డిసెంబరు 16 నుంచి ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు, తిరుప్పావై ప్రవచనాలంటే…

డిసెంబరు 16 నుంచి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు
తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 141 కేంద్రాలలో

 

 

పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి జనవరి 13వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 141 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు.
ధనుర్మాసం సందర్భంగా టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ఈ ధనుర్మాసంలో సుప్రభాతం బదులుగా తిరుప్పావై నివేదించడం విశేషం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో నారాయ‌ణ‌వ‌నంలోని శ్రీ హ‌రేరామ హ‌రేకృష్ణ ఆల‌యం, కుప్పం మండ‌లం గుడిప‌ల్లిలోని శ్రీ యామ‌గానిప‌ల్లెలో గ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయాల్లో ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాల్లో ప్రవచన కార్యక్రమాలు జరుగనున్నాయి.
ధనుర్మాసం దేవతలకు బ్రహ్మముహూర్తం. ఈ బ్రహ్మముహూర్తాన్ని అనుసరించి 12 మంది ఆళ్వారులలో ఒకరైన గోదాదేవి ధనుర్మాసం వ్రతం పాటించారు. దేశ సుభిక్షాన్ని, లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ గోదాదేవి శ్రీకృష్ణునిలో ఐక్యమవ్వాలనేది ఈ వ్రతం ఉద్దేశం. ఈ వ్రతం పాటించడం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుంది. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కందంలో పేర్కొనబడింది.
ఈ వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ని గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లోకానికి అందించారు. ఈ తిరుప్పావై సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే. ఈ వ్రతం ఒకరు చేయడం కాకుండా అందరినీ కలుపుకుని చేస్తే గొప్ప విశేషం. ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *