ఆంధ్రలో జగన్ మద్యం బ్యాన్ చేస్తనని ఎపుడున్నడో గాని అప్పట్నుంచి తెలంగాణలో పండగ చేసుకుంటున్నారు. ఆంధ్రోళ్లే ధరలు విపరీతంగా పెంచేస్తే జనం తాగుడు మానేస్తారనుకున్నారు. ధరలు పెంచినాక సేల్స్ పడిపోయినాయ్. మద్యం బ్యాన్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నదని రూలింగ్ పార్టీవాళ్ల పండగ చేసుకున్నారు. సోషల్ మీడియా పోస్టుల మీద పోస్టులు పెట్టి, పాక్షిక మద్య నిషేదం ఫుల్ సక్సెస్ అయిందని, ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని పని ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నాడని ప్రచారం చేశారు. తీరా చూస్తే, ఆంధ్రలో సేల్స్ పడిపోయాయి గాని, తెలంగాణలో విపరీతంగా పెరిగినాయ్. అదే సమయంలో ఆంధ్రలో తాగుడు తగ్గలేదు. ఎంది కథ అని ఆలోచిస్తే, పోలీసోళ్లు రోజుకొక కథ లీక్ చేస్తున్నారు. ఆంధ్ర మందుమానేశారుగాని, తాగుడు మానేయలేదు. వాళ్లంత చక్కగా తెలంగాణ మందు తాగుతున్నారు. రోజు విపరీతంగా తెలంగాణ నుంచి మద్య అన్ని మార్గాల్లో చక్కగా ఆంధ్రలోకి పారుతూఉంది. రోజు పోలీసులు పట్టుకుంటున్న బాటిళ్లు చిన్న సాక్ష్యమే. పట్లుకోని బాటిళ్లు, చూసిచూడనట్లు పోతున్న బాటిళ్లు, రాత్రికి రాత్రికి రవాణా అవుతున్న బాటిళ్లు, ఆర్టీసీ బస్సుల్లో , రైళ్లలో వస్తున్నా బాటిళ్లు లెక్కలేనన్ని. ఇదితాజా సాక్ష్యం. కృష్ణాజిల్లా చిల్లకల్లులో పోలీసులు 450 తెలంగాణ మద్యం బాటిళ్లను స్వాదీనం చేసుకున్నారు.
కృష్ణాజిల్లా ఎస్పి ఎం రవీంద్రనాథ్ బాబు గారికి రాబడిన సమాచారం మేరకు నందిగామ డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో చిల్లకల్లు ఎస్ఐ వాసా వెంకటేశ్వరరావు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మురళి వారి సిబ్బందితో ముక్త్యాల గ్రామంలో కాకతీయ సిమెంట్ ఫ్యాక్టరీ రోడ్లో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం 450 క్వార్టర్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు నిందితులు ద్విచక్ర వాహనాలతో పరారైనట్లు వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని ఎస్సై తెలిపారు.
వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న వారిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ లో మద్యం ఆంధ్రతోపోలిస్తే కారు చౌక. తెలంగాణలో 160 రుపాయలు పెడితే, బీర్ బాటిల్ వస్తుంది. ఆంధ్రలో 250 రుపాయల లోపు ఏ బాటిల్ రాదు. దీనితో ఈ సారి తెలంగాణ మద్యం సేల్స్ ఆకాశాన్నంటే అవకాశం ఉంది. పదికాలాలు జగన్ ఇలాగే మద్య నిషేధం కఠినంగా అమలుచేయాలని తెలంగాణ మద్యం వ్యాపారులు కోరుకుంటూ ఉంటారేమో.
మొన్న సెప్టెంబర్ లో గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతంలోని మునుగోడు వద్ద ఏకంగా పదివేల తెలంగాణ మందు బాటిల్స్ ను ఆంధ్రపోలీసులు పట్టుకున్నారు. ఈ సీసాలన్నీ హైదరాబాద్ నుంచి అమరావతి ఒక వాటర్ ట్యాంకర్ లో రవాణా అవుతుండగా పోలీసులు కనిపెట్టారు. ఇంత పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతూ ఉందంటే ఎవరో పెద్ద తలకాయ దీని వెనక ఉండాలి. సాధారణ పోలీసులు తెలంగాణ మద్యం పట్టుకు వార్తలు చెబుతారు గాని, దీని వెనక ఉన్న పెద్ద తలకాయల పేర్లెపుడూ చెప్పరు.
తెలంగాణ నుంచే కాదు, ఒదిషా,తమిళనాడు,కర్నాటక, మహారాష్ట్ర, చత్తీష్ గడ్ లనుంచి కూడా ఆంధ్రకు లిక్కర్ అక్రమ రవాణా అవుతూ ఉందని ఆ మధ్య ఇండియా టుడే రాసింది.
ఇండియా టుడే రిపోర్టు ప్రకారం ఆంధ్రలో ఇలా లిక్కర్ స్మగ్లింగ్ చేస్తున్న వారిని 50 వేల మంది దాకా అరెస్టు చేశారు. లిక్కర్ స్మగ్లింగ్ చేస్తున్నవాహనాలను పట్టుకోవడం 636 శాతం దాకా పెరిగిందట. ఇదీ ఆంధ్రలో లిక్కర్ బ్యాన్.