వైసిపి అవినీతిని బైటపెట్టినందుకే సి.ఆర్ పిఎఫ్ మాజీ కానిస్టేబుల్ గురుప్రతాప్ రెడ్డి హత్య
గండికోట పరిహారం చెల్లింపులో అక్రమాలు బైటపెట్టాడనే కక్షతోనే గురుప్రతాప్ రెడ్డి హత్య జరిగింది
(నారా చంద్రబాబు నాయుడు)
పేదలను హింసించడం, మరీ ముఖ్యంగా హతమార్చడం రాష్ట్రంలో సర్వ సామాన్యంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు నేరాల సంఖ్య రోజురోజుకూ మితిమీరిపోతున్నా, శాంతిభద్రతలు గణనీయంగా క్షీణిస్తున్నా, భయానక నేరాలపై కూడా దృష్టిపెట్టక పోవడం గర్హనీయం.
హింసాత్మక యంత్రాంగాన్ని, అల్లకల్లోలం చేసే యంత్రాంగాన్ని అధికార వైసిపి నెలకొల్పినట్లుగా రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే అనిపిస్తోంది. అధికారపార్టీ అవినీతిపై ప్రశ్నించినవారిని లక్ష్యంగా చేసుకుని వేధించడం, హింసించడమే కాకుండా,హత్యలు కూడా చేస్తున్నారు.
అధికార పార్టీ అవినీతి కుంభకోణాలు బైటపెట్టారనే కక్షతో ఆ సమాచారం వెల్లడించిన వారిని( విజిల్ బ్లోయర్స్) లక్ష్యంగా చేసుకోవడం, హతమార్చడం అతిదారుణం.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపూర్ మండలం పెంజిఅనంతవరంకు చెందిన గురు ప్రతాప్ రెడ్డి (47)గతంలో సిఆర్ పిఎఫ్ లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశాడు. గ్రామంలో ఇసుక రీచ్ లో అక్రమాలను, గండికోట ప్రాజెక్టు ముంపు బాధితులకు పరిహారం చెల్లింపుల్లో అవినీతిని గమనించాడు. ఒక్కో కుటుంబానికి రూ10లక్షల చొప్పున 677కుటుంబాలకు పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
కానీ ఆ గ్రామంలోని కుటుంబాల సంఖ్య సుమారు 350మాత్రమే కాగా, ముంపు కుటుంబాల సంఖ్యను కావాలనే 677కు పెంచేసి, తద్వారా అదనపు సొమ్ము స్వాహాకు తెరదీశారు. మాజీ సిఆర్ పిఎఫ్ కానిస్టేబుల్ అయిన ప్రతాప్ రెడ్డి ఈ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ తో సహా రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ అవినీతి అక్రమాలపై నిజానిజాల నిర్ధారణకు డిప్యూటి కలెక్టర్ రోహిణి ఇద్దరు తహశిల్దార్లతో సహా 13నవంబర్ 2020న గ్రామసభను నిర్వహించారు.
పరిహారం చెల్లింపు జాబితాలో సుమారు 300మంది అనర్హుల పేర్లు చేర్చారని గురు ప్రతాప్ రెడ్డి గ్రామసభలో చెప్పేటప్పుడే ఇందులోని ప్రధాన నిందితులు తమ అనుచరులతో సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు, అంతరాయాలు కల్పించారు. ఈ అక్కసు మనసులో పెట్టుకునే గురుప్రతాప్ రెడ్డిపై కక్షతో ఎక్కడైతే గ్రామసభ జరిగిందో అదే ఆలయంలో గురుప్రతాప్ రెడ్డిని కిరాతకంగా హత్య చేశారు.
ఈ హత్యను ఫాక్షన్ హత్యల్లో భాగంగా ప్రభుత్వమే చిత్రించాలని చూస్తోంది, కానీ వాస్తవానికి ఈ హత్య అవినీతి కుంభకోణాన్ని వెల్లడించడం వల్ల జరిగిన హత్య, ప్రజాధనం భారీఎత్తున స్వాహా చేయడాన్ని బైటపెట్టడం వల్ల జరిగిన హత్య. గురుప్రతాప్ రెడ్డి ఒక విజిల్ బ్లోయర్ గా గండికోట రిజర్వాయర్ ముంపు బాధితుల పరిహారం చెల్లింపులో జరిగిన అవినీతి కుంభకోణాన్ని బైటపెట్టి బాధ్యతగల పౌరుడిగా దేశం పట్ల తన విధి నిర్వర్తించాడు. అవినీతి కుంభకోణాల్లో హత్యలు కూడా జరిగేస్థాయికి వచ్చిందంటే, ఇక రాష్ట్రంలో నేరాలు-ఘోరాలు ఏ స్థాయికి చేరాయో ఎవరైనా అర్ధం చేసుకోవచ్చు.
విజిల్ బ్లోయర్ గా తన కళ్లెదుట జరిగే అవినీతిని బైటపెట్టిన ఒక మాజీ సిఆర్ పిఎఫ్ కానిస్టేబుల్ నే హతమార్చారంటే రాష్ట్రంలో అవినీతి మూకలు ఏ స్థాయిలో రాజ్యమేలుతున్నాయో తెలుస్తోంది. గురుప్రతాప్ రెడ్డి దేశం కోసం సిఆర్ పిఎఫ్ లో ధైర్యంగా పని చేసినప్పటికీ, మనరాష్ట్రంలో అవినీతిపై పోరాడినందుకు, అక్రమాలు బైటపెట్టినందుకు హత్యకు గురయ్యాడు. విజిల్ బ్లోయర్స్ ను, అవినీతిని నిగ్గదీసేవాళ్లను ఈవిధంగా వేధింపులకు గురిచేయడం, హతమార్చడం, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా(చట్టబద్ద పాలన)పై ప్రజల విశ్వాసాన్ని గండికొట్టడమే.
ఈ నేపథ్యంలో, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నిలబెట్టడం, ప్రజల్లో పోయిన విశ్వాసాన్ని పాదుగొల్పడం ప్రస్తుత తరుణంలో అత్యంత అవశ్యకం.
(మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయం విడుదల చేసిన లేఖ పాఠం)