(పిళ్లా కుమారస్వామి)
తెలుగు వారంతా మద్రాసు రాష్ట్రం నుండి విడివడి ఒకే పరిపాలన క్రిందకు రావాలని ఆనాటి తెలుగు ప్రజల కోరుకున్నారు. తెలుగు భాషా సాంస్కృతిక సాహిత్య ఉద్యమాలు ఒకవైపు, పొట్టి శ్రీరాములు వంటి మహానీయుల త్యాగాలుమరో వైపు, అనేక ప్రజా ఉద్యమాలు, కమ్యూనిస్టుల సుదీర్ఘ పోరాటాల నేపథ్యంలో 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.
కమ్యూనిస్టులు “విశాలాంధ్రలో ప్రజారాజ్యం” అన్న నినాదం ఇచ్చారు. విశాలాంధ్ర ఏర్పడింది గానీ ప్రజారాజ్యం రాలేదు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి, అధికారంలోకి వచ్చిన పార్టీలు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయలేకపోయాయి. ముఖ్యంగా తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర లు అభివృద్ధి లో వెనుకబడినాయి.
అన్నపూర్ణగా పేరుగాంచిన ఉమ్మడి రాష్ట్రంలో నూటికి 74మంది పౌష్టికాహారం తినడం లేదని ప్రభుత్వ లెక్కలతోనే ప్రొఫెసర్ ఉత్సా పట్నాయక్ తెలియజేశారు. పొగాకు, పత్తి వంటి వాణిజ్య పంటలు వేసిన రైతులు కాక ఇతర రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది.ప్రజలకు విజ్ఞానం అందించటంలో కాదు, అందరికీ కనీసం అక్షర జ్ఞానం కలిగించ లేదు. అక్షరం నేర్చుకున్న ఆ కొందరికైనా ఉపాధి చూపలేక పోయారు.
అభివృద్ధి కేవలం హైదరాబాదు వరకే పరిమితమైపోయింది. ఫ్లైవోవర్లు, హైటెక్ సిటీలు, మెట్రోరైల్లు, పరిశ్రమలు అన్నీ హైదరాబాదుకే పరిమితం చేయడంలో అభివృద్ధిలో అసమానతలు పెరిగి ప్రజల్లో అనంతృప్తి పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని పార్టీలు తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేశాయి.తెలుగుదేశం రెండు కళ్ల సిద్ధాంతం చెప్పింది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్యాయం అంది. సిపిఐ, కాంగ్రెస్,బి.జెపిలు విభజనను సమర్థించాయి.సి.పి.యం. విభజన సరికాదని చిన్న రాష్ట్రాల ఏర్పాటు సరైంది కాదని చెప్పింది. ఎమ్.ఐ.ఎం. విభజన వద్దని కోరింది.
విభజన విధానం సహేతుకంగా జరగలేదు. ఎన్నో డ్రామాల మధ్య జరిగింది. రెండో ఎస్.ఆర్.సి. అన్నారు. అదీ వేయలేదు. శ్రీ కృష్ణ కమిటీ ఏర్పాటు చేసినారు. ఆ కమిటీ నివేదిక ఇవ్వకనే విభజన చేశారు. కాంగ్రెస్, బి.జె. పి. పార్టీలు రెండూ కలిసి పార్లమెంటు లో తలుపులు వేసుకుని ఆమోదించాయి.తెలుగు దేశం, వైఎస్ఆర్ పార్టీలు సూత్రప్రాయంగా ఆమోదించాయి.
ఇలా వివిధ పార్టీల ఉద్యమాలతోనూ, ఇతర పార్టీల పిల్లిమొగ్గలతోనూ, ఆనాటి కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ను 2004లో రెండుగా విభజించింది. అవేనేడు తెలంగాణా రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
ఎవరెన్ని చెప్పినా విభజన జరిగిపోయింది.
తెలుగుజాతి విడిపోయాక రెండుగ వెలుగు జాతిగా ముందడుగు వేస్తుందని అందరూ ఆశించారు.సమైక్యాంధ్ర కోసం పోరాడి ఓడిన రాయలసీమ వాసుల్లో నిరాశ ఏర్పడింది.
రెండు రాష్ట్రాలుగా విడిపోయాక పరిస్థితిని గమనిస్తే తెలంగాణకు ఆదాయ వనరులు మస్తుగా వున్నాయిగానీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ఆదాయవనరులు తెలంగాణాతో పోలిస్తే తక్కువ. అంతే గాక ఆంధ్ర ప్రదేశ్ కు రాజధాని నిర్మాణం చాలా ఖర్చుతో కూడిన పని. పైగా కేంద్రం సాయం అంతంత మాత్రమే. ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినపుడు సహజ న్యాయమైన పద్ధతిలో వాటాలు పంచుతారు.
కాని రాష్ట్ర విభజనలో అలాంటి న్యాయ సూత్రం పనిచేయలేదు. అందువల్ల నేడు ఆంధ్రప్రదేశ్ నిధుల్లేక చతికిలపడింది.
చిన్న రాష్ట్రాలు పరిపాలనా వ్యయాన్ని భరించలేవు. కేంద్రాన్ని నిరంతరం అడుక్కుంటూ కేంద్రం కనుసన్నల్లో మెలగాల్సి ఉంటుంది. అందుకోసం తెలుగు దేశం ప్రభుత్వం కేంద్రంలోని
బిజెపి ప్రభుత్వం తో పొత్తు పెట్టుకున్నారు.కానీ కేంద్రం నుంచి అందిన సాయం అంతంత మాత్రమే.గత్యంతరం లేని పరిస్థితిలో ప్రైవేట్ కంపెనీల ముందు పరిశ్రమలు పెట్టండని అని విదేశీ సంస్థల వెంటపడింది చంద్రబాబు ప్రభుత్వం.ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి చేతులెత్తేసింది కేంద్రం.
చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక హోదా సాధించలేక ప్రత్యేక నిధులు ఇమ్మని అదేమేలని కోరింది.కానీ వచ్చిన నిధులు
కూడా అంతంత మాత్రమే.రాయితీలులేక పోవడంతో వచ్చే విదేశీ సంస్థలు రాష్ట్రాల మధ్య పోటీ పెంచి, కుప్పలు తెప్పలుగా రాయితీలు పొందుతున్నాయి. దాంతో చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సంక్షేమ రాష్ట్రంగా గాక సంక్షోభ రాష్ట్రంగా మాత్రమే మిగిలిపోయింది.
చంద్రబాబు ప్రభుత్వం తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పింది.కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వినతులతో సరిపెట్టుకుంది. దాంతో కేంద్రం రాష్ట్రాభివృద్ధి కి కేంద్ర సాయం లేక అప్పుల రాష్ట్రంగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ది కోసం శ్రీ కృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర విభజన లో పొందు పరిచిన విధంగా ఉక్కు కర్మాగార నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి,పరిశ్రమల స్థాపనకు తగినన్ని నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది.దీన్ని సాధించడానికి జగన్ ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇతర పార్టీలు రాజకీయాల కతీతంగా మద్దతు ఇవ్వాలి.
(ఇందులో వ్యక్తీకరించినవి రచయిత సొంత అభిప్రాయాలు. ట్రెండింగ్ తెలుగున్యూస్ అభిప్రాయాలుగా వాటిని స్వీకరించరాదు)
(పిళ్లా కుమారస్వామి,రచయిత, రాజకీయ పరిశీలకుడు, అనంతపురం జిల్లా)