కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ని కొనసాగించాలని ధర్నా

కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ చంద్రశేఖర్ గారిని కొనసాగించాలని అఖిల భారతీయ యాదవ మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎంవిఎన్ రాజు యాదవ్ డిమాండ్ చేశారు.
స్థానిక కర్నూలు నగరంలోని కలెక్టరేట్ ఎదుట అఖిల భారతీయ యాదవ మహసభ అధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జి నాగరాజు యాదవ్, లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు డేవిడ్, జనసేన జిల్లా నాయకులు పవన్ కుమార్, టీడీపీ ఎస్సీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ధరూర్ జెమ్స్, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు, హార్ట్ పౌండేషన్ సభ్యులు కెసి రాముడు, విద్యార్థి సంఘాల జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు, బిసి స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం మోహన్ తదితరులు పాల్గొని మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు జి నాగరాజు యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆ కారణంగా డాక్టర్ చంద్రశేఖర్ గారిని బదిలీ చేయడం సరైనది కాదన్నారు. బిసి సామాజిక వర్గానికి చెందిన నిజాయితీ గల సీనియర్ డాక్టర్ చంద్రశేఖర్ గారని అలాంటి వ్యక్తిని కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం పక్కన పెడుతున్నారని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఎసిబి కేసులో ఉన్న కంటి ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నరేంద్ర నాథ్ రెడ్డి గారిని సర్వజన వైద్యశాల సూపర్డెంట్ గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలతో ఎసిబి కేసులో ఉన్న వారికి కీలక పోస్టులలో నియమించరాదన్న నిబంధనలు వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు.
జనసేన జిల్లా నాయకులు పవన్ కుమార్ మాట్లాడుతూ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హోదాలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గా కొనసాగుతున్న డాక్టర్ చంద్రశేఖర్ గారిని అకారణంగా తొలగింపు కారణం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ఒకే సామాజిక వర్గానికి అన్ని ఉన్నతస్థాయి పదవులు కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో యాదవులకు, బిసిలకు ఎక్కడ అన్యాయం జరిగినా జనసేన అండగా ఉంటుందని, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ చంద్రశేఖర్ గారిని తిరిగి నియమించే వరకు జరిగే పోరాటానికి జనసేన మద్దతు ఉంటుందని తెలిపారు.
లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు డేవిడ్ మాట్లాడుతూ బీసీలకు 50 శాతం నామినేటెడ్ పోస్టులు అంటున్న వైసిపి, సీనియారిటీ జాబితాలో ఉన్న ఒక నిజాయితీ గల ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ గారికి వచ్చిన మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ పోస్టు నుండి తొలగిస్తూ, నరేంద్రనాథ్ రెడ్డి గారిని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టీడీపీ ఎస్సీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ధరూర్ జెమ్స్ మాట్లాడుతూ పేదల బియ్యాన్ని కబళించే వ్యక్తిగా, దొంగ ఆదాయ లెక్కలు చూపిస్తూ అక్రమ సంపాదనతో నేరారోపణలు ఎదుర్కొంటున్న నరేంద్ర నాథ్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వం ఏ అర్హత చూసి జనరల్ హాస్పిటల్ సూపర్డెంట్ గా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చిందో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు సమాధానం చెప్పాలని, లేని పక్షంలో జిల్లా పర్యటనలో వారిని అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతిభ ఆధారంగా బీసీలు ఏ పదవిలో ఉన్న వారిని ట్రాన్స్ఫర్ రూపంలో బదిలీ చేయడం లేదా పదవి నుంచి తొలగిస్తూ ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు ఎంవిఎన్ రాజు యాదవ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం యాదవులను అణగ తొక్కాలని చూడటం సరైనది కాదని, ప్రతి నియోజకవర్గంలో 10 నుండి 15 వేల మంది యాదవులు ఉన్నారని, వైసీపీ తీరు మార్చుకోక పోతే భవిష్యత్తులో యాదవ సత్తా చూపిస్తామని అన్నారు. బీసీల అభివృద్ధికి తోడ్పాటు అందించే జడ్పీటిసి, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ వంటి ప్రాముఖ్యమైన పదవులలో బీసీలకు అన్యాయం చేస్తూ ఎటువంటి అధికారం, ప్రాధాన్యత లేనటువంటి సామాన్యమైన బీసీ కార్పొరేషన్ చైర్మన్ల పదవులను ఆర్బాటంగా నేటి ప్రభుత్వం ప్రకటించడం ఎంతో విచారకరమన్నారు. ఇదే విధమైన ధోరణిని ఈ ప్రభుత్వం సాగిస్తే బీసీలంతా ఏకమై ప్రభుత్వాన్ని కూల్చే విధంగా తిరుగుబాటు చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోయాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు జి అయ్యన్న యాదవ్, కురువ సంఘం నాయకులు నగేష్, ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షులు బలరాం, ఎఐవైఎఫ్ జిల్లా జాయింట్ సెక్రేటరీ చంద్ర శేఖర్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *