మసాలా మహారాజ్ కు నివాళి

(అహ్మద్ షరీఫ్)
జీవితంలో ముందుకెళ్ళాలన్న ఆలోచన, ఎవరికీ కనపడని అవకాశాల్ని  చూడగల్గిన చూపూ, కొత్త దిశల్ని ఆవిష్కరించే మనోబలం వున్న నాడు మసాలా పొడులే  మహాశయుల్ని  సృష్టించగలవు. ఆ మహాశయులు పద్మ భూషణ్ లూ కూడా కావచ్చు. 
మహాశయ్ ధరం పాల్ గులాటి పేరుకి మాత్రమే మహా శయుడు కాదు, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన MDH మసాలాల కంపెనీ  వ్యవస్థాపకుడు.
MDH అంటే “మహాశియా ది హట్టి” (మహాశియా వారి అంగడి) అని అర్థం.  ఖాళీ చేతులూ, ఖాళీ మనసులు మనుషుల్ని ముందుకెళ్ళనీయవు. మహాశయ్ మనసు ఖాళీగా లేదు, దానిలో భవిష్యత్తులో తానేదో సాధిస్తానన్న ఆశ, ఆ ఆశ ను సాకారం చేసుకో గలనన్న ఉత్సాహం అతణ్ణి ప్రపంచ ఖ్యాతి చెందిన MDH మసాలా పొడుల సంస్థ యజమానిగా నిలబెట్టింది.
సియాల్ కోట్ (ఇప్పటి పాకిస్తాన్ లో వుంది) లోని  ఓ కుటుంబం లో మార్చి 27, 1923 లో జన్మించాడు ధరం పాల్ గులాటి  చదువు అబ్బలేదు. అయిదో తరగతి వరకు చదివాడు కానీ పరీక్షలు రాయలేదు. 1933 లో కుటుంబ వ్యాపారమైన మసాలాలు అమ్మే చిన్న కిరాణం కొట్టు (“మహాశియా ది హట్టి”) లాంటి దాన్లో కూర్చో బెట్టాడు తండ్రి. అలా మొదలయింది ఆయన ఉద్యోగ పర్వం. 1947 లో స్వాతంత్ర్యం వచ్చి దేశవిభజన జరిగిన తరువాత, ధరం పాల్ గులాటి కుటుంబం వున్నదంతా వదిలిపెట్టి, ఢిల్లీ వచ్చేసింది. బ్రతుకు తెరువు  మొత్తం మళ్ళీ మొదటినుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏం చేయడానికీ పాలు పోక ఆయన   వున్న కొద్ది పాటి డబ్బుల్తో ఒక టాంగా కొనుక్కుని నడపడం మొదలు పెట్టాడు. అయినా ఆయన మనసులో ని వ్యవస్థాపకుడు, వ్యాపార వేత్త చావలేదు.
 
Photo source: MDH spices
  
టాంగా నడపడం నచ్చని ధరం పాల్ గులాటి దాన్ని వదిలేసి ఇంటి దగ్గరే మసాలా పొడులు చేసి అమ్మడం మొదలు పెట్టాడు. మెల్లగా చిన్న పెట్టుబడితో ఢిల్లీ కీర్తినగర్లో చిన్న కార్ఖానా మొదలు పెట్టాడు తరువాత మెల్లగా మరొకటి, మరొకటి గా కలుపుతూ మసాలా పొడుల వ్యాపారాన్ని విస్తరించాడు.
రోజు 1000 కి పైగా డిస్ట్రిబ్యూటర్లూ, 4 లక్షలకు పైగా రిటెయిలర్లతో మసాలా పొడులు ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడవుతున్నాయి. మసాలా పౌడర్లు, లండన్, అమెరికా, ఆఫ్రికా న్యూజిలాండ్, సౌదీ, సింగపూర్లలో విరివిగా అమ్ముడు పోతున్నాయి. ఇప్పుడు MDH  వద్ద ఒక రోజులో దాదాపు 30 టన్నుల మసాలా పొడులు తయారు చేయడానికి, పాకీంగ్ చేయడానికి అవసరమైన సాంకేతికతా ఆధునిక యంత్రాలూ వున్నాయి. ఒక అంచనా ప్రకారం కంపెనీ టర్నోవర్  2000 కోట్ల పైచిలుకు.
భారత దేశం, దుబాయి లలో ఈ కంపెనీ కి 18 ఫాక్టరీలున్నాయి. ఈ కంపెనీ చనా మసాలా, గరం మసాలా, పావ్ భాజీ మసాలా ల లాంటి 62 రకాలా ఉత్పాదకాలతో ఉత్తర భారత దేశం లో 80% మార్కెట్ షేర్ కలిగి ఈ వ్యాపార క్షేత్రం లో ఎవరెస్టు మసాలా ల తరువాత రెండో స్థానం లో వుంది.
ఈ కంపెనీ ఒక వ్యాపార ప్రకటన తయారు చేస్తున్నపుడు, ఒక సన్నివేశం లో పెళ్లి కూతురు తండ్రి గా నటించే నటుడు రాలేదు. అప్పుడు డైరెక్టరు ధరం పాల్ తో నే తండ్రి పాత్ర చేయించాడు. ఈ రకంగా వ్యాపార ప్రకటనల్లో వచ్చే అత్యంత అధిక వయసుగల నటుడిగా ఈయన వుండటం ఆసక్తికరం.       
జీవితపు అట్టడుగు పొరనుంచి పైకి వచ్చిన ధరం పాల్ కి ఎదుటి వారి కష్టాల గురించి తెలుసు. కారణంగానే ఆయన తన తండ్రి పేరు మీదచున్నీలాల్ చారిటబుల్ ట్రస్ట్” ను స్థాపించాడు. ట్రస్టు ద్వారా, స్కూళ్లూ, ఆసుపత్రులూ, ఆశ్రమాలూ స్థాపించి పేదలకూ, అవసరమున్న వారికీ సేవలు చేపట్టాడు
ఆయన సేవా నిరతికి  2019 లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. గత మూడు వారాలు గా అనారొగ్యంతో  వున్న ధరం పాల్  గులాటి ఈరోజు (3-12-2020) తెల్లవారు జాము 5.30 కి తుది శ్వాస  వదిలారు. ఆయన వయసు 97 సంవత్సరాలు.   ఎంతో మందికి వుద్యోగ భృతి కల్పించి మరెంతో మంది కి ప్రేరణ అయి Spice King (మసాలాల మహరాజు)  గా ప్రఖ్యాతి చెందిన  ఆయన మరణం తీరనిలోటే.
(అహ్మద్ షరీఫ్ , రచయిత,  సినిమా విశ్లేషకుడు, ప్రాజెక్టుమేనేజ్ మెంట్ కోచ్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *