తిరుప‌తి థియేట‌ర్ల‌కు సినిమా క‌ష్టాలు (తిరుప‌తి జ్ఞాప‌కాలు -13)

(రాఘ‌వ‌శ‌ర్మ‌)
లాక్‌డౌన్‌ వ‌ల్ల సినిమా హాళ్ళ‌న్నీ  గత మార్చి చివరలో మూత‌ప‌డ్డాయి. ఎనిమిది నెల‌లుగా అవి తెరుచుకున్న‌ పాపాన పోలేదు. వెండి తెర మంద‌హాసం ఇప్ప‌ట్లో  కనిపించేలా లేదు. క‌రోనాకు ముందే తిరుప‌తిలో థియేట‌ర్ల‌కు సినిమా క‌ష్టాలు మొద‌ల‌య్యాయి.
ఇక్క‌డ స‌గం పైగా సినిమా హాళ్ళు ప‌దేళ్లుగా మూత‌ప‌డుతూ వ‌స్తున్నాయి. తిరుప‌తిలో తొలి టూరింగ్ టాకీస్ బాలాజీ కొటాయ్‌.
ఆ టూరింగ్ టాకీస్  ప్రాంతంలోనే శ్రీ‌బాలాజీ టాకీస్ క‌ట్టారు.హైద‌రాబాదుకు చెందిన దాని య‌జ‌మానులు మూడేళ్ళ క్రితం దీన్ని మూసేశారు.
ఈ బాలాజీ టాకీస్ ప్రాంతం క‌ల్యాణ మండ‌పంగానో,  షాపింగ్‌ కాంప్లెక్స్ గానో అవ‌తార మెత్త‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. మ‌రో  పురాత‌న‌మైన సినిమా హాలు మ‌హావీర్.
ఈ సినిమా  హాలు ఉన్న స్థ‌లాన్ని ఉత్త‌ర భార‌త‌దేశానికి చెందిన వారు టీటీడీ వ‌ద్ద‌ 99 ఏళ్ళకు లీజుకు తీసుకున్నారు. లీజు కాలం పూర్తి కావ‌డంతో, కోర్టు తీర్పు మేర‌కు ఆ స్థ‌లం ఖాళీ చేయాల్సి వ‌చ్చింది. దీంతో మ‌హావీర్ టాకీస్ కాస్తా నేల‌మ‌ట్ట‌మై కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయింది. టీటీడీ ఇప్పుడిక్క‌డ షాపింగ్ కాంప్లెక్స్‌ క‌ట్టింది.
ఒక‌ప్పుడు దాన్ని మ‌హావీర్ టాకీస్ ప్రాంతం అనేవారు.పాత త‌రం వారు ఆ ప్రాంతాన్ని ఇప్ప‌టికీ ఆ పేరుతోనే పిలుస్తున్నారు.కానీ, కొంద‌రు  ఇప్పుడు దాన్ని ప్రెస్ క్ల‌బ్ ప్రాంత‌మంటున్నారు.
దాదాపు నాలుగు ద‌శాబ్దాలుగా అల‌రించిని శ్రీ‌వేంక‌టేశ్వ‌ర టాకీస్ ఏడేళ్ళ క్రితం మూత‌ప‌డింది.బ‌స్టాండ్‌, రైల్వే స్టేష‌న్ స‌మీపంలో ఉన్న  రైల్వే గేటు శాశ్వ‌తంగా మూత‌ప‌డింది. ఫ‌లితంగా యాత్రికులతో పాటు స్థానికుల‌ రాకపోక‌లు ఆగిపోయి ఈ సినిమా హాలు  మూత‌ప‌డింది. ప్ర‌స్తుతం టూరిస్టు బ‌స్సుల పార్కింగ్ గా  ఉప‌యోగ‌ప‌డుతోంది.
ఐఎస్ మ‌హ‌ల్ , జ్యోతి కొటాయ్ ప‌క్క‌ప‌క్క‌నే ఉన్న క‌వ‌ల పిల్ల‌ల్లాంటి సినిమా హాళ్ళు.
ముందు జ్యోతీ టాకీస్ మూత‌ప‌డింది. ఆ ప్రాంతంలో పెద్ద అపార్ట్ మెంట్ నిర్మించారు.ఇంగ్లీషు సినిమాల‌తో అల‌రించిన‌ ఐఎస్ మ‌హ‌ల్ కూడా ఇప్పుడు నేల‌మ‌ట్ట‌మైంది.అక్క‌డ కూడా అపార్ట్‌మెంట్ నిర్మాణానికి ప‌నులు జ‌రుగుతున్నాయి.
చాలా ఏళ్ళ క్రిత‌మే రామ‌కృష్ణా డీల‌క్స్  మూత‌ప‌డి,  అక్క‌డ ఒక పెద్ద అపార్టు మెంటు వెలిసింది.ఆ ప్రాంతాన్ని ఇప్ప‌టికీ రామ‌కృష్ణ డీల‌క్స్ ప్రాంత‌మ‌నే అంటున్నారు.వి.వి. మ‌హ‌ల్లో ఎన్నో సార్లు ప‌నోర‌మ చిత్రాల‌ను ప్ర‌ద‌ర్శించారు. శుభ్ర‌త‌ను పాటించ‌డంలో ఈ సినిమా హాలుకు అనేక  అవార్డులు  వ‌చ్చాయి.అయిన‌ప్ప‌టికీ క‌రోనాకు ముందే ఈ సినిమా హాలు  మూత‌ప‌డింది.
లీలా మ‌హ‌ల్ ప‌రిస్థితి కూడా అంతే. లీలామ‌హ‌ల్ మూత‌ప‌డినా, ఆ ప్రాంతానికి లీలామ‌హ‌ల్ సర్కిల్ అన్న పేరు స్థిర‌ప‌డిపోయింది.
బ్లిస్ వెనుక భాగంలో నిర్మించిన ‘జ‌య‌భార‌త్’ ఆ ప్రాంతం వారికి త‌ప్ప పెద్ద‌గా ఎవ‌రికీ తెలియదు.ఇది కూడా మూత‌ప‌డింది.
డీఆర్ మ‌హ‌ల్ సినిమా హాలును రిల‌య‌న్స్ వాళ్ళు కొని బిగ్‌సీ పేరుతో పున‌రుద్ధ‌రించారు.వాళ్ళు కూడా న‌డ‌ప‌లేక దీన్ని మూసేశారు.
దీనికి బిగ్‌సీ అన్న కొత్త పేరు వ‌చ్చినా, అది ఉన్న‌ ప్రాంతాన్ని ఇప్ప‌టికీ డీఆర్ మ‌హ‌ల్ ప్రాంత‌మ‌నే  అంటారు.
శ్రీ‌నివాసం థియ‌ట‌ర్ కూడా  ఇలాగే మూత‌ప‌డింది.విఖ్యాత్‌, జ‌గ‌త్  రెండు సినిమా హాళ్ళున్న భూమా కాంప్లెక్స్ కూడా క‌రోనా దెబ్బ ప‌డ‌క‌ ముందే ప‌డ‌కేసింది. ఈ సినిమా హాళ్ళ‌పైన ఆధార‌ప‌డిన సిబ్బంది ఉపాధి కోల్పోయి ఇబ్బందుల పాల‌య్యారు.
మూత‌ప‌డిన సినిమా హాళ్లు ఒక‌టొక‌టిగా  భౌతిక ఆన‌వాళ్ళు కోల్పోతున్నాయి.హైద‌రాబాదులో ఇప్పుడు లిబ‌ర్టీ టాకీస్ లేక‌పోయినా, ఆ ప్రాంతాన్ని లిబ‌ర్టీ  అంటున్నారు.
అలాగే తిరుప‌తిలో కూడా ఈ సినిమా హాళ్ళు మూత‌ప‌డినా, ఆ ప్రాంతాల‌కు ఆయా సినిమా హాళ్ళ పేర్లే స్థిర ప‌డిపోయాయి.
తిరుప‌తి స్థ‌ల చ‌రిత్ర‌లో అవి మైలు రాళ్ళుగా మిగిలిపోయాయి.ఇక మిగిలిన‌వి గుప్పెడు సినిమా హాళ్ళే!
గ్రూప్ థియేట‌ర్స్ గా పేరు ప‌డ్డ ఆరు థియేట‌ర్లు, వాటి సందులో ఉన్న జ‌య‌శ్యామ్‌, వేల్‌రామ్స్‌, గ్రూప్ థియేట‌ర్ల‌ ప‌క్క‌నే ఉన్న పీజీఆర్, మున్సిప‌ల్ ఆఫీసు స‌మీపాన ఉన్న దేవేంద్ర థియేట‌ర్‌,  రాయల చెరువు రోడ్లో ఉన్న ప‌ళ‌ణీ థియేట‌ర్‌ మాత్ర‌మే మిగిలాయి. ఈ సినిమా హాళ్లు కూడా క‌రోనా వ‌ల్ల ఎనిమిది నెల‌లుగా మూత‌ప‌డ్డాయి. వాచ్‌మ‌న్‌ల‌ను త‌ప్ప మిగ‌తా సిబ్బందినంతా పంపించేశారు.
 వీటిపైన ఆధార‌ప‌డిన చాలా మంది ఉపాధిని కోల్పోయారు.
సినిమా హాళ్ళ నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చినా, తెర‌వ‌డానికి వాటి య‌జ‌మానులు సాహ‌సించ‌డం లేదు.ఈ ఏడాది అవి తెరుచుకునేలా క‌నిపించ‌డం లేదు. తెలంగాణా రాష్ట్రంలో మాత్రం శుక్రవారం నుంచి సినిమా హాళ్లు తెరవనున్నారు.
ఈ సినిమా హాళ్ల‌ను ఇప్పుడు తెరిచినా, వేయ‌డానికి పాత సినిమాలు త‌ప్ప కొత్త‌గా రిలీజ్ అవుతున్న‌ సినిమాలు లేవు.
క్రిస్‌మ‌స్ కో, సంక్రాంతికో ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే,  ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా హాళ్ళ‌ను తెర‌వాల‌న్న ఆలోచ‌న‌లో వాటి య‌జ‌మానులు ఉన్నారు.
 సినిమా హాళ్ళు తెర‌వ‌డానికి  విజ‌య‌వాడ‌లోని ఫిలిం ఛాంబ‌ర్ ఇంకా ఒక నిర్ణ‌యానికి రాలేదు.
ఒకవేళ డిసెంబర్ 4 నుంచి  తెరిచినా ఏమేర‌కు ఆడించ‌గ‌ల‌మ‌నే అనుమానాలు వాటి య‌జ‌మానుల‌ను  వెంటాడుతున్నాయి.
క‌రోనా నిబంధ‌న‌ల మేర‌కు స‌గం సీట్ల‌కే అనుమ‌తిస్తే, స‌గం టికెట్లే అమ్ముకోవాలి.అలా చేస్తే, వ‌చ్చే  ఆదాయం క‌రెంటు ఖ‌ర్చుల‌కు, సినిమా హాళ్ళ నిర్వ‌హ‌ణ‌కు అయినా స‌రిపోతుందా అన్న‌ది వారి అనుమానం!
మూతపడిన వేంకటేశ్వర టాకీస్
క‌రోనా  వ‌ల్ల ఇదివ‌ర‌లా ప్రేక్ష‌కులు వ‌స్తారా అన్న‌ది కూడా అనుమాన‌మే!
మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడులో సినిమా హాళ్ళు తెరుచుకున్నా వాటి మ‌నుగ‌డ ఆశాజ‌న‌కంగా లేదు. క‌రోనా వాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు హాలు నిండుతుంద‌న్న‌ న‌మ్మ‌కమూ లేదు.
క‌రోనా కంటే ముందే సినిమా థియేట‌ర్ల‌పై ఆన్‌లైన్ యాప్స్‌ దెబ్బ ప‌డింది.ఇంట్లోనే కూర్చుని అమెజాన్‌, నెట్‌ఫిక్స్‌, హాట్‌స్టార్‌, ఆహా వంటి యాప్స్ లో కారు చ‌వ‌క‌గా సినిమాలు చూ డవచ్చు.నెల‌కు 120 రూపాయ‌లు క‌డితే చాలు,నెల పొడ‌వునా ఎన్ని సినిమాలైనా చూడ‌వ‌చ్చు. సంవ‌త్స‌రానికి 360 రూపాయ‌లు క‌డితే చాలు రిలీజ్ సినిమాలు కూడా  చూడ‌వ‌చ్చు.
రోజుకు రూపాయి ఖ‌ర్చు చేస్తే ఈ యాప్స్ ద్వారా విసుగు విరామం లేకుండా  సినిమాలు చూడ‌వ‌చ్చు. ‘ఆహా’ యాప్‌లో తెలుగు సినిమాలు మాత్ర‌మే దొరుకుతాయి.
మిగ‌తా వాటిలో అన్ని సినిమాలూ ఉంటాయి.పాత సినిమాలు త‌ప్ప రిలీజ్ సినిమాలు రాని యూట్యూబ్ కైతే అస‌లు డ‌బ్బులు  క‌ట్టాల్సిన అవ‌స‌రం కూడా లేదు.అన్నిటి కంటే అమెజాన్ బాగా పాపుల‌ర్ అయ్యింది.
లాక్‌డౌన్ స‌మ‌యంలో సినిమా థియేట‌ర్లు మూత‌ప‌డ‌డంతో ఈ యాప్‌లు విజృంభించాయి.వీటికి అల‌వాటుప‌డిన  ప్రేక్ష‌కులు ఇప్పుడు సినిమా హాళ్ళు తెరుచుకున్నా ఎందుకు వస్తారు?
ఇంట్లోనే కూర్చుని టీవీలోనో, కంప్యూట‌ర్ లోనో, సెల్ ఫోన్ లోనో సినిమా చూసే స‌దుపాయం ఏర్ప‌డింది. 3డీ, విజువ‌ల్ గ్రాఫిక్స్ ఉన్న సినిమాల కోసం మాత్ర‌మే  థియేట‌ర్ల‌కు వెళ్ళాల్సి ఉంటుంది.
ఈ యాప్స్ ఉప‌యోగించే సాంకేతిక ప‌రిజ్ఞానం తెలియ‌ని వాళ్ళు మాత్ర‌మే సినిమాల కోసం థియేట‌ర్ల‌ను ఆశ్ర‌యించ‌క త‌ప్ప‌దు.
సినిమా హాళ్ళ‌ను ఆన్‌లైన్ యాప్స్  వెన్నుపోటు పొడిస్తే, కరోనా కోలుకోలేని విధంగా  చావు దెబ్బ‌తీసింది.

(సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ చైనా ఆహ్వానం మేరకు భారత – చైనా మిత్రమండలి తరపున 2015 లో ఆ దేశంలో పర్యటించారు. ఆ పర్యటనానుభవాలతో ‘ ఓ కొత్త బంగారు లోకం ‘ అన్న పుస్తకాన్ని రాసారు. చిత్తూరు జిల్లా సాహితీ దిగ్గ జాల గురించి తన సంపాదకత్వంలో _’ సాహితీ సౌ గంధం ‘ అన్న పుస్తకాన్ని వెలువరించారు. కోస్తా జిల్లాల్లో పుట్టి, తెలంగాణా లో పెరిగి, రాయలసీమ ( తిరుపతి ) లో స్థిరపడ్డారు)

తిరుపతి జ్ఞాపకాలు 12 ఇక్కడ చదవండి

https://trendingtelugunews.com/top-stories/features/raghava-sarma-memoirs-changing-face-of-tirupati/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *