ఇంకా మిస్టరీ వీడని ‘ఏలూరు జబ్బు’

అనేక మందిని ఆసుపత్రి పాలు చేసిన ‘ఏలూరు జబ్బు’ ఏమిటో, ఎందుకొచ్చింది ఇంకా క్లూ దొరకలేదు. అనేకవైద్య బృందాలు,శాస్త్రవేత్తల బృందాలు ఆసుపత్రిలోచికిత్స పొందుతున్న రోగులను పరీక్షించి వెళ్ళాక తేలిందేమిటంటే మరింత లోతైన పరిశోధన జరగాలి అని.
 ఈ రోజు ఈ నిపుణుల బ‌ృందాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.  ఈ సమావేశంలో వారు వెళ్లడించిన వివరాలివి:
ఎయిమ్స్‌ న్యూఢిల్లీ:
16 శాంపిల్స్‌ను పరిశీలించాం, తాగునీటి శాంపిళ్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో లెడ్, నికెల్స్‌ లేవు, మరోసారి పరీక్షలు చేస్తున్నాం. ప్రాథమికంగా పాలలో నికెల్‌ కనిపించింది, దీనిపై మరింత పరిశీలన చేస్తున్నాం. కానీ బ్లడ్‌ శాంపిళ్లలో లెడ్, నికెల్‌లు కనిపించాయి. యూరిన్‌లో లెడ్‌ కనిపించింది.
పురుగు మందులు కూడా ఈ పరిస్థితికి దారి తీయొచ్చు. ఎందుకంటే పురుగు మందుల్లో భారీ లోహాలు ఉంటాయి. ఆర్గనో క్లోరిన్‌ ఉందా? లేదా? అని చెప్పడానికి సీఐఎస్‌ఎఫ్‌ఎల్‌కు పంపాం. ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది.
ఇండియన్‌ ఇనిస్టిస్ట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌:
21 తాగు నీటి శాంపిళ్లను ఒకటికి రెండు సార్లు పరిశీలించాం. తాగు నీరు క్లీన్‌ అని స్పష్టంగా చెప్తున్నాం. తాగు నీటి శాంపిళ్లలో లెడ్‌ కాని, ఆర్గనో క్లోరిన్‌ కాని, ఆర్గనో ఫాస్పేట్స్‌ కాని కనిపించ లేదు. బ్లడ్‌లో లెడ్, ఆర్గనో క్లోరైడ్స్‌ ఉన్నాయి. సిరమ్‌ శాంపిళ్లలో ఆర్గనో క్లోరిన్, ఆర్గనో ఫాస్పరస్‌ కనిపించాయి. ఆర్గనో క్లోరిన్స్, ఆర్గనో ఫాస్పరస్‌ రెండింటి వల్ల ఈ పరిస్థితి వచ్చిందని భావిస్తున్నాం.
ఎన్‌ఐఎన్, హైదరాబాద్‌
ఎన్‌ఐఎన్‌లో 9 మందితో కమిటీని ఏర్పాటు చేశాం.పురుగు మందుల అవశేషాలే కారణమని ప్రాథమిక అంచనా వేశాం. దీర్ఘకాలంలో పరిశోధన చేయాల్సి ఉంది. శాంపిల్స్‌పై ఇంకా విశ్లేషణ ఇంకా కొనసాగుతుందని వెల్లడి.
బియ్యంలో మెర్క్యురీ ఆనవాళ్లు అధికంగా కనిపించాయి, మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంది. టమోటాపైన కూడా పురుగు మందుల అవశేషాలు కనిపించాయి. ఆర్గనో పాస్ఫరస్‌ బ్లడ్‌లో కనిపించింది. ఎలా ఇవి మనుషుల శరీరంలోకి ప్రవేశించిందన్నదానిపై గుర్తించాల్సి ఉంది.
ఎన్‌ఈఈఆర్‌ఐ (నీరి). హైదరాబాద్‌: భూగర్భ జలాన్ని పరిశీలిస్తున్నాం. శాంపిళ్లు తీసుకున్నాం. పరీక్షల ఫలితాలు కొంత సమయం పడుతుంది.
మున్సిపల్‌ డిపార్ట్‌మెంట్, ఏపీ: 100కి పైగా శాంపిళ్లు తాగునీటిని చెక్‌ చేస్తే భారీలోహాలు కాని, ఆర్గనో క్లోరిన్స్‌గాని, ఆర్గనో ఫాస్పరస్స్‌ ఆనవాళ్లు కనిపించలేదు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనలు:
తాగు నీటి మీద ఒకటికి రెండు సార్లు పరీక్షలు చేయించండి
ఎక్కడా పొరపాటు జరగడానికి వీల్లేదు. ఒకటికి రెండు సార్లు ఖరారు చేసుకుండి. బ్లడ్‌ శాంపిళ్లలో లెడ్, ఆర్గనో క్లోరిన్, ఆర్గనో ఫాస్పరస్‌ కనిపిస్తోంది. ఎలా వచ్చిందన్నది కచ్చితంగా కనిపెట్టాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే.. ఇది ఎలా జరిగిందన్న దానిపై కచ్చితంగా కనిపెట్టాలి. ఈ కోణంలో అందరూ దృష్టి పెట్టాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కమిటీని వేశాం. ఈ అంశంపై పరీక్షలు చేస్తున్న వివిధ సంస్థలు, ఏజెన్సీలు, నిపుణులను సమన్వయం చేస్తూ ముందడుగు వేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *