4న జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ధర్నా, 5న బడా కార్పొరేట్ల దిష్టిబొమ్మల దగ్దం, 7న మాజీ సైనికుల అవార్డుల చ్యుతి పిలుపు.
(ఇఫ్టు ప్రసాద్ )
మోడీ ప్రభుత్వ ప్రతినిధి వర్గానికీ, రైతాంగ పోరాట సమన్వయ కమిటీ కీ మధ్య ఈరోజు మరోసారి చర్చలు జరగబోతున్నాయి. రైతాంగ ఉద్యమాన్ని తనదైన బాణీలో నీరుగార్చే లక్ష్యంతో గత రెండు రాత్రుల్లో రహస్య మంతనాలలో మోడీ ప్రభుత్వం మునిగింది. మరో వైపు బడా కార్పోరేట్ సంస్థలు కూడా తమదైన బాణీ లో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏఏ విశ్వసనీయ వర్గాల ద్వారా ఏఏ రైతాంగ ఉద్యమ నేతల్ని ఏఏ పాచికల్ని ఉపయోగించి ప్రలోభ పరుచుకోవాలో, నేడు కార్పోరేట్ వర్గాలు తెర వెనుక నుండి పాచికలాటను చాణక్య నీతితో సాగిస్తున్నాయి.
పై తతంగం ఒక ఎత్తు కాగా, మరో వైపు రైతాంగంలో వాడి, వేడి తగ్గని కొంగొత్త ఉత్తేజకర స్థితి కొనసాగుతూనే వుంది. తెర వెనుక ఒకవేళ ఎవరైనా రైతాంగ ఉద్యమ నేతలు మెత్తబడితే, వారి ఆటల్ని సాగనివ్వని కొత్త భౌతికస్తితి కూడా ఏర్పడుతోంది. ఇంకా ఢిల్లీకి కొత్తగా రైతాంగం కదిలి వస్తూనే వుంది. ముందుగా 15 రోజులకి సరిపడ ఆహారసామగ్రి తో వచ్చిన రైతాంగానికి తమ గ్రామాల నుంచి మరికొన్ని నెలలకు సరిపడ ఆహార సామగ్రితో కొత్త ట్రక్కులు, ట్రాక్టర్లు తరలి వస్తూ వున్నాయి. ఈప్రయత్నాలిలా వుంటే, ఇంకో వైపు కొత్తరకం సంఘీభావం రైతాంగ పోరాటానికి లభిస్తోంది.
తాజా రైతాంగ పోరాటానికి అండగా అఖిలభారత మోటార్ రవాణా సంఘం అత్యున్నత కమిటీ నిన్న 2న అత్యవసర నిర్ణయం చేసింది. ఉత్తర భారత దేశంలో 8 నుండి సంఘీభావ సమ్మె చేయాలని నిర్ణయం చేసింది. మోడీ ప్రభుత్వ నుండి స్పందన లేకపోతే, త్వరలోనే దక్షిణాది రాష్ట్రాలకు కూడా విస్తరించి దేశ వ్యాపిత రవాణా సమ్మెగా మారుస్తామని కూడా అది హెచ్చరించింది. ఇప్పుడు మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చిన మోడీ ప్రభుత్వమే గతంలో రవాణా రంగానికి ఉరిత్రాడు వంటి రోడ్డు భద్రతా చట్టం తెచ్చింది. రవాణా రంగం లో పంజాబ్ అగ్రస్థానంలో వుండటంతో పాటు రోడ్డు భద్రతా చట్ట నేపథ్యం కలిసి బహుశా ఈ తరహా క్రియాశీల సత్వర సంఘీభావ సమ్మె కు దారి తీసి ఉండవచ్చునేమో! ఏది ఏమైనా ఒక బాధిత వర్గ ప్రజలకు అండ గా మరో బాధిత వర్గం చేపట్టే సంఘీభావ ఉద్యమాల చరిత్ర లో ఇదో రికార్డ్ కావచ్చునేమో!
ఇదిలా ఉండగా, రేపు 4న ఢిల్లీ విద్యార్థి లోకం జంతర్ మంతర్ వద్ద సంఘీభావ ధర్నా చేపట్టనున్నది. మరోవైపు రైతులకు అండగా తమ అవార్డులు అండ్ మెడల్స్ ను 7-12-2020న వాపసు ఇవ్వాలని విస్మయం కలిగించే నిర్ణయాన్ని నిన్ననే ఎక్స్ సర్వీస్ మెన్ సంఘం తీసుకోవడం విశేషం. అదే విధంగా దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థల అధిపతులు అంబానీ, ఆదానీ తో పాటు మోడీ దిష్టిబొమ్మల్ని ఎల్లుండి 5వ తేదీన ఊరూరా, వాడవాడ లా దగ్ధం చేయాలనే పిలుపు ఇవ్వడం జరిగింది.
కెనడా తో ప్రారంభమై, లండన్ ఆస్ట్రేలియా తదితర దేశాలకు కూడా సంఘీభావం క్రమంగా విస్తరిస్తోంది. ఇదో విశేషం.
కన్నీళ్లు కార్చే వాళ్లకి తమ సాటి కన్నీళ్లు కార్చే వాళ్ళందరి మద్దతు తోడయ్యే వేళ ఇది. వాగులు, వంకలు, ఏర్లు ఒకటై వరద పోటెత్తిన చందంగా నేడు ఫాసిస్టుతరహా నిరంకుశ పాలన పై సర్వ జనుల సమస్త బాధిత ప్రజల సమైక్య పోరాటం గా మార్చుటకు మన వంతు కృషి కూడా సాగిద్దాం.