విత్తనోత్పత్తిలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ( Regional Agricultural Research Station RARS) భూములను కొత్తగా ఏర్పాటుచేయాలనుకుంటున్న మెడికల్ కాలేజీకి కేటాయించి నిర్వీర్యం చేయవద్దని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.
నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయం నందు RARS భూముల పరిరక్షణకై ఆదివారం నాడు నంద్యాల పార్లమెంటు స్థాయి రైతు ప్రతినిధులతో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ ఈ రీసెర్స్ సెంటర్ కు 115 సంవత్సరాల ఘనచరిత్ర ఉందని, అది రు.1000 కోట్ల మూలధనంతో విరాజిల్లుతూ ఉందని అన్నారు. ఇలాంటి కేంద్రానికి భూములను మెడికల్ కాలేజీకి కేటాయించి రాయలసీమ మనసును నొప్పించవద్దని ఆయన అన్నారు.
ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంతవరకు ఉద్యమాన్ని ఉదృతం చేద్దామని దశరథరామిరెడ్డి పిలుపు నిచ్చారు.
అవసరమయితే, RARS భూములను కాపాడుకునేందుకు త్వరలో గ్రామగ్రామాన భిక్షాటన నిధులు సేకరించి, RARS భూములకు బదులు ఇతర స్థలాలను వైద్య కళాశాలకు కొనేలా నిరసన తెలుపుదామని ఆయన అన్నారు.
నంద్యాల ప్రాంతానికి హెరిటేజ్ గా వుంటూ కొత్త విత్తన వంగడాల ఉత్పత్తికి, వేలాది మంది రైతుల అభ్యున్నతికి ఉపయోగపడుతున్న ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం భూములను కొత్త వైద్యకళాశాలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించడం బాధని కలిగిస్తోందని ఆయన అన్నారు.
రైతు ఉన్నతికి దోహదపడుతున్న RARS భూములను కాపాడుకునేందుకు రాయలసీమ స్థాయిలో ఉద్యమాన్ని బలోపేతం చేసి వేలాదిమంది రైతులతో నంద్యాలను దిగ్భంధం చేద్దామని దశరథరామిరెడ్డి కోరారు.
అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన నంద్యాల RARS భూములను వైద్య కళాశాలకు కేటాయింపు పై త్వరలో విజయవాడలో అఖిలపక్ష రైతు సమావేశం నిర్వహించి RARS భూముల సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెలదామని దశరథరామిరెడ్డి అన్నారు. మన ప్రాంత M.P. మరియు M.L.A. లతో పాటు రాయలసీమ ప్రజా ప్రతినిధుల ద్వారా ముఖ్యమంత్రిపై RARS భూముల రక్షణకు ఒత్తిడి తెద్దామని ఆయన అన్నారు.
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం (Regional Agricultural Research Station RARS ) భూముల గురించి ముఖ్యమంత్రిని కలువాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి తీర్మానం
వేలాదిమంది రైతులు,ఉద్యోగులు, వ్వవసాయ కార్మికులు RARS పై ఆధారపడి జీవిస్తున్నారని వారి పొట్ట కొట్టవద్దని దశరథరామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఘనచరిత్ర కలిగిన నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం భూములను కాపాడుకునేందుకు త్వరలో గ్రామగ్రామాన కళాకారుల ద్వారా ప్రచారం చేపట్టి ప్రజలను చైతన్యం చేద్దామని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఈ సమావేశంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, పాల డైరీ మాజీ చైర్మన్ బాలీశ్వరరెడ్డి,కె.డి.సి.సి.డైరెక్టర్ బెక్కం రామసుబ్బారెడ్డి పాణ్యం మండల రైతు సంఘం నాయకులు వి.శంకరయ్య,యాగంటి బసవేశ్వరస్వామి రైతు సంఘం నాయకులు M.C.కొండారెడ్డి, అల్లూరు సర్పంచ్ ఆరికట్ల శివరామకృష్ణారెడ్డి, శిరివెల్ల మండల రైతు నాయకులు జయరామిరెడ్డి,లక్ష్నిరెడ్డి, వెలుగోడు మండల రైతు సంఘం నాయకులు నసరుల్లాఖాన్, గడివేముల మండల రైతు నాయకులు ఈశ్వరరెడ్డి,M.V.రమణారెడ్డిమరియు రైతులు పాల్గొన్నారు.