రేపటి ఎన్నికల విషయంలో హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. వరదనీటితో అతలాకుతలమై, రోజుల తరబడి సొంత ఇళ్ళలో ఉండలేక ఎక్కడెక్కడో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీసం పలకరించటానికి కూడా దొరకు తీరిక దొరకలేదు, ఓట్లు అడగటానికి మాత్రం తయారై వచ్చేశాడని జనం మండిపడుతున్నారు. చివరకు టీఆర్ఎస్ సానుభూతిపరులు కూడా ఈసారి కారుకు గట్టి ఢక్కా తగలితేనే కేసీఆర్ సరిగ్గా సెట్ అవుతాడు, అహంకారం దిగిపోతుంది అనుకుంటున్నారంటే జనం అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. డిసెంబర్ 4న వెలువడే ఫలితాల్లో టీఆర్ఎస్‌కు మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగలబోతుందనేది సుస్పష్టం. అయితే, ప్రజల పల్స్ ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే, సీపీఐ నారాయణ మాత్రం నిన్న ఒక కొత్త పాయింట్ తీశారు. ఒక బక్కాయనను ఎదుర్కోటానికి ఇంతమంది కాషాయ బాహుబలులా అని ప్రశ్న లేవనెత్తారు.
మోదీ,అమిత్ షా అనైతిక రాజకీయ విన్యాసాలతో బరితెగించారని సీపీఐ నారాయణ నిన్న విమర్శించారు. ఆ వాదనలో నిజం లేకపోలేదు. గ్రాండ్ ఓల్డ్ పార్టీని మట్టికరిపించి అత్యధిక మెజారిటీతో గద్దెనెక్కిన బీజేపీ,ఆరున్నర ఏళ్ళనుంచి వరసగా వివిధ రాష్ట్రాల ఎన్నికలలో అధికారాన్ని చేజిక్కించుకోవటంకోసం ఆ కాంగ్రెస్ కంటే అనైతిక, నీచ రాజకీయాలకు పాల్పడుతూ, ఆ క్రమంలో కర్ణాటక తర్వాత దక్షిణాదిలో మరింతగా చొరబడటానికి తెలంగాణను లాంచింగ్ ప్యాడ్‌లాగా ఎంచుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే మతం మత్తును దక్షిణాది ప్రజలకుకూడా అలవాటు చేయాలని కమలనాథులు ఉవ్విళ్ళూరుతున్నారు.మతంపేరుతో హిందువులను ఏకం చేయటానికి(పోలరైజేషన్) ప్రయత్నిస్తున్నారు.
అయితే, మతం పేరుతో పోలరైజేషన్ అనే విషయంలో బీజేపీతో పోలిస్తే కేసీఆర్ ఏమీ పులుకడిగిన ముత్యమో, సుద్దపూసో కాదనేది కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం. ఎంఐఎం పార్టీని కేసీఆర్ ఎలా పెంచి పోషిస్తున్నారన్నది అందరికీ తెలిసిందే. గ్రేటర్ ఎన్నికలకు కొద్దిరోజులు ముందు ఎన్ని నంగనాచి కబుర్లు చెప్పినా, ఎన్నికల తర్వాత టీఆర్ఎస్, మజ్లిస్ మిలాఖత్ అవుతాయన్నది జగమెరిగన సత్యమే. ఆ మజ్లిస్ పార్టీ ఇప్పుడు హైదరాబాద్‌ను దాటిపోయి దేశవ్యాప్తంగా చేస్తున్నది మతపరమైన పోలరైజేషన్ కాక మరేమవుతుంది? కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే గత 5-6 ఏళ్ళుగా మజ్లిస్ పార్టీ expansion ఉధృతంగా సాగుతోంది. మొన్న మహారాష్టలో ఒక ఎంపీ స్థానాన్ని, రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవటంతోబాటు ఎన్నోచోట్ల కాంగ్రెస్ విజయావకాశాలను తారుమారు చేసింది.నిన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఐదు సీట్లను గెలుచుకోవటంతోబాటు అనేక చోట్ల ఫలితాలను ప్రభావితం చేసింది(బీహార్ ఎన్నికలలో పోటీ చేసేందుకు ఎంఐఎంకు కేసీఆర్ నిధులు సమకూర్చారన్న ఆరోపణ ప్రచారంలో ఉంది). యూపీ మున్సిపల్ ఎన్నికలలోకూడా మంచి ఫలితాలను సాధించింది.
తెలంగాణ వ్యాప్తంగా గణనీయంగా ఉన్న ముస్లిమ్ ఓట్లకోసం ఎంఐఎం పార్టీతో అంటకాగుతూ – ముస్లిమ్‌లను ప్రసన్నం చేసుకోవటానికి గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన appeasement politics నే అనుసరిస్తున్న కేసీఆర్, ఈ కమలనాథులకన్నా ఏ విధంగా మెరుగైన ప్రత్యామ్నాయం అవుతాడనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. మతం విషయంలో కేసీఆర్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ఠ – మొన్న వారి పత్రిక ‘నమస్తే తెలంగాణ’లో వెలువడిన ఒక ఫుల్ పేజి వ్యాసం.కేసీఆర్ కాషాయం రంగు శాలువా కప్పుకున్న ఫోటోతో వెలువడిన ఆ వ్యాసంలో – నిఖార్సయిన హిందూత్వానికి నిర్వచనం కేసీఆర్ అని, అనేక యాగాలకు, జిల్లాలకు, ప్రాజెక్టులకు దేవుళ్ళ పేర్లు పెట్టారని, రెండువేల కోట్ల రూపాయలతో యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారని ఆ వ్యాసంలో రాసుకొచ్చారు.
ఏది ఏమైనా కేసీఆర్ అహంకారానికి, నిరంకుశత్వానికి అడ్డుకట్ట పడాలని అందరూ కోరుకుంటున్నారు. నిన్న మొన్నటి వరదబాధితుల విషయమే కాదు, ఆ మధ్య కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదంలో 50 మందికి పైగా చనిపోతే బాధితులను పరామర్శించటం, ఘటనాస్థలాన్ని సందర్శించటంవంటి కనీసబాధ్యతలను ముఖ్యమంత్రి పాటించకపోవటాన్ని కూడా జనం మర్చిపోలేదు.యావత్తు రాష్ట్రాన్నీ, తన సొంత సంస్థానంలాగానో, జాగీరులాగానో, తన whims and fancies కు అనుగుణంగా పాలిస్తుండటాన్ని అందరూ గమనిస్తునేఉన్నారు. పార్టీలో ప్రభుత్వంలో తండ్రీ కొడుకులు తప్ప అందరూ లాంఛనప్రాయంగా, నామమాత్రంగా మిగిలిపోతున్నారు. చివరకు రాష్ట్రస్థాయి నాయకుడైన హరీష్ రావును ఈ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని పఠాన్ చెరువు ప్రాంతంలోని మూడు డివిజన్‌లకు పరిమితం చేయటం గమనార్హం. పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి నివురుగప్పిన నిప్పులాగా ఉంది. అది ఎప్పుడో బరస్ట్ అయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
బల్దియాలో బీజేపీ గెలిస్తే భాగ్యనగరంలో మతకలహాలు వస్తాయని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలో ఏమాత్రం పసలేదని కొద్దిగా విచక్షణతో ఆలోచించేవారికి ఎవరికైనా అర్థమవుతుంది. బల్దియా అనేది కేవలం మున్సిపల్ కార్పొరేషన్ పాలనకు సంబంధించినది. శాంతిభద్రతలు ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంటాయి.
బీజేపీ ఎంతగా సర్వశక్తులు ఒడ్డి పోరాడినా,కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీ, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు నద్దా వంటి దిగ్గజాలు ప్రచారం చేసినా మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవటం మాత్రం చాలా కష్టమైన విషయమే. ఎందుకంటే ఎక్స్అఫిషియో సభ్యులతో కలిసి మేయర్ ఎన్నికలో మొత్తం 202 ఓట్లు ఉంటాయి. మొత్తం 52 మంది ఎక్స్ అఫిషియో సభ్యులలో ప్రస్తుతం 7 ఓట్లు చెల్లకపోవటంతో 150+45 మొత్తం 195 ఓట్లు ఉన్నట్లు. టీఆర్ఎస్, ఎంఐఎంలకు కలిపి ప్రస్తుతం 41 ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లు ఉన్నాయి. ఇంకా మెజారిటీ రావాలంటే ఈ రెండు పార్టీలూ కలిపి 67 డివిజన్లు చేజిక్కించుకుంటే చాలు. గత బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 స్థానాలు గెలుచుకుంది. నాడు తెలంగాణ వ్యాప్తంగా ఒక మంచి ఫీల్ గుడ్ వేవ్ ఉండింది. దానికితోడు నాడు టీడీపీలో ఉన్న హైదరాబాద్ ప్రముఖులు తలసాని, తీగల వంటివారు ఈ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ లోకి వచ్చారు. దానితో పార్టీకి మరింత బలం చేకూరింది. ఆంధ్రా సెటిలర్స్ ఓట్లుకూడా టీఆర్ఎస్‌కే పడ్డాయి. ఆ ప్రభావంతోనే కారుకు అంత ఘన విజయం లభించింది. ఈసారి ఆ 99లో సగం వస్తే గొప్పే అంటున్నారు. సెటిలర్స్ ఓట్లు టీఆర్ఎస్‌కు పడటం కష్టమే. మరోవైపు, బీజేపీకి కేవలం మూడే ఎక్స్ అఫిషియో స్థానాలు ఉండటంతో, ఆ పార్టీ మేయర్ స్థానాన్ని చేజిక్కించుకోవాలంటే 95 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. అయితే అంత బృహత్తర లక్ష్యం సాధిస్తామని బీజేపీ ఆశలు పెట్టుకోవటంలేదుగానీ, ఇంతకుముందు ఉన్న 4 స్థానాలనుంచి కనీసం 50కు పైగా స్థానాలకు పెరిగితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఉత్సాహం వస్తుందని ఆశిస్తోంది.ముఖ్యంగా పాతబస్తీలోని సుమారు 50 డివిజన్లకుగానూ – అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హిందూ ఓట్లు బాగా పోలరైజ్ అవ్వనుండటంతో – కనీసం 15 స్థానాలు వస్తాయని బీజేపీ ఆశలు పెట్టుకుంది.
ఇప్పటికే డబ్బు వరదలా ప్రవహిస్తోంది. అధికారపార్టీ తమ అభ్యర్థి ఒక్కొక్కరికి రు.2 కోట్ల చొప్పున పంచుతోందని, ఒక్కో డివిజన్‌లో ఒక ఎమ్మెల్యేకో, ఎంపీకో డబ్బులు పంచే బాధ్యతను అప్పజెప్పిందని ప్రతిపక్షాల అభ్యర్థులు ఆరోపిస్తుండగా, బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ స్వయంగా హైదరాబాద్‌లో కూర్చుని డివిజన్‌కు రు.50 లక్షల చొప్పున పంచుతున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇక అక్కడక్కడా – పోటీ బలంగా ఉన్నచోట్ల, ఓటుకు రు.10 వేలదాకా ఇస్తున్నట్లు సమాచారం అందుతోంది. మొత్తంమీద నల్లడబ్బుమాత్రం వందలకోట్లు హైదరాబాద్ మార్కెట్‌లోకి ప్రవహించింది.దీనిలో ఓటర్లకు అందేదానికంటే, మధ్యనున్న బ్రోకర్‌ల జేబుల్లోకి వెళ్ళేదే ఎక్కువ ఉంటుంది.ఏది ఏమైనా, వ్యవధి కాస్త ఎక్కువగా ఉంటే, ఈ ఎన్నికలపై ఆధారపడి బతికే ప్రింటింగ్ ప్రెస్సులవాళ్ళు, తీన్ మార్ కొట్టేవాళ్ళు వంటి వివిధ రంగాల వ్యక్తులకు సంతోషంగా ఉండేది.