్లు వంద మంది నిరసన గొంతుల్ని అణిచివేస్తే దానిపై పది మంది కూడా నిరసించలేని పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ సమయమూ, సందర్భాల మీద ఆధారపడి ఉంటాయి. స్థల, కాలాదులకి లోబడి ఉంటాయి.
సాధారణంగా ప్రజా ఉద్యమాల పై అణచివేతకు దిగే ఏ దోపిడీ ప్రభుత్వమైనా ఇలాంటి అన్ని అంశాల్ని విధిగా పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ రీత్యా ఈ ముట్టడికి గల వాస్తవ బలాన్ని ప్రజాతంత్ర శక్తులు శాస్త్రీయంగా అంచనా వేయాలి. ముట్టడిలో పాల్గొనే జనసంఖ్యను ప్రధాన గీటురాయుగా భావించరాదు. ఈ దృక్కోణంలో నేటి ముట్టడి వాస్తవ బలాన్ని లెక్క కడదాం.
ఈ ముట్టడికి లభిస్తున్న దేశవ్యాపిత సంఘీభావ బలం, ఉద్యమ కార్యాచరణలు కూడా విశాల అర్థంలో ఈ ముట్టడి యొక్క వెనకతట్టు బలమే. సింఘు, టిక్రీ, ఘజీపూర్ బోర్డర్ పోయింట్లలో జరిగే తాజా ముట్టళ్లను చెదరగొట్ట జూసే ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకునే అంశాలే. ముట్టడిపై ఒకవేళ పోలీస్ బలగాలతో నిరంకుశ దాడికి దిగితే, దానికి ఎదురయ్యే ఈ అన్ని రకాల ప్రజా ప్రతిఘటనలు కూడా ముట్టడి బలగాలకు గల వాస్తవ బలమే అవుతుంది. ఈ సాపేక్షిక దృక్కోణంలో తాజా హైవేల్ని దిగ్బంధనం చేసిన రైతాంగ ఉద్యమ బలాన్ని సరిగ్గా అంచనా వేద్దాం.