వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకుని శ్రీవారిని దర్శించుకోవచ్చునని తిరుమల తిరుపతి దెేవస్థానాల బోర్డు ప్రకటించింది.
తమ ఆరోగ్యాన్నిస్వయంగా బేరీజు వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని ఇక తిరుమల శ్రీవారి దర్శానానికి రావచ్చని టిటిడి ఒక ప్రకటన విడుదల చేసింది.
అయితే, ముందస్తుగా దర్శన టికెట్ల బుక్ చేసుకోవాలి. దర్శన టికెట్లు కలిగిన వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు. ఇలాంటి వారి కోసం ఎలాంటి ప్రత్యేక క్యూలైన్లు ఉండవని తెలియజేయడమైనది
కోవిడ్-19 నేపథ్యంలో లాక్డౌన్ అనంతరం 2020 జూన్ 8వ తేదీ నుండి వివిధ సంస్థలను తిరిగి తెరవడానికి భారత ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. 65 సంవత్సరాలు పైబడినవారు, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణులు, పదేళ్ల కంటే తక్కువ వయసుగల వారు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించింది.
అయితే, 65 ఏళ్లు పైబడినవారికి, 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు శ్రీవారి దర్శనం కల్పించాలని భారీ సంఖ్యలో మెయిల్స్ ద్వారా టిటిడికి అభ్యర్థనలు వస్తున్నాయి. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో కూడా అనేక మంది ఈ విషయంపై అభ్యర్థిస్తున్నారు. దర్శనానికి సంబంధించిన అభ్యర్థనల్లో చాలావరకు చిన్నపిల్లల కేశఖండన, చెవిపోగులు కుట్టడం, అన్నప్రాసన, షష్టిపూర్తి చేసుకున్నవారు, 70-80 సంవత్సరాల శాంతి చేసుకున్నవారు ఉంటున్నారు. ఇది భక్తుల ఆచారాలు, సంప్రదాయాలు, మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం. ఈ కారణాల రీత్యా 65 ఏళ్లు పైబడిన వారు, పదేళ్ల లోపు వారు కోవిడ్-19 సూచనలు పూర్తిగా దృష్టిలో ఉంచుకుని వారి ఆరోగ్యపరిస్థితులను బేరీజు వేసుకుని తగిన జాగ్రత్తలతో వారి సొంత నిర్ణయం మేరకు స్వామివారి దర్శనానికి రావచ్చు.