రెన్నెళ్లాగండి. వరంగల్ మహానగరానికి ఫిబ్రవరి నుంచి మంచిరోజులొస్తున్నాయ్.మంచిరోడ్లొస్తున్నాయ్. ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. ఇవిగో వివరాలు:
ఫిబ్రవరి నెల నుంచి ప్రతి రోజూ, ఇంటింటికీ స్వచ్ఛమైన మిషన్ భగీరథ మంచినీటిని అందిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు.
ఆదివారం హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయం ఆర్ అండ్ బి అతిథి గృహంలో వరంగల్ మహా నగర పాలక సంస్థ అభివృద్ధి పనులు, జరుగుతున్న ప్రగతి మీద సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షిస్తూ ఈమేరకు అధికారులకు ఆదేశాలుకూడా జారీ చేశారు.
సిబ్బంది, ఇతర సమస్యలేవున్నా వాటిని వెంటనే పరిష్కరించాల. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచినీటిని అందించే విధంగా అంకిత భావంతో కృషి చేయాలి. ప్రతి డివిజన్ లో సిసి రోడ్లు, డ్రైనేజీలు పూర్తి కావాలి. వరంగల్ నగరంలోని మొత్తం 58 డివిజన్లలో సిసి రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్ తదితర పనులన్నీ పూర్తి చేయాలి. రోడ్లు అద్దంలా ఉండాలి. పారిశుద్ధ్యం పటిష్టంగా నిర్వర్తించాలి. . ఇప్పటికే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను సద్వినియోగం చేయాలి. ఇటీవలి వరదల్లో తెగిపోయిన రోడ్లు, వరద, మురుగునీటి కాలువల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం 59 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో వెంటనే పనులు ప్రారంభించి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఎవరైనా కాంట్రాక్టర్లు సరిగా స్పందించకపోయినా, పనులు సకాలంలో పూర్తి చేయలేకపోయినా వెంటనే అలాంటి వారి టెండర్లను రద్దు చేసి, బ్లాక్ లిస్టులో పెట్టాలి.
ఇప్పటికే నగరంలో పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవాలకు కూడా ఏర్పాట్లు చేయాలి. ఇవి ఫిబ్రవరిలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. ఇంకా పూర్తి కాని వాటిని వేగంగా ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలి. అర్హులైన నిరుపేదలను అవసరమైతే లాటరీ పద్ధతిలో ఎలాంటి వాద వివాదాలకు తావులేకుండా ఎంపిక చేయాలి.
స్మార్ట్ సిటీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి
స్మార్ట్ సిటీ పనులలో వేగం పెంచి, నిర్దేశ గడువులోగా వాటిని పూర్తి చేయాలి. ముఖ్యంగా స్మార్ట్ రోడ్ల కింద ఆర్ 1, ఆర్ 2, ఆర్3, ఆర్4, పనులు జనవరి చివరి కల్లా పూర్తి కావాలి. నగరానికి నాలుగువైపులా ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. ఆయా అభివృద్ధి పనులు శీఘ్ర గతిన జరిగేలా కాంట్రాక్టర్ల వెంటపడి అధికారులు పనులు చేయాలి.