(సుంకర పద్మశ్రీ)
ఏడాది నుండి ఎన్నో వేధింపులు,భయంకరమైన దమన కాండని భరిస్తూ మహిళలు,రైతులు పోరు పిడికిళ్ళతో రాజీలేని పోరాటం చేస్తున్నారు.రాజధాని రక్షణ కోసం 365 రోజులుగా గర్జన చేస్తున్నారు. 2019 డిసెంబర్ 17 వ తేదీ శీతాకాలం సమావేశాల ఆఖరి రోజున మూడు రాజధానులు అంటు సీయం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ లో ప్రకటన చేసి 2020 డిసెంబర్ 17 కి ఏడాది పూర్తి అవుతుంది.
ఏడాది నుండి రాజధానికి భూములిచ్చిన అన్నదాతల ఆక్రందన మిన్నంటింది.365 రోజులుగా రైతుల మహోధ్యమం మహోగ్రరూపం దాల్చినా ప్రభుత్వం పట్టించుకొక పోగా ఉక్కు పాదంతో అణచివేతకు పూనుకొన్నా రైతులు వెనక్కి తగ్గలేదు. అడుగడుగునా ఆంక్షలు వేధించినా,నిర్భంధించినా,లాటీలతో చితక బాదినా ,ఇనుప కంచేలతో అడ్డుకున్నా, ఇనుప సంకేళ్లతో,అక్రమ అరెస్టులతో, పెయిడ్ ఆర్టిస్టులు అంటు అవమానించినా,దుర్భాషలాడినా ఒకే రాష్ట్రం,ఒకే రాజధాని అదే అమరావతి అనే నినాదం తో దిక్కులు పిక్కటిల్లే లా రాజధాని ప్రాంతం మార్మోగుతున్నది.
అందరిలో ఒకటే కసి,ఒకటే తపన,ఒకటే పట్టుదల రాజధానిని కాపాడుకోవాలని. రైతులపోరాటం చరిత్రలో నిలిచిపోనున్నది. ఇంతకాలం ఎక్కడా రైతులు పోరాటం కొనసాగలేదు.రాష్ట్ర రాజధాని అమరావతిని విశాఖకు తరలింపును వ్యతిరేకిస్తూ 29 గ్రామాల్లో మొదలైన ఉధ్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది.ఉవ్వెత్తున ఎగిచిన అమరావతి పరిరక్షణ జె ఏ సి ఉధ్యమం రాష్ట్ర ప్రజల్లో స్ఫూర్తిని నింపింది.రాజధాని తరలింపు ప్రకటనతో రాజధానికి గ్రామాల్లో రైతుల గుండెలు ఆగి దాదాపు 110 మంది మరణించారు.పాలకులను నమ్మి నోటికాడ భూములు ఇచ్చామని రైతులు ఘోషిస్తున్నారు. రైతులకు భూమితో వున్న అనుభంధం విడదీయ లేనిది.రైతులు ఎంతో ఔధార్యంతో భూములిచ్చి చరిత్రలో భాగ స్వాములు కావడం గొప్ప విశేషం.
రైతులకు-భూములకు మధ్య వున్న భంధం తల్లి -బిడ్డల మధ్య వున్న సంభదం వంటిది.రైతులు వారి బిడ్డను త్యాగం చేశారు. భూములు ఇచ్చినవారిలో అధిక శాతం సన్న,చిన్న కారు రైతులే,రాష్ట్ర భవిష్యత్ కోసం తాము భూములు ఇస్తే తమను వీధుల పాలు చేశారని,భవిష్యత్ తరాలకోసం తమ పోరాటాన్నిఎంత కాలమైనా కొనసాగిస్తామంటున్నారు.అమరావతి పరిరక్షణ జె ఏ సి పోరాటం లో మహిళలు ముందుండి పోరాటం చేస్తున్నారు.ఒకే రాజధాని కోసం ఉధ్యమించిన మహిళలను అత్యంత పాశవికంగా అణచివేసే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఏడాదినుండి రాజధాని అమరావతి ప్రాంతం అట్టుడిగి పోతుంది.
వేల మంది పోలీసులను ప్రయోగించి అమరావతి పరిరక్షణ జె ఏ సి ఉధ్యమం పై ప్రభుత్వం ఎంత నిర్భందం,దమన కాండ సాగించినా మహిళ ల,రైతుల పోరాట స్పూర్తి ముందు ప్రభుత్వం నిర్భంధం వెల,వెల పోయింది .ఆంక్షల వలయంలో అమరావతిని నిర్భంధించి,అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా అమరావతే రాజధానే అని ప్రకటించించే వరకు దీక్షా శిభిరాలనుండి కదలబోమంటూ భీష్మించుకున్నది మహిళా లోకం. 365 రోజులుగా మహిళలు రక్త కన్నీరు కారుస్తున్నారు.రాజధానిని బతికించుకొనేందుకు మహిళా శక్తులు కత్తులై కదులుతున్నాయి ఉధ్యమంలో.లాటీ దెబ్బలకు రక్తం చిందినా బెదరలేదు.ముళ్ళకంచెలకు, పోలీసు కవాతులకు,అరెస్టులకు,దుర్భాషలకు వెరవకుండా పోరాడు తున్నారు మహిళలు.ఎన్నాళ్ళైనా కూర్చుంటాము, రెక్కలు ముక్కలు చేసే వాళ్ళం,నిస్వార్ధంగా ఎదిగాం,హక్కులను, న్యాయాన్ని నమ్ముకున్నాం అమరావతే రాజధానిగా ముద్దాడే వరకు పట్టువీడమని మహిళ లంతా దుర్గమ్మ లై పోరాడుతున్నారు.
దుష్ట పన్నాగాలు పన్నే దాష్టీకాన్ని ఎదుర్కొంటామని, నయవంచకుల మెడలు వంచేందుకు రాత్రీ,పగలు సరికొత్త ఉధ్యమానికి ఊపిరి పోసి రాజధాని సమరాన ఆయుధమై ముందు నిలిచారు మహిళలు .అమరావతి పరిరక్షణ జె ఏ సి పిలుపు మేరకు సకల జనుల సమ్మేలో భాగంగా శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళలపై ఉక్కు పాదం మోపి వికృతంగా వ్యవహరించారు పోలీసులు.మహిళలని చూడకుండా రోడ్లపై జుట్టుపట్టి ఈడ్చుకొంటూ వెళ్ళి పోలీసు వాహనాల్లో కుక్కారు, పోలీసు వాహనంలో బూటు కాళ్లతో తన్నడం,చున్నీలతో గొంతులు బిగించడం,మంగళ సూత్రాలు గుంజడం,గోళ్ళతో రక్కడం వంటి చర్యలతో నరకం చూపించారు.నోటితో వర్ణించలేని భాషతో మహిళలను దూషించారు.అయినా మహిళలు వెనుకంజ వేయలేదు. లం -ల్లారా పొద్దున్నే రోడ్లు ఎక్కారు మీకేందుకే ఉధ్యమాలు,ధర్నాలు అంటు దుర్భాషలాడారు.పనిలేక రోడ్లు ఎక్కారా ?వృద్దులను ముసలి ముండల్లారా ఈ వయసులో మీకు దర్నాలు ఎందుకు?ఇంట్లో కూర్చోకుండా అంటు బూతులు తిట్టారని వృద్ద మహిళలు ఆవేదన చెందారు. రాజధాని తరలించవద్దని,అమరావతిని కాపాడాలని,మూడు రాజధానులు వద్దని మహిళలు దుర్గమ్మకు ముడుపులు కట్టి దుర్గమ్మ కు సమర్పించేందుకు పాదయాత్రగా బయలు దేరిన మహిళలను అడ్డుకొని అరెస్టు లతో రణరంగం సృష్టించారు పోలీసులు. మహిళలు,వృద్దులు అని చూడకుండా లాటీ లతో గొడ్లను బాదినట్లు బాదారు. ముడుపులు తీసుకొని అమ్మవారి ఆలయానికి బయలు దేరిన మహిళలను పోలీసులు అడ్డుకొవడంతో మేము గుడికి వెళ్ళడం తప్పా,మేము ఆంధ్రప్రదేశ్ లో లేమా?పాకిస్తాన్ లో వున్నామా?ఇలా అడ్డగించే బదులు మమల్ని కాల్చేయండి అంటూ గుండే చూపించారు మహిళలు.
దుర్గగుడి కి పాదయాత్రను కూడా అడ్డుకొని బీతావాహం సృష్టించారు పోలీసులు.అయినా వివిద మార్గాల్లో దుర్గగుడికి చేరుకొన్నారు. మూడు రాజధానులు వద్దు,అమరావతే ముద్దు అంటు మహిళల నినాదం తో విజయవాడ దద్దరిల్లింది.దుర్గగుడి కి వచ్చే మహిళల పై లాటీ చేయడంపై ఆగ్రహించిన మహిళలు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చారు.వేల మంది మహిళలను అరెస్టు చేసినా, కోoదరు మహిళలను గృహనిర్భందం చేసినా పోలీసుల కళ్ళు కప్పి సివిల్ కోర్టు నుండి కొందరు,బీసెంట్ రోడ్డు నుండి కొందరు,రాఘవయ్య పార్కు నుండి కొందరు పెద్ద సంఖ్యం లో బందర్ రొడ్డు ను దిగ్భంధించారు.. వారిని తొలగించే క్రమంలో మహిళల బట్టలు చించి వేశారు పోలీసులు,ఆ పెనుగులాటలో మహిళలకు గాయాలు అయి రక్త సిక్తం అయింది.పోలీసు చర్యలను పలు సంఘాలు ఖండించాయి.
అట్లాగే అమరావతి పరిరక్షణ జె ఏ సి పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్నినిర్ధాక్షిణ్యంగా అణచివేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. అసెంబ్లీ ముట్టడిని అడ్డుకొనేందుకు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్భంధం విదించారు.అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం రాజధాని ప్రాంతంలో రణరంగాన్ని తలపించింది.మహిళల పై పోలీసులు వికృతంగా విరుసుకు పడ్డారు. ఆంక్షల వలయం వున్నా,పోలీసులు ఎంత అడ్డగించినా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా మహిళలు పట్టు వీడకుండా పొలాలు,పొదలు,గుట్టలు,కాల్వలు దాటి వెళ్ళి అసెంబ్లీని ముట్టడించారు. పోలీసులు వెంట బడి లాటీ లతో చితక బాదారు.తాళ్ల తో అడ్డు కొన్నారు,కాళ్ళ తో తొక్కి హింసించారుఅయినా మహిళలు బెదరలేదు.
ఐపిఎస్ అధికారులు లాటీలు పట్టి మహిళల ను వెంబడించారు.మహిళలను పొలాల్లో ఈడ్చి పారేశారు. పోలీసులు లాటీలు విరుగుతున్నా ముందుకే వెళ్లారు తప్ప వెనకడుగు వేయలేదు అసెంబ్లీని ముట్టడించి తీరారు.మహిళల పోరాట స్పూర్తి ముందు పోలీసుల లాటీలు చిన్న పోయ్యాయి .చీమకూడా దూరని స్థాయిలో కట్టడి చేసినా మహిళల పట్టుదలే నెగ్గింది.
ఈ కార్యక్రమంలో మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి.కొందరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయ్యారు.మాపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని,లాటీలతో చెప్పలేని చోట కొట్టారని,రాజధానికోసం భూములు ఇవ్వడమేనా మేము చేసిన తప్పా అని కన్నీరు పెట్టారు మహిళలు.రాష్ట్ర రాజధానిగా రూపు రేఖలు ఏర్పడిన తరువాత మూడు రాజధానుల పేరిట రాజధానిని అంతర్ధానం చెయ్యడానికి పూనుకోవడం అనైతికం,అన్యాయం,వంచన కాదా అని ?రాజధానికి కి భూములిచ్చిన రైతులను సామూహికంగా హతం చెయ్యడం కాదాఅని ?అని 365 రోజులుగా వివిదరూపాల్లో అన్నదాతలు.మహిళలు ధర్మపోరాటం చేస్తున్నారు. జె ఏ సి మహిళా నేతలు డిల్లీ వెళ్ళి అమరావతి నే రాజధానిగా కొనసాగేందుకు మద్దతుగా నిలవాలని అన్నీ పార్టీల నాయకులను కలిసి మేమో రాండాలు ఇచ్చి వేడుకొన్నారు.
ప్రజలు ఎన్నోఆశలతో ఏరి కోరి తెచ్చుకొన్న ప్రభుత్వమే ఈ పాప కార్యానికి పూనుకొన్నది. సియం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన ఆంధ్రప్రదేశ్ లో 365 రోజులు గా ప్రకంపనలు సృష్టిస్తుంది. 2014 లో కొత్తగా ఏర్పడిన నవ్యాoధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు. ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది స్పష్టత లేదు. అయినా అధైర్య పడకుండా 13 జిల్లాలకు నడిబొడ్డున విజయవాడ -గుంటూరు మధ్య వున్న ప్రాంతాన్ని ఎంపిక చేసింది గత ప్రభుత్వం.విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే రాజధాని ఏర్పాటు చెయ్యాలని అప్పటి ప్రతిపక్షనాయకుడు గా వున్నజగన్ కూడా ప్రకటించారు. అప్పటి ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు,ప్రజలు ఎవ్వరు వ్యతిరేకించలేదు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో అసెంబ్లీ లో జగన్ హైదరాబాద్ లో 4-9-2014 న అధ్యక్షా విజయవాడలో కేపిటల్ సిటీ పెట్టడానికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కారణమేమంటే మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రమై పోయింది. 13 జిల్లాల ఈ చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానికి,మరొక ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అన్నారు.
అంతే కాదు కేపిటల్ సిటీని మీరు ఎక్కడన్నా పెట్టండి. అలా పెట్టె చోట కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని మెట్ట మొదట గత ప్రభుత్వానికి సలహా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డే. ఆనాడు ఆ విధంగా మద్దతు తెలిపి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని పై మాట మార్చి రాజధాని పై రగడ సృష్టించారు విజయవాడ – గుంటూరు మధ్య తుళ్లూరు,మంగళగిరి,తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో రాజధాని నిర్మాణం చెయ్యాలని అప్పటి ప్రభుత్వం తలపెట్టినా అందుకు అవసరమైన భూమిని సమకూర్చుకోవడం సాధ్యమేనా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమైంది.
కానీ నవ్యాoధ్ర నూతన రాజధాని నిర్మాణానికి మొట్ట మొదట తమ ప్రాణ పదాలు అయిన భూములు త్యాగం చేసి పునాది రాయి వేసింది రైతులే.నేడు ఆ రైతుల నోట్లో మట్టికొట్టడానికి సిద్దపడింది జగన్ ప్రభుత్వం. కొన్ని తరాల నుండి ఫలాలు అనుభవించి,భూమితో అనుభంధం పెంచుకుని, భవిష్యత్తుకు ఆధారమైన భూములను 33 వేల ఎకరాలను రాజధాని నిర్మాణానికి ఇచ్చి ఉపాధి కోల్పోయిన రైతుల త్యాగం వర్ణించలేనిది. రాజధానిని రాష్ట్ర నడిబొడ్డున ఏర్పాటు చెయ్యడమే కాక భౌద్దారామంగా వెలుగొందిన అమరావతిని రాజధానిని చెయ్యడం సర్వత్రా ఆమోదం వ్యక్తం అయింది.ఎటువంటి అభ్యంతరాలు వినిపించలేదు .రాజధాని ఏర్పాటు ఆర్ధిక భారమేకాక,భూసేకరణ తలకు మించిన భారం అయిన పరిస్తితుల్లో అమరావతి ప్రాంత చిన్న,సన్న కారు రైతులు ప్రభుత్వానికి పైసా ఖర్చు లేకుండా భూ సేకరణ ద్వారా భూములు ఇచ్చారు.ఎటువంటి ప్రతి ఘటన లేకుండా స్వచ్చందంగా ప్రభుత్వం మీద నమ్మకంతో 33 వేల ఎకరాలు భూములు ఇవ్వడం చరిత్రాత్మకం.గౌతమ బుద్దుడు నడయాడిన ప్రాంతంలో రాజధాని ఏర్పాటు కావడం పై రాష్ట్ర ప్రజలే కాక జాతీయ,అంతర్జాతీయంగా వున్న తెలుగు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు.కానీ 2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం భూములిచ్చిన రైతుల నమ్మకాన్ని,ప్రజాభీష్టాన్ని వమ్ము చేసి మూడు రాజధానులు అంటు దుర్మార్గపు చర్యకు,కుట్రకు పూనుకొన్నది.
రాజధానికి భూములు ఇచ్చిన రైతులను ఏడాదిగా రోడ్ల పాలు చేసింది.మహిళలు,వృద్దులు,పిల్లలు అని చూడకుండా నిర్ధాక్షిణ్యంగా లాటీ చార్జి చెయ్యడం,అక్రమ కేసులు బనాయించడం,అరెస్టులు,ఎస్సీ,ఎస్టీ,ఎట్రాసిటీ కేసులు పెట్టడం,రైతులకు సంకెళ్లు వెయ్యడం,జైళ్ళలో నిర్భందించడం,భూతులు తిట్టడం అమానుషం,అనాగరికం.అంధకారమైన తమ భవిష్యత్,తమపిల్లల భవిష్యత్ పై ఆందోళనకు గురైన రైతులు 365 రోజులుగా జీవన్మరణ పోరాటం చేస్తుంటే కనీసం వారి గోడు వినిపించు కోకుండా జగన్ ప్రభుత్వం నిరంకుశంగా,కర్కశంగా,వ్యవహరిస్తుoది,సర్వం త్యాగం చేసి, మహా మహు లకు జన్మనిచ్చిన ఈ తెలుగు గడ్డ పై ఇటువంటి అల్పులు పాలకులుగా ఉండటం ఒక విషాదంగా చెప్పుకోవాలి.
అట్లాగే నూతన రాజధాని ఏర్పాటు సమస్య మొదట్లోనే ఉత్పన్న మైతే కేంద్రం తనకు సంభందం లేదని తప్పుకొంటే అర్ధం వుంటుంది.కానీ విభజన జరిగి శాసన సభలో అన్ని పార్టీలు అమరావతే రాజధానిగా ఏకగ్రీవంగా తీర్మానం చేశాక,సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతులు మీదుగా రాజధానికి శంకుస్థాపన జరిగిన తరువాత,పది వేల కోట్లు ఖర్చు చేసి 40 శాతం నిర్మాణాలు జరిగాక,ఇండియా మ్యాపులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చేర్చాక మూడు రాజధానులు అంటు రాజధానిని నిరంకుశంగా విశాఖకు తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అయితే కేంద్రం తనకు సంభందం లేదనడం కుట్ర కాక మరేమీటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు,రాష్ట్రబిజెపి నాయకులు రాజధాని అమరావతి లో కొనసాగాలి అంటారు,కేంద్రం మాకు సంభధం లేదని కోర్టులో అఫిడవిట్ వేసింది. ఏమిటి డబల్ గేమ్ ఎవరిని మోసం చెయ్యడానికి?మూడు రాజధానులు అంటు జగన్ ఆడుతున్న కపట నాటకం వెనుక బిజెపి ది ప్రధాన పాత్ర వుంది. బిజెపి పాత్రలేకుండా ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చడానికి జగన్ సాహసం చెయ్యగలడా?మూడు రాజధానుల వెనుక వైసీపీ,బిజెపి కుట్రవుందని సామాన్యుడికి సైతం అర్ధం అవుతుంది.
మూడురాజధానులు నిర్ణయం రాజకీయ నిర్ణయం తప్ప,అభివృద్ది వికేంద్రీ కరణ కోసం మాత్రం కాదు.ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు పరిపాలన గాలికి వదిలేసి మూడు రాజధానుల వివాదం సృష్టించి ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించి వివాదాస్పద నిర్ణయాలతో కోట్లాది రూపాయల ప్రజాధానాన్ని కోర్టు కేసులకు తగుల బెడుతున్నారు.కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.రైతుల త్యాగాన్ని గుర్తించవలసిన ప్రభుత్వం వాళ్ళ బ్రతుకులను నడివీధిలో నిలబెట్టింది.నమ్మి భూములిచ్చి నందుకు వారి చెప్పుతో వారే కొట్టుకొనే దౌర్భాగ్యం కల్పించింది.జగన్ ప్రభుత్వం.రాజధాని అమరావతి అనేది అమరావతి ప్రాంత ప్రజలకు మాత్రమే కాదు.అయిదు కోట్ల ఆంధ్రుల సమస్య,కావునా అమరావతి రైతుల పోరాటానికి,ప్రజలు,ప్రజాస్వా మ్య వాదులు,మేధావులు మద్దతుగా నిలవాల్సిన సమయం ఇది. రాష్ట్రంలో స్వార్ధ రాజకీయం వికృతరూపం దాల్చింది. రాష్ట్ర ఏమైపోయినా పర్వాలేదు.మాకు రాజకీయ ప్రయోజనమే ముఖ్యమన్న విధంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రజల జీవితాలను బలిపెడుతున్నారు.ప్రాంతాలమధ్య విద్వేషాలు వికృత రూపం దాలిస్తే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చెయ్యాలన్న స్థాయికి పరిస్థితి చేరే అవకాశం లేకపోలేదు.ఇప్పటికే విభజన సంక్షోభం లో వున్న రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చెయ్యాలన్న ఉద్దేశ్యం జగన్ కి లేకపోగా మరింత అగాధంలోకి నెట్టారు. నేడు రాష్ట్ర భవిష్యత్తు ఏమిటని అందరూ బాధపడే పరిసితి కల్పించారు.జగన్ క్రూర రాజకీయం అయిదు కోట్ల ప్రజలకు శాపంగా మారింది.