(రాఘవశర్మ)
తిరుపతి కి దక్షిణాన ఉన్న ఎగూరు (ఉల్లిపట్టిడ).మరొక వూరు దిగూరు. దీని అసలు పేరు ముత్యాలరెడ్డి పల్లె. ఒకపుడు ఇవి రెండు పల్లెలే. వీటికి పంచాయతీలుండేవి. ఇపుడయితే తిరుపతి మునిసిపాలిటిలో వీలీనమయ్యాయి.
1977నాటి మాట.
ఎగూరులో ఆ రోజుల్లో అంతా పూరిళ్ళే. అక్కడొకటి అక్కడొకటి మిద్దిల్లు కనిపించేవి.
దిగూరు(ముత్యాలరెడ్డి పల్లె)లో చాలా మటుకు మిద్దిళ్ళు. కొన్ని పూరిళ్ళు కూడా ఉండేవి.
పూరిళ్లు ఎలా కట్టే వారో తెలుసా?
చుట్టూ రాతి కూసాలు నాటి, వాటి మధ్యలో మట్టితో గోడలు కట్టేవాళ్ళు. మట్టి బదులు కొందరు ఇటుకలతో గోడ కట్టేవారు.
పైన తాటి దూలాలు వేసి, అడవి నుంచి తెచ్చిన బోదతో కప్పేవారు. మట్టితో కట్టిన ఇళ్ళలో చలికాలం ఎంత వెచ్చగా ఉంటుందో, ఎండాకాలం అంత చల్లగా ఉండేది.
ఈ పూరిగెడిసె ఒకరకంగా సెంట్రలైజ్డ్ ఏసీనే. దీర్ఘ చతురస్రాకారంలో ఉండే ఇంటి ముందు అదే బోదతో వరండా కూడా దించేవారు.
ఆ ఇంటి పక్కనే గుండ్రంగా మరొక చుట్టు గుడిసె ఉండేది.ఆ చుట్టు గుడిసెలోనే వంటా వార్పు. ఆ పక్కనే పశువుల కొట్టాలు.
అది 1977-78 నాటి పరిస్థితి.
ఎగూరులోనూ, దిగూరు లోనూ ఇప్పుడు చూద్దామన్నా పూరిగుడిసెలు లేవు.అన్నీ మిద్దిళ్ళు అయిపోయాయి.
ఈ నాలుగు దశాబ్దాలలో ఎంత మార్పు!
రెండు గ్రామాల్లో వెతికితే ఒకే ఒక్క పూరిగుడిసె కనిపించింది.అది కూడా మాజీ సర్పంచ్ శంకరరెడ్డి ఇల్లు. పజ్జెనిమిదేళ్ళు సర్పంచ్‌గా పనిచేసిన శంకర రెడ్డి బతికినంత కాలం ఆ పూరింట్లోనే ఉన్నాడు.
ఉల్లిపట్టిడలో రాంమందడి అన్న టైలర్ మా ఇంటికి తరచూ వచ్చేవాడు. గళ్ళ లుంగీ కట్టుకుని, అర చేతుల చొక్కా వేసుకుని సన్నగా ఉండేవాడు.
మా ఇంటికి రాగానే పైకి మడిచి కట్టుకున్న లుంగీ ని కాస్తా మర్యాద కోసం జెండాను అవనతం చేసినట్టు దించేసేవాడు .
ఫిల్టర్ కాఫీ ఇస్తే చాలు, ఆ తమిళ ప్రాణం ఎంత ఆనందపడిపోయేదో! ఎన్ని కబుర్లు చెప్పేవాడో!
తెలుగు, తమిళం కలబోతగా ఉండేది అతను మాట్లడే భాష. రెండు భాషల కలబోతతో వచ్చిన ఆ మాధుర్యాన్నిబాగా ఆస్వాదించే వాళ్ళం.
ఊర్లో ఎవరెవరు ఏమిటో అందరి సంగతులు చెప్పేవాడు.
‘ఏం రాంమంద డీ ఈ మధ్య కనిపించడం లేదు ‘ అని మా అమ్మ అడిగితే, ‘ మొన్న దా వచ్చినాను గదమ్మా ‘ అనే వాడు.
‘ దిగూరులో ఇప్పుడుదా పప్చర్ గారింటికి వెళ్ళి వస్తాండా ‘ అన్నాడు ఒక సారి.
‘ పప్చర్ ఏమిటి? రాంమందడి ‘ అని అడిగాను.
‘ యూనిర్సిటీలో పనిచేస్తాడు సార్ పప్చర్. మీ వోళ్ళే ‘ అన్నాడు.
పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ సుబ్బారావు గారి పేరు రాంమందడి నోట్లో అలా పలికేది.
అప్పటి వరకు కాకినాడకు చెందిన సుబ్బారావు గారెవరో మాకు తెలియదు. రాంమందడి వల్లే వారి కుటుంబం మాకు పరిచయమయ్యింది.
ఆరోజుల్లో సుబ్బారావుగారి పర్యవేక్షణలో భూమన్ గారు ఆంధ్రప్రదేశ్‌లో నక్సల్‌బరీ ఉద్యమం పై పీహెచ్‌డీ కోసం పరిశోధన చేస్తున్నారు. భూమన్ నియర్ కాలేజిలో సివిక్స్ లెక్చరర్‌గా చేసేవారు.
భూమన్ గారిని తొలుత అంతకుముందు జరిగిన చెలం సాహిత్య సభలో చూసినప్పటికీ, సుబ్బారావు గారింట్లోనే వారితో పరిచయమేర్పడింది. సుబ్బారావు గారు స్నేహశీలి, మంచి భోజన ప్రియులు కూడా.
‘ ఇల్లు కట్టుకోను చిన్న కయ్యుండాది తీసుకోండమ్మా బచ్చలోళ్ళు అమ్మతాండారు ‘ అన్నాడు రాంమందడి ఒక సారి.
అది 1977. తిరుపతి వచ్చి అయిదేళ్ళవుతున్నా అప్పటివరకు ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన మాకు ఏ మాత్రం కలగ లేదు.
రాంమందడి మాటలతోనే మాలో సొంత ఇంటి ఆశ చిగురించింది. అతని పుణ్యమాని ఆ చిన్న కయ్య కొన్నాం.
అప్పుడు ఆ పదమూడున్నర సెంట్ల కయ్య ఖరీదు రెండున్నర వేలు. రిజిస్ట్రేషన్ కు 250 రూపాయలైంది.
‘ మనూరికి అయ్‌వోరోళ్ళొచ్చి ధరలు పెంచేస్తాండారు’ అన్నది ఆ ఊర్లో చాలా మంది నోట వచ్చిన మాట.
ఆ మాట ఎందుకన్నారంటే, ఆ రోజుల్లో మఠం భూములు ఎకరా నాలుగైదు వేలకే దొరికేది.ఎకరాలో ఎనిమిదో వంతు కూడా లేని భూమిని రెండున్నర వేల రూపాయలకు కొనడం వారికి ఆశ్చర్యం కలిగించింది.
అమాయకంగా ధర ఎక్కువ పెట్టామని కొందరు నవ్వుకున్నారు కూడా.
మరుసటి ఏడు ఆ జాగాలో పెంకుటిల్లు కట్టుకుని, బావి తవ్వుకుని, చుట్టూ కొబ్బరి చెట్లు నాటాం.పూల మొక్కలు, కూరగాయ మొక్కలు పెట్టాం.
మా నాన్న ఉద్యోగ రీత్యా ఎన్ని ఊళ్ళు తిరిగినా, ఎక్కడా స్థానికులు కాలేకపోయాం. ఇన్నాళ్ళకు ఈ ఊరు వాళ్ళం అని చెప్పుకోడానికి సొంత ఇల్లు ఉపయోగపడింది. తిరుపతికి దక్షిణాన మాది చిట్టచివరి ఇల్లు. చుట్టూ మిరప, వేరుశెనగ, కంది చేలు. మధ్యలో మా పెంకుటిల్లు.
కరంకబాడి నుంచి వచ్చే సన్నని వెదురు పుల్లలతో కట్టిన తడికెలతోనే పశువులు రాకుండా ఇంటికి ప్రహరీలా కంచె నిర్మించాం.
మా ఇంటి ముందు నాలుగడుగులు లోతైన చిన్న వంక ఉండేది. ఆ వంక లోంచే ఊళ్ళోకి వెళ్లాలి. వంకలోంచే ఎద్దుల బండ్లు తెల్లవారు జామున పొలాలకు వెళ్ళేవి.
వేసవిలో అరుగులకు దోమ తెరలు కట్టుకుని ఆరుబయట పడుకునే వాళ్ళం.
పొలాలకు వెళ్ళే ఎద్దుల మెడలలో కట్టిన గంటల శబ్దాలతో మెలకువ వచ్చేది. మా ఇంటి ముందు వంకకు ఆవల తాటి చెట్లు.
ఆ తాటి చెట్ల వెనుక నుంచి ఉదయించే సూర్యకిరణాలకు నిద్ర లేచేవాళ్ళం. మా ఇంటి ముందుర నుంచే పశువులను అవిలాల చెరువు వైపు మేతకు తోలుకెళ్లే వాళ్ళు.
పెంకులపైన నాలుగు చినుకులు పడితే చాలు టపటపా మంటూ శబ్దం వినిపించేది. రాత్రి ఎంత నిద్దరలో ఉన్నా వర్షం జాడ తెలిసిపోయేది.
ఓ రోజు రాత్రి పెద్ద ఎత్తున గాలి వాన వచ్చింది. చాలా చెట్లు పడిపోయాయి. చాలా ఇళ్ళపైన రేకులు లేచిపోయాయి. అంతా బీభత్సంగా ఉంది.
ఊరిబయట ఒంటరిగా చేలలో ఉన్న మా ఇంటికి తెల్లారే సరికల్లా చాలా మంది వచ్చారు. ‘ ఈ గాలి వానకు అయ్‌వారోళ్ళు ఏమై పోయినారో ‘ అని వాకబు చేశారు.
గాలి వానకు పెంకులు ఎగిరిపోయాయేమోనని భయపడ్డారు. క్షేమంగా ఉన్నామని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
మాకు ఆశ్చర్యం వేసింది. వచ్చిన వాళ్ళెవరూ మాకు బందువులు కాదు! కనీసం బాగా తెలిసిన వాళ్ళు కూడా కాదు!
అదే పల్లె హృదయం !
ఏ మై పోయినా సరే నగరాలు, పట్టణాల లో పక్కింటి వారిని కూడా పట్టించు కోరు.
అదే పల్లెకు, పట్టణానికి ఉన్న తేడా!
రాంమందడి పుణ్యమాని ఇల్లు కట్టుకుని, కాకతాళీయంగా మేం తిరుపతి వాస్తవ్యులైపోయాం.
పక్షికైనా, మనిషికైనా సొంత గూడు అవసరం.
చలి నుంచి, ఎండ నుంచి, వాన నుంచి అది రక్షిస్తుంది.
ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆ గూడే మనల్ని కాపాడుతుంది.
సొంత ఇల్లు లేకుండా ఏ ఊళ్ళో ఎన్నేళ్ళున్నా మనం పరాయి వాళ్ళ కిందే లెక్క.
సొంత ఇల్లు ఉంటేనే స్థానికులుగా గుర్తింపు.
గుడిసె అయినా పరవాలేదు.
సొంత గూటిలోనే చివరి శ్వాస విడవాలి.
త్వరగా శవాన్ని ఎత్తేయాలని ఎవరి ఒత్తిడీ ఉండకూడదు.
తమిళనాడుకు చెందిన రాం మందడి కొన్నాళ్ళకు కనిపించకుండా పోయాడు.
మేం ఒక గూడు ఏర్పాటు చేసుకోడానికి మార్గం చూపించినవాడు.
ఆ కుట్టు మిషన్ ఎత్తుకుని గూడు కోసం ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు.
బహుశా తమిళనాడు వెళ్ళిపోయాడేమో!.
ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు.
కానీ మా జ్ఞాపకాలలో మాత్రం రాం మంద డి ఇలా మిగిలిపోయాడు.
(సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ చైనా ఆహ్వానం మేరకు భారత – చైనా మిత్రమండలి తరపున 2015 లో ఆ దేశంలో పర్యటించారు. ఆ పర్యటనానుభవాలతో ‘ ఓ కొత్త బంగారు లోకం ‘ అన్న పుస్తకాన్ని రాసారు. చిత్తూరు జిల్లా సాహితీ దిగ్గ జాల గురించి తన సంపాదకత్వంలో _’ సాహితీ సౌ గంధం ‘ అన్న పుస్తకాన్ని వెలువరించారు. కోస్తా జిల్లాల్లో పుట్టి, తెలంగాణా లో పెరిగి, రాయలసీమ ( తిరుపతి ) లో స్థిరపడ్డారు)
తిరుపతి జ్ఞాపకాలు -11 ఇక్కడ చదవండి
https://trendingtelugunews.com/top-stories/features/tiruapti-woman-who-got-rid-off-cows-to-find-time-to-watch-moview/